Nara Lokesh Padayatra : సీఎం జగన్ దళిత ద్రోహి....... నారా లోకేశ్
Nara Lokesh Padayatra : యువగళం పాదయాత్రలో భాగంగా... గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు నారా లోకేశ్. సమస్యలు తెలుసుకున్న ఆయన ... వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని... దళిత సోదరులకి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని ఆరోపించారు.
Nara Lokesh Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 15వ రోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించిన ఆయన... కాపుకండ్రికలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు లోకేశ్. ముఖ్యమంత్రి జగన్ ని దళిత ద్రోహి అని ఆరోపించిన ఆయన... దళితుల ఓట్లతో గెలిచి వాళ్లకే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తోందని... అమ్మఒడి, పింఛన్లను కూడా సబ్ ప్లాన్ కింద చూపిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెట్టలేదని... కానీ సీఎం జగన్ పాలనలో ఏపీలో కేసులు నమోదు చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు.
"డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దళిత వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన సారథ్యంలో నియోజకవర్గంలో ఒక్కరికన్నా.. సబ్సీడీ, లోన్లు వచ్చాయా ? ఈ నియోజవకర్గంలో నడుస్తుంటే గుంతల్లో రోడ్లను ఎతుక్కునే పరిస్థితి ఉంది. దళితుల సమస్యలపై ఏనాడైనా సీఎంను నారాయణ స్వామి అడిగారా.? జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుర్చీల్లో కూర్చుంటే వారి వెనక నారాయణ స్వామి చేతులు కట్టుకుని కూర్చుంటారు. చంద్రబాబు పక్కన డిప్యూటీ సీఎంలు, మంత్రులు కూర్చునేవారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ మాస్కుల కోసం పోరాడితే ఈ ప్రభుత్వం పిచ్చివాడిగా ముద్ర వేసి చంపేసింది. పుంగనూరులో కల్తీ మద్యంపై ఓంప్రతాప్ అనే యువకుడు మాట్లాడితే చంపేశారు. తూర్పు గోదావరిలో వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ను కొట్టి చంపి శవాన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టారు. యాక్సిడెంట్ లో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. చీరాలలో మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారు. కానీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదు ? ఇది సైకో పాలన.... అందుకే జగన్ కు సైకో అని పేరు" అని నారా లోకేశ్ విమర్శించారు.
ఎస్సీ సోదరులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకునేందుకే మీ ముందుకొచ్చానని లోకేశ్ తెలిపారు. ఈ సారి అధికారంలోకి వచ్చేది టీడీపీ అని... దళితులకు ఏం కావాలో నేరుగా తెలుసుకుంటున్నానని చెప్పారు. అపార్ట్ మెంట్లకు దీటుగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తే... వాటిని ఇవ్వకుండా సీఎం జగన్ ఆపేశారని విమర్శించారు. విదేశీ విద్యకు పేరు మార్చడమే కాదు.. పథకాన్నే జగన్ ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే మళ్లీ విదేశీ విద్య తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఏపీ చరిత్రలో మొదటి సారిగా దళితుల చేతుల్లో భూమి తగ్గిందన్న లోకేశ్.... ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా దళితుల భూములు కొట్టేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏ ఎమ్మెల్యే, ఏపార్టీకి చెందిన వాళ్లయినా భూములు లాక్కుంటే వాటిని మళ్ళీ దళితులకు అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. ఎస్సీలపై పెట్టిన దొంగ కేసులు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కొట్టేస్తామని.... దొంగ కేసులు బనాయించిన అధికారులపై జ్యుడిషియల్ విచారణ చేయించి చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు.