Pawan Warns PraksahRaj: ప్రకాష్ రాజ్ బాధేంటి? సెక్యులరిజం అంటే ముందు తెలుసుకోవాలన్న పవన్ కళ్యాణ్
Pawan Warns PraksahRaj: తిరుమల తిరుపతి లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యి వివాదంలో నటుడు ప్రకాష్ రాజ్‌పై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులరిజం అంటే ఏమిటో తెలుసుకోవాలని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే తాను మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు.
Pawan Warns PraksahRaj: తిరుమల నెయ్య వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గగుడిలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెయ్యి వివాదంలో ఇటీవల ప్రకాష్ రాజ్ మాట్లాడారని, తాను హిందువుల విషయం గురించి మాట్లాడితే నటుడు ప్రకాష్‌రాజ్ అభ్యంతరం ఏమిటని, ఏ మతాన్ని తాను నిందించలేదని, దీనిని కూడా తాను గోల చేస్తున్నానని అనడం ఏమిటన్నారు.
దేవతా విగ్రహాలు శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవం ఉందని, సెక్యులరిజం అంటే రెండు విధాలని ఆయన గుర్తించాలన్నారు. హిందువుల మీద దాడి జరిగితే మాత్రమే మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. ముస్లింలు, మదర్సాల మీద తనకు ఎప్పడూ గౌరవం ఉందని, వాటికి లక్షల కొద్ది విరాళాలు ఇచ్చానని గుర్తు చేశారు.
మిషనరీ స్కూల్లోనే చదువుకున్నానని, వారి మీద తనకు ఎప్పుడు గౌరవం ఉంటుందన్నారు. తనను తాను తగ్గించకున్న వాడు హెచ్చింపబడతారనే దానిని నమ్ముతానని, అయితే నేను పాటించే ధర్మానికి అన్యాయం జరిగితే తాను మాట్లాడటంలో తప్పేమిటన్నారు. ప్రకాష్ రాజ్ ఇవి తెలుసుకోవాలన్నారు.
ప్రకాష్ రాజ్ మాత్రమే కాదు సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్లంతా తెలుసుకోవాలన్నారు. హిందువులుగా తాము తీవ్రంగా ఆవేదనలో ఉన్నామని మర్చిపోవద్దన్నారు. మాట్లాడేముందు వంద సార్లు ఆలోచించుకోవాలని, అయ్యప్ప స్వామి, సరస్వతి దేవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని.. అల్లా మీద, మహ్మద్ ప్రవక్త మీద, జీసస్ మీద మాట్లాడగలరా అని ప్రశ్నించారు.
తమ దేవుళ్లపై మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతినవా అని నిలదీశారు. ప్రతి సగటు హిందువు తాలుకా ధర్మమని, ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఏమి చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.ధర్మాన్ని పరిరక్షించడం తన ఒక్కడి బాధ్యత కాదని అన్ని పార్టీల్లో ఉన్న వారు సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండాలన్నారు.