AP Voters List 2024 : ఏపీలో 4.08 కోట్ల ఓటర్లు, 5.6 లక్షల ఓట్లు తొలగించాం- సీఈఓ ముఖేష్ కుమార్ మీనా
AP Voters List 2024 : ఏపీలో 4.08 కోట్ల ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాజకీయ పార్టీల ఫిర్యాదుల పరిశీలించి 5.6 లక్షల ఓట్లు తొలగించామన్నారు.
AP Voters List 2024 : ఏపీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. తుది జాబితాపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం అదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో 4.08 కోట్ల ఓటర్లు ఉన్నారన్నారు. గతేడాది అక్టోబర్ 27న జారీ చేసిన డ్రాఫ్ట్ జాబితా తర్వాత 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. యువ ఓటర్లు 5 లక్షల మేర పెరిగారన్నారు. రేపటి నుంచి కాలేజీలు, యూనివర్సిటీల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రయత్నిస్తామన్నారు. ఏపీలో జీరో, జంక్ ఓటర్లు ఉన్నారని, వాటిని 98 శాతం మేర సరిచేశామని మీనా తెలిపారు. కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో సవరణ చేయలేదన్నారు. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.51 లక్షల ఇళ్లను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 2 శాతం మేర సరిదిద్దాలన్నారు. జీరో, జంక్ ఓటర్ల సంఖ్య గతంలోనూ ఉందన్నారు.
5.6 లక్షల ఓట్లు తొలగించాం
రాజకీయ పార్టీల నుంచి 14 లక్షల ఓటర్ల గురించి ఫిర్యాదులు అందాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వీటిల్లో 5.6 లక్షల ఓటర్లు అర్హులు కారని గుర్తించి తొలగించామన్నారు. దురుద్దేశం పూర్వకంగా ఫామ్-6, ఫామ్-7లు దాఖలు చేసిన వారిపై 70 కేసులు పెట్టామన్నారు. ఈ అంశాలపై వారానికి ఓసారి నివేదిక కోరామన్నారు. కొత్త దరఖాస్తులపై సమీక్ష చేస్తామన్నారు. రాష్ట్రంలో 80 ఏళ్లుపై బడిన వారి ఇంటికి వెళ్లి ఓటు నమోదు చేయించాలని నిర్ణయించామన్నారు. ఏపీలో అలాంటి ఓటర్లు 4.70 లక్షల మంది ఉన్నారన్నారు. తుది ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలపై సీఈఓ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తుది జాబితాను అన్ని పంచాయతీ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచుతామన్నారు.
మహిళా ఓటర్లే అధికం
ఏపీలో మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,00,09,275 మంది కాగా, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482, సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను 45,951 నుంచి 46,165కు పెంచారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తుంది ఎన్నికల సంఘం. ఈసీఐ విస్తృత ప్రచారం ఫలితంగా కొత్తగా 22,38,952 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని సీఈఓ తెలిపారు. ఇంకా కొంతమంది ఓటర్లను 18-19 సంవత్సరాల కేటగిరీలో చేర్చాలని, అటువంటి ఓటర్ల చేరిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కొన్ని ఫిర్యాదుల ప్రకారం ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. జననాల వివరాలు, డెత్ రిజిస్టర్, ఇంటింటికి సర్వే ద్వారా మొత్తం 16, 52,422 ఓట్లు తొలగించామన్నారు.