Visakha Red Sand Hills : విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంవో సీరియస్, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు-visakhapatnam red sand hills illegal excavation ap cmo orders inquiry submit report ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Red Sand Hills : విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంవో సీరియస్, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు

Visakha Red Sand Hills : విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంవో సీరియస్, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jul 17, 2024 02:13 PM IST

Visakha Red Sand Hills : విశాఖ ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గత మూడు నెలలుగా ఎర్రమట్టి దిబ్బలను యథేచ్ఛగా తవ్వేస్తూ లారీల్లో మట్టి తరలించేశారు. ఈ విషయం ఏపీ సీఎంవో దృష్టికి రావడంతో... తక్షణమే తవ్వకాలు ఆపాలని, నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంవో సీరియస్
విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంవో సీరియస్

Visakha Red Sand Hills : విశాఖలో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఎర్ర మట్టి దిబ్బల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరిగాయి. భీమిలి ఎర్ర మట్టి దిబ్బలను భారీ యంత్రాలతో తవ్వేస్తూ లారీల్లో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఏపీ సీఎంవో స్పందించింది. తవ్వకాలు నిలిపి వేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణానికి హాని కలిగించే చర్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ తవ్వకాలపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

yearly horoscope entry point

తవ్వకాలను పరిశీలించిన విశాఖ జేసీ

ఎర్రమట్టి దిబ్బలు ముప్పులో ఉన్నాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికారుల అండదండలతో కొందరు యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తు్న్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు జరగగా...వివాదాస్పదం అయ్యింది. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాలపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని విశాఖ జేసీ మయూర అశోక్ తన బృందంతో పరిశీలించారు. ఏ మేరకు తవ్వకాలు జరిపారో అంచనా వేసి నివేదిక సిద్ధం చేస్తున్నారు. తవ్వకాలపై నివేదిక అందించాలని సీఎంవో ఆదేశించింది.

భీమిలి సొసైటీ లేఅవుట్

విశాఖ జిల్లా భీమిలి కో ఆపరేటివ్‌ సొసైటీకి చెందిన భూములు ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్నాయి. ఇక్కడ లేఅవుట్‌ వేసేందుకు 2016లో వీఎంఆర్‌డీఏకి దరఖాస్తు చేసుకోగా అనేక షరతులు విధించింది. భూవినియోగ మార్పిడి ఫీజు చెల్లించాలని, జిల్లా కలెక్టర్‌, ఏపీ కోస్టల్‌ మేనేజ్మెంట్‌ జోన్‌, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, నేషనల్‌ మాన్యుమెంట్‌ అథారిటీ, రక్షణ శాఖ నుంచి అనుమతులు పొందాలని తెలిపింది. భీమిలి కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన చెబుతున్న భూమిలో భౌగోలికి వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలు 94.65 ఎకరాల్లో ఉందని, అది మినహాయించి 279.31 ఎకరాలు మాత్రమే సొసైటీకి చెందుతుందని గతంలో వీఎంఆర్డీఏ స్పష్టం చేసింది.

గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు

సొసైటీ వాళ్లు లేఅవుట్‌ వేస్తే 75 ఎకరాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఒక్కొక్కరికి 75 గజాలకు మించకుండా ప్లాట్లు కేటాయించాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు పక్కనే ఉన్నందున బఫర్‌జోన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. భూవినియోగ మార్పిడి కింద సొసైటీ వీఎంఆర్డీఏకు సుమారు రూ. 3 కోట్లు వరకు ఫీజు చెల్లించింది. మిగిలిన అనుమతులు లేకపోవడంతో అప్పట్లో సొసైటీ దరఖాస్తును వెనక్కి పంపారు. తాజాగా సొసైటీ మళ్లీ లేఅవుట్ వేసేందుకు పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది జీవీఎంసీ పరిధిలో ఉండడంతో.. అక్కడ డబ్బులు కట్టి అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా లేఅవుట్‌ దరఖాస్తు సమర్పించలేదని, భూమి చదును చేయడానికి మాత్రమే రూ.5 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే జీవీఎంసీ ఎందుకు అనుమతులు ఇచ్చింది, దరఖాస్తు చేసింది ఎవరు, దీని వెనకున్నది ఎవరనేది విచారణలో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి ఆగిన పనులు

ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు జరుగుతున్నాయని భీమిలి తహసీల్దార్‌ గుర్తించారు. దీంతో ఆయన మంగళవారం తవ్వకాలు జరుపుతున్న ప్రదేశాన్ని పరిశీలించి, పనులు ఆపాల్సిందిగా చెప్పారు. అనుమతులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ చెప్పారు. వారసత్వ సంపద ప్రదేశం కాబట్టి దిల్లీ స్థాయిలో అనుమతులు కావాల్సి ఉంటుందన్నారు. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గత మూడు నెలలుగా పనులు జరుగుతుంటే అధికారులు పట్టించుకోలేదంటే అనుమానాలు కలుగుతున్నాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఎర్రమట్టి దిబ్బలను భారీ యంత్రాలతో తవ్వి లారీల్లో మట్టిని తరలించుకుపోతున్నా గనుల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

Whats_app_banner

సంబంధిత కథనం