Welcoming Jr NTR Into TDP: రామయ్య రాకను నిజంగానే కోరుకుంటున్నారా? లేక రాజకీయ అవసరమా? -what are the reasons beyond welcoming jr ntr into tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  What Are The Reasons Beyond Welcoming Jr Ntr Into Tdp

Welcoming Jr NTR Into TDP: రామయ్య రాకను నిజంగానే కోరుకుంటున్నారా? లేక రాజకీయ అవసరమా?

HT Telugu Desk HT Telugu
Feb 26, 2023 07:18 PM IST

Telugudesam Party : ఏపీ రాజకీయాలంటేనే స్పెషల్..! కొన్ని సందర్భాలు చూస్తే... రాజకీయం అంటేనే ఏపీ... ఏపీ అంటేనే రాజకీయమేమో అన్నట్లు అనిపిస్తుంది..! ప్రతి పని వెనక రాజకీయ కోణం ఉందన్నట్లు... అక్కడి పార్టీలు, నేతల తీరు ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో చూస్తే వైసీపీ వర్సెస్ టీడీపీ, జన సేన అన్నట్లు నడుస్తోంది. ఇక్కడ టీడీపీ విషయానికొస్తే.... కాస్త ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటుంది. కట్ చేస్తే... పదే పదే జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. తాజాగా లోకేశ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతే ఇప్పుడు ఆయన చుట్టే ఏపీ రాజకీయమంతా నడుస్తున్నంత పనైపోయింది. ఒక్క టీడీపీలోనే కాదు... అధికార వైసీపీ కూడా పలు అంశాలను ప్రస్తావిస్తోంది. మొత్తంగా ‘రామయ్య వస్తావయ్యా’ అనే ప్రశ్న… ఏపీ పాలిటిక్స్ లో మరోసారి చర్చనీయాంశంగా మారినట్లు అయింది.

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ

Junior NTR Political Entry: జూనియర్ ఎన్టీఆర్... ప్రస్తుతం ఈ పేరు చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోంది…! అందులో టీడీపీని మాత్రం ఓ రేంజ్ లోనే వెంటాడుతూనే ఉంది! ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏ కార్యక్రమంలో పాల్గొన్న... జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు మార్మోగుతూన్న సంగతి తెలిసిందే. రామయ్య వస్తావయ్యా అనే ఫ్లెక్సీలు కూడా దర్శనమిస్తున్నాయి. కొన్నిసార్లు అయితే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు కూడా దద్దరిల్లుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత... టీడీపీలో ఈ పరిస్థితి మరీ ఎక్కువైపోయింది. టీడీపీని నెక్స్ట్ లీడ్ చేసేది జూనియర్ ఎన్టీఆరే... తర్వాత అంతా ఆయనే అన్న చర్చ ఎప్పట్నుంచో ఉంది…! అయితే ఇదీకాస్త... ఈ మధ్య ఎక్కవైపోయింది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన కొన్ని కామెంట్స్ తో .. విషయం కాస్త పీక్స్ కు చేరింది. కట్ చేస్తే... టీడీపీ నేతల రియాక్షన్స్ పెద్దగా లేనప్పటికీ... అధికారపక్షం(వైసీపీ) నుంచి మాత్రం గట్టి రీసౌండ్ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ గురించి లోకేశ్ మాట్లడటమేంటంటూ ఎదురుదాడి చేస్తున్న సీన్లు కనిపిస్తున్నాయి. ఇది పక్కనపెడితే... అసలు జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఇప్పుడు టీడీపీకి ఉందా..? ఆయన రావాల్సిందేనా..? లోకేశ్ కామెంట్స్ పై ఇంత చర్చ ఎందుకు నడుస్తోంది..? ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీని కేవలం రాజకీయంగా మాత్రమే వాడుకోవాలని టీడీపీ చూస్తుందా..? లేక మనస్ఫూర్తిగానే ఆహ్వానిస్తుందా..? అనేది పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు...నైతిక విలువలను గాలికి వదిలేయటం ఓ అవకాశవాదం. కానీ అది రాజకీయ నాయకుడి పరిణితిపై ఆధారపడి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే... 'మా బావ మనోభావాలు దెబ్బతినాయ్' అంటూ వీరసింహారెడ్డిలో బాలకృష్ణ ఓ డైలాగ్ చెప్తాడు. అచ్చం అలాగే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్న అడగటంతో... లోకేశ్ కూడా అదే పరిస్థితిని ఫేస్ చేశాడేమో అనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు... నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే... నారా నాయకత్వం పెద్దగా ఆమోదం తెలపకపోవచ్చనే చర్చ ఎప్పట్నుంచో ఉంది…! ఇక అసలు మ్యాటర్ కి వస్తే..... రాష్ట్రవ్యాప్తంగా ‘యువగళం’ పేరుతో లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తిరుపతి వేదికగా 'హలో లోకేశ్' అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు లోకేశ్ రియాక్ట్ అయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే వంద శాతం ఆహ్వానిస్తామంటూ లోకేశ్ ఆన్సర్ ఇచ్చారు. ఇదే సమయంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీ రాజకీయాల్లో సానుకూలమైన మార్పు తీసుకురావాలన్న తపన ఉన్నవారు...ఎవరు వచ్చినా తాను స్వాగతిస్తానంటూ మాట్లాడారు. ఇక్కడ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు లోకేశ్. అయితే టీడీపీ స్థాపకుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా పేరొందిన జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ స్వాగతించటం తెలివైన జవాబే కావొచ్చు... కానీ మరోవైపు అదే జూనియర్ ఎన్టీఆర్... లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు అవరోధంగా మారుతారన్న భావన కూడా ప్రస్తుత టీడీపీ నాయకత్వంలో ఉందనే వాదన తెరపైకి వస్తోంది. ఇక వారసత్వ పోరులో ఉద్దేశపూర్వకంగానే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు... సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు పక్కన పెట్టారనే వాదన కేడర్ లో ఎప్పట్నుంచో ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లోకేశ్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయనే చర్చ నడుస్తోంది.

భవిష్యత్ లో టీడీపీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చ జరిగితే లోకేశ్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ రేసులోకి రావొచ్చన్న చర్చ ఉంది. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైంది. ఈ పరిణామాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫెయిల్యూర్ గా చూపిస్తే…. లోకేశ్ కు లైన్ క్లియర్ అయ్యే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన(2014) తర్వాత... రాజకీయముఖ చిత్రం మారిపోయింది. ఏపీ, తెలంగాణ వేర్వురు కాగా.. నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఓవైపు ప్రభుత్వాన్ని నడుపుతూనే... మరోవైపు తన రాజకీయలక్ష్యాన్ని కూడా నెరవేర్చే ప్రయత్నాలు చేశారు. పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కనపెట్టేశారు చంద్రబాబు. ఆయన కుమారుడైన నారా లోకేశ్ ను కేంద్రబిందువుగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక గతం చూస్తే 1995లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను పార్టీలైన్ నుంచి తప్పించేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం జూనియర్ ఎన్టీఆర్ మనసులో బలంగా నాటుకుపోయిందన్న చర్చ కూడా ఉంది.

పాదయాత్ర వెనక చంద్రబాబు స్కెచ్…!

ఇక లోకేశ్... ఎన్టీఆర్ ను స్వాగతించటం వెనక మరో కోణం ఉందన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన పొత్తు ఉంటుందన్న వాతావరణం నెలకొంది. అయితే ఈ మైత్రికి జనసేనలోని ఓ వర్గం ఆమోదం తెలపడం లేదంట…! సొంతంగానే పోటీ చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కు సూచిస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుంది. ఇదీ కాస్త ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేశ్... జూనియర్ ఎన్టీఆర్ ను స్వాగతిస్తూ మాట్లాడారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక లోకేశ్ పాదయాత్ర వెనక కూడా పెద్ద మంత్రాంగమే నడిచిందని తెలుస్తోంది. తనని తాను నిరూపించుకునేందుకే పాదయాత్ర పేరుతో లోకేశ్ ను టీడీపీ నాయకత్వం ప్రజల్లోకి పంపించిందన్న చర్చ జోరుగా ఉంది. దీనికి కారణం కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్న వాదన బలంగా ఉంది. ఎందుకంటే... పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించాలన్న స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా లోకేశ్ ను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారన్న కోణంలో వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు కూడా 73 ఏళ్లకు చేరుతుంది. ఆరోజు నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేం. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు... లోకేశ్ ను లీడర్ గా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నట్లు అర్థమవుతోంది. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తే... ఆదరణ దక్కే అవకాశం ఉంటుంది ఆయన అంచనా..! ఇదే కనుక చేయకపోతే పార్టీ నాయకత్వ బాధ్యతలు చూసే విషయంలో లోకేశ్ వెనకబడే అవకాశం ఉంది. అందుకే యువగళం యాత్రతో ప్రజల్లోకి వెళ్లేలా స్కెచ్ వేశారు చంద్రబాబు.

గతం చూస్తే... ఎన్టీఆర్ నుంచి పార్టీని చేతుల్లోకి తీసుకోవటం సహా అధికార మార్పిడి వరకు చంద్రబాబు ఓ ప్లాన్ ప్రకారమే అడుగులు వేశారని అర్థమవుతోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుటుంబంతో చంద్రబాబుకు గ్యాప్ వచ్చినట్లు అయింది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. కానీ 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. పరిస్థితిలు మారిపోయాయి. అధికారం చేజారింది. అయితే అప్పటికే ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న కాస్త గ్యాప్ ను లోకేశ్... బ్రాహ్మిణి(బాలకృష్ణ కుమార్తె) వివాహంతో క్లియర్ చేసేశారు. ఫలితంగా వారి బంధం మరోసారి బలపడినట్లు అయింది. ఇక వైస్రాయ్ హోటల్ ఘటన టీడీపీ చరిత్రలో ఓ మచ్చలాటిందని చెప్పొచ్చు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంమంతా కూడా చంద్రబాబు బాధితులుగా మారిపోయారన్న చర్చ ఇవాళ్టికి ఉంది. ఇక ఆ తర్వాత... పార్టీపై పూర్తిస్థాయిలో పట్టుసాధించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గర ఉన్న నేతలను డౌన్ చేసేశారన్న అపవాదు ఉంది. అదే సమయంలో వారికి పార్టీలో కానీ ప్రభుత్వంలోకానీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. సెకండ్ కేడర్ నేతలుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక్కడ పార్టీపరంగా ఎన్టీఆర్ కుటుంబం నుంచి రేసులో లేకుండా పక్కకి జరగడానికి కూడా కారణాలు లేకపోలేదు. 1995 నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.... పార్టీ వేరే వ్యక్తుల చేతుల్లో వెళ్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న నందమూరి కుటుంబాన్ని వెంటాడింది. అదే జరిగితే పార్టీపై పూర్తిగా పట్టుకోల్పోయే అవకాశం ఉంటుందన్న అభద్రతాభావంతో కూడా ఆ కుటుంబం చంద్రబాబు వైపు నిలవాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు ఇవాళ్టికి ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాలతో సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం రాజకీయంగా క్రమంగా వెనకబడిపోయినట్లు అయింది. ఫలితంగా లోకేశ్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా.... ఎప్పటికప్పుడూ తన వ్యూహాలను చంద్రబాబు మారుస్తూ వచ్చారన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి.

బయటపడేసే ప్రయత్నాలు…

ఇక ప్రస్తుతం పూర్తిగా ఎన్టీఆర్ కుటుంబాన్ని విస్మరించే పరిస్థితి చంద్రబాబుకు లేదు. కారణం... అలాంటి పరిస్థితే వస్తే... పార్టీ పునాదులు కదులుతాయని తెలుసు. పైగా ఆ కుటుంబం మద్దతుతో పార్టీని పటిష్టం చేయవచ్చనే అభిప్రాయం కూడా చంద్రబాబులో ఉంది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ లేదా ఇతర కుటుంబ సభ్యులను స్టార్ క్యాంపెయినర్ల మాదిరిగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి బయటికి తీసుకువచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇలా చెప్పుకుంటే వెళ్తే....ఎన్టీఆర్ వారసత్వాన్ని అంత తేలికగా తీసిపారేయలేం. అలా అనుకుంటే కూడా అమాయకత్వమే అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్లగలిగే సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం... రాజకీయ వారసుడిగా... టీడీపీ నాయకత్వ బాధ్యతలను లోకేశ్ కే అప్పగించాలని కలలు కంటున్నారు. ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి రప్పించటం ద్వారా... ప్రస్తుత గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు ఉపయోగపడుతుందన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు కూడా అర్థమవుతోంది. వచ్చే అసెంబ్లీ (2024)ఎన్నికల్లో జగన్ కంటే జూనియర్ అయిన లోకేశ్ కు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలన్న ప్రశ్న కూడా జనాల మదిలో రావొచ్చు. లోకేశ్, జగన్ ఒకే జనరేషన్ కు చెందిన వారైనప్పటికీ... రాజకీయంగా జగన్ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో లోకేశ్ ను మరింత ముందుకు తీసుకువచ్చే పనిలో చంద్రబాబు గట్టిగా నిమగ్నమైనట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ రకంగా ఇది చంద్రబాబుకు గట్టి పరీక్షే అని చెప్పొచ్చు.

ఈ నేపథ్యంలోనే లోకేశ్ సమర్థత ఉన్న నేతగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అతన్నే సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా మార్చాలన్న కారణంతో.... జూనియర్ ఎన్టీఆర్ సేవలను తీసుకోవాలని భావిస్తున్నారట..! అంతేకాదు జనసేనతో పొత్తు ద్వారా అధికారంలోకి రావటంతోనైనా తన వ్యూహాం అమలు అవుతుందన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా ఓవైపు నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నప్పటికీ... ఎన్నికల నాటికి టీడీపీకి ఓ స్టార్ క్యాంపెయినర్ అవసరం ఉందనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్... ఎన్టీఆర్ రాకకు స్వాగతం పలికినట్లు అర్థమవుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఏదో అయిపోతుందని టీడీపీ నాయకత్వం అనుకోవటం లేదనే చర్చ కూడా ఉంది..! ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన్ను మాత్రం రాజకీయ అవసరాల కోసమే వాడుకోవాలని చూస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై టీడీపీ ఆలోచన ఎలా ఉందనేది భవిష్యత్ పరిణామాలతో తేటతెల్లంకాకపోదు….!

IPL_Entry_Point

సంబంధిత కథనం