YS Sharmila : టీడీపీ, వైసీపీ బీజేపీకి తొత్తులు- స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు : వైఎస్ షర్మిల
YS Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు పీసీసీ పదవి చేపట్టారు, రెండు సార్లు సీఎం అయ్యారన్నారు. వైఎస్ బిడ్డ అయిన తనను నమ్మి బాధ్యతలు ఇచ్చారని, అందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఏపీకి చెందిన కాంగ్రెస్ నాయకులు నా కోసం, నా మీద నమ్మకంతో త్యాగాలు చేశారన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. గత ఐదేళ్లుగా ఏపీలో వైసీపీ అధికారంలో ఉందని, అంతకు ముందు ఐదేళ్లు టీడీపీ ఉందని గుర్తుచేశారు. ఈ పదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా? అంటే దానికి సమాధానం లేదన్నారు. చంద్రబాబు హయాంలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేస్తే వైసీపీ హయాంలో సీఎం జగన్ చేసిన అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అని విమర్శించారు.
స్పెషల్ స్టేటస్ ఏమైంది?
"రాష్ట్ర అప్పులు, లోన్లు కలిపి పది లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై ఉంది. ఇన్ని అప్పులతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంలేదు. రాజధాని లేదు, దానిని కట్టడానికి డబ్బులు లేవు. ఒక్క మెట్రో రైలు లేదు. పదేళ్లలో పది పెద్ద పరిశ్రమలు కూడా రాలేదు. విజయవాడలో కూడా మెట్రో లేదు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా లేవు. అభివృద్ధి లేదు కానీ దళితుల మీద దాడులు పెరిగాయి. ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా మాత్రమే ఉన్నాయి. ఏపీలో దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే ఉంది. స్పెషల్ స్టేటస్ వస్తే పన్ను రాయితీలు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి. రాలేదు అనడం కంటే తీసుకురాలేదు అనడం నిజం. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ఎలా అభివృద్ధి జరిగింది. ఇక్కడి పాలకులు విఫలం అయ్యారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే బీజేపీ పదేళ్లు ఇస్తాం అన్నారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకొని, చంద్రబాబు సీఎం అయ్యాక ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా నిజమైన ఉద్యమం చేశారా? అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి, స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టి మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం అన్నారు. సీఎం అయ్యాక ఒకసారైనా ఉద్యమం చేశారా? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు"- వైఎస్ షర్మిల
రాజధానితో ఆటలు
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు, జగనే కారణం అని వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని 3డీ గ్రాఫిక్స్ చూపించరు, జగన్ మూడు రాజధానులు అన్నారు. ఒకటి కూడా అవ్వలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ 2004లో వైఎస్ఆర్ ప్రారంభించారని, వైఎస్ హయాంలో పోలవరం కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పూర్తి చేశారని గుర్తుచేశారు. ఆయన చనిపోయాక ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, జగన్ బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారన్నారు. పదేళ్లలో ఏపీలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ రైతులకు ఆదాయం డబుల్ చేస్తామన్నారు, కానీ ఖర్చులు రెట్టింపు అయ్యాయని దుయ్యబట్టారు.
టీడీపీ, వైసీపీ బీజేపీ తొత్తులు
పేదల చేతుల్లో రూపాయి అయినా బీజేపీ పెట్టిందా? అని షర్మిల ప్రశ్నించారు. బీజేపీ తొత్తులుగా ఎందుకు మారారు, టీడీపీ, వైసీపీకి చెందిన 25 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. 25 మంది ఎంపీలు బీజేపీ చేతుల్లో ఉన్నారని, బీజేపీ చెబితే గంగిరెద్దులా తల ఊపుతున్నారని విమర్శించారు. టీడీపీ, వైసీపీకి ఓటు వేసినా బీజేపీకే వేసినట్లే అన్నారు. ప్రజలు వైసీపీ, టీడీపీలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బీజేపీకి అమ్ముడు పోవడానికి వైసీపీ, టీడీపీ నుంచి ఎందుకు పోటీ పడుతున్నాయని మండిపడ్డారు.
మొత్తం అంతా బీజేపీ నుంచే పోటీ చేయొచ్చు కదా, ప్రజల దగ్గర ఎందుకు నటిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ బీజేపీ తొత్తులుగా, పొత్తులో ఉంటున్నారన్నారు. టీడీపీ, వైసీపీకి బీజేపీతో పొత్తు ఉందన్నారు. మణిపూర్ లో క్రైస్తవులను చంపేసిన సీఎం జగన్ మాట్లాడలేదన్నారు. క్రైస్తవులు చస్తున్నా బీజేపీకి మద్దతు ఇచ్చారన్నారు. జగన్ క్రైస్తవుడు అయినా మణిపూర్ ఘటనపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ స్వలాభం ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు. వైఎస్ఆర్ బీజేపీకి ముమ్మాటికీ వ్యతిరేకి, బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ లో మాత్రమే వైఎస్సార్ ఆశయాలు నెరవేరాయన్నారు. రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే వాళ్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.