Nara Lokesh: జూనియర్ NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్న.. లోకేశ్ రియాక్షన్ ఇదే
lokesh intresting comments on junior ntr political entry: జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్నారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని చెప్పారు.
Nara Lokesh: Padayatra Updates: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరుపతిలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం 'హలో లోకేశ్' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా యువత అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మొదటి వంద రోజుల్లోనే అన్న క్యాంటీన్లను తెరుస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలని, పేదరికం లేని రాష్ట్రం రూపొందాలంటే ఒక్కో జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అర్హులందరికీ ఉద్యోగం కల్పించడమే తాము జగన్‌కు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేశారు. మాట తప్పి మడమ తిప్పిన వ్యక్తికి అదే గుణపాఠంగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ ఆహ్వానిస్తుందా అన్న ఓ ప్రశ్నపై నారా లోకేశ్ స్పందించారు. ‘జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు. నూటికి నూరు శాతం ఆహ్వానిస్తాం. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్ర స్థానానికి వెళ్లాలి, ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాలి’ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్ కల్యాణ్ పై ప్రశంసలు గుప్పించారు లోకేశ్. పవన్ కల్యాణ్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని అన్నారు.
ఇక మంగళగిరిలో లోకేశ్ ఓటమిపై కూడా ఓ ప్రశ్నకు తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు లోకేశ్. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. యువకుడిగా ఆ నియోజకవర్గాన్ని పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దాలన్నది సవాలుగా తీసుకున్నానని చెప్పుకొచ్చారు. మొదటిసారి ఫెయిల్ అయ్యా.. అయినా తనలో ఫైర్ ఉందని, 2024లో మంగళగిరిలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని.. వాటిపై చూపే శ్రద్ధలో కొంత అభివృద్ధిపైన చూపితే పరిశ్రమలు వస్తాయంటూ వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు లోకేశ్.
సంబంధిత కథనం