CBN to Jagan: చంద్రబాబు ఆలోచన.. జగన్ ఆచరణ.. అంతెత్తున అంబేడ్కర్-why did jagan fulfill chandrababus promise regarding construction of ambedkar statue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn To Jagan: చంద్రబాబు ఆలోచన.. జగన్ ఆచరణ.. అంతెత్తున అంబేడ్కర్

CBN to Jagan: చంద్రబాబు ఆలోచన.. జగన్ ఆచరణ.. అంతెత్తున అంబేడ్కర్

Sarath chandra.B HT Telugu
Jan 19, 2024 11:50 AM IST

CBN to Jagan: ఎనిమిదేళ్ల క్రితం రాజకీయ విమర్శలు, ఆరోపణల్లో అమరావతి నిర్మాణం చిక్కుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని జగన్ ఎందుకు పూర్తి చేశారు?

విజయవాడలో నిర్మించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
విజయవాడలో నిర్మించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం

CBN to Jagan: ఆంధ్రప్రదేశ్‌లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ ఆలోచన నిజానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిదే. 2016లో అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు ఈ ప్రకటన తెరపైకి తెచ్చారు.

yearly horoscope entry point

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ-గుంటూరు నగరాల మధ్య కృష్ణానది తీరంలో 33వేల ఎకరాల విస్తీర్ణంలో ఏపీ రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 2015 దసరాకు శంకుస్థాపన చేసి ఏడాదిలోపే కొన్ని భవనాలను ప్రభుత్వ కార్యాలయాల కోసం వెలగపూడిలో సిద్ధం చేశారు.

అమరావతి నగరం పేరుతో అప్పటికే పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు శరవేగంగా పనులు కూడా జరిగాయి. ఆ సమయంలో రాజధానిలో 33వేల ఎకరాల వ్యవసాయ భూముల్ని సేకరించడంతో దళితులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయారనే విమర్శలు వచ్చాయి. వైసీపీ, జనసేనతో పాటు వామపక్షాలు చంద్రబాబు తీరును తప్పు పట్టాయి. అమరావతి నిర్మాణంపై రకరకాల సందేహాలను లేవనెత్తారు.

ఓ వైపు భారీ ప్రణాళికతో కూడుకున్న రాజధాని నిర్మాణం, వేల కోట్ల నిర్మాణ వ్యయం, భూసేకరణ సమస్యలు, ప్రతిపక్షాల పోరాటాలు, రాజకీయ పార్టీల ఆందోళనల నడుమ అనూహ్యంగా 2016 ఏప్రిల్‌లో అంబేడ్కర్ జయంతి సందర్భంగా చంద్రబాబు రాజధానిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

నీరుకొండలో విగ్రహం…

రాజధాని కోసం భూములు సేకరించిన ప్రాంతంలో దక్షిణాన మంగళగిరికి అవతల నీరుకొండ ప్రాంతంలో కొండపై అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు రూ.130-140 కోట్ల రుపాయల వ్యయంతో ఈ విగ్రహ నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఏడాదిలోగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని నిర్మించి అంబేడ్కర్ 125వ జయంతిని చిరకాలం గుర్తుంచుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పదేపదే చెప్పేవారు.

టీడీపీ హయంలో తలపెట్టిన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం రకరకాల కారణాలతో ఆలస్యమైంది. దీనికి ప్రధాన కారణం ప్రధాన నగరానికి దూరంగా విగ్రహ నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేయడం కూడా ఓ కారణం. అప్పటికీ అమరావతిలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు లేవు.

రోడ్ల నిర్మాణం జరగలేదు. అయినా కొండపై ఎత్తైన ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం తలపెట్టారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులను వినియోగించి విగ్రహాన్ని నిర్మించాలని భావించారు. అయితే నిధుల కేటాయింపు దగ్గర తీవ్ర జాప్యం జరిగింది. దీంతో పనులు 2019లో ప్రభుత్వం మారే నాటికి 30శాతం కూడా పూర్తి కాలేదు. అంబేడ్కర్ విగ్రహంతో పాటు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని 100అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా చంద్రబాబు ప్రకటించారు.

మారిపోయిన ప్రాధాన్యతలు...

2019 ఎన్నికల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణం తమ ప్రాధాన్యత లేదని జగన్ తేల్చేశారు. దీంతో అమరావతిలో పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. 2019డిసెంబర్‌‌లో రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే కోవిడ్ ముంచుకు వచ్చింది. ఓ వైపు ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు, రాజధాని కొనసాగించాలనే ఆందోళనలు, రాజకీయంగా భిన్నాభిప్రాయాల నేపథ్యంలో 2020వ సంవత్సరంలో ప్రభుత్వం అనూహ్యంగా విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్నినిర్మిస్తామని ప్రకటించింది.

దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో అమరావతి పనుల్ని సమీక్షించిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో తలపెట్టిన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని రాజధాని ప్రాంతం నుంచి విజయవాడకు మారుస్తున్నట్లు ప్రకటించారు.

ఒకే నిర్ణయం బోలెడు ప్రయోజనాలు...

విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలనే వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వెనుక రకరకాల కారణాలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం వెనుక ఓ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని మొదట్నుంచి వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో విజయవాడ వంటి నగరంలో, సామాజిక సమీకరణలు తీవ్రంగా ప్రభావితం చేసే ప్రదేశంలో నగరం నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రాజకీయంగా తమకు అనుకూలిస్తుందన వైసీపీ భావించింది.

అమరావతి నిర్మాణ పనుల్ని పూర్తిగా పక్కన పెట్టేసినా, అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని మాత్రం 2021లో ప్రారంభించింది. ఏడాదిలోగా విగ్రహాన్ని పూర్తి చేయాలని భావించినా డిజైన్లు ఖరారు కావడంలో జాప్యం జరగడంతో ఎప్పటికప్పుడు గడువు పొడిగిస్తూ పోయారు. విజయవాడలో రూ.170కోట్ల రుపాయల అంచనాలతో చేపట్టిన అంబేడ్కర్ స్మృతి వనం చివరకు నిర్మాణం పూర్తయ్యే నాటికి రూ.404కోట్లకు చేరింది.

మరోవైపు చంద్రబాబు ప్రకటన తర్వాత తెలంగాణలో సైతం కేసీఆర్‌ ఇదే తరహా ప్రకటన చేశారు. తెలంగాణ నెక్లెస్ రోడ్డు ఒడ్డున 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గత ఏడాది అంబేడ్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ, తెలంగాణల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఒకే సంస్థ చేపట్టింది.

తెలంగాణలో విగ్రహ నిర్మాణం రూ.200కోట్ల లోపు ఖర్చుతో ముగించారు. ఏపీలో మాత్రం రెట్టింపు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.విగ్రహ నిర్మాణంతో పాటు మ్యూజియం, ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ల నిర్మాణం, ల్యాండ్ స్కేపింగ్‌ ఇతర పనులకు పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు సర్కారు చెబుతోంది.

ఓటు బ్యాంకు కోసమేనా?

మొత్తం మీద చంద్రబాబు ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణం ఆలోచనను జగన్మోహన్ రెడ్డి ఆచరణలో అమలు సాకారం చేశారు. అమరావతి తమ ప్రాధాన్యత కాదని తేల్చేసిన జగన్ అంబేడ్కర్‌ను మాత్రం సొంతం చేసుకోవాలని భావించారు. అందుకే విగ్రహాన్ని నీరుకొండ నుంచి విజయవాడ మధ్యలోకి మార్చారు.

అది కూడా టీడీపీకి కంచుకోటలా భావించే విజయవాడ నగరం మధ్యలో దానిని ఏర్పాటు చేయడం ద్వారా ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలనే ఆలోచన కూడా జగన్‌లో ఉండొచ్చు. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్న సామాజిక వర్గాలను ఎప్పటికి తమ వైపు నిలుపుకోడానికి అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం ఏ మేరకు ఉపకరిస్తుందో రానున్న ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి.

Whats_app_banner