MP Raghu Rama Krishna Raju : ఏపీలో 50 శాతం ఉద్యోగులకు జీతాల్లేవ్, ప్రభుత్వంపై ఎంపీ రఘురామ విమర్శలు
MP Raghu Rama Krishna Raju : ఏపీలో ఇంకా 50 శాతం ఉద్యోగులకు జీతాలు అందలేదని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రూ.71 వేల కోట్లు అప్పు చేసినా సగం మందికి కూడా జీతాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
MP Raghu Rama Krishna Raju : ఏపీలో ఇంకా 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ఏడో తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం రూ.71 వేల కోట్లు అప్పులు చేసినప్పటికీ, ఇంకా సగం మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదన్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి రూ.44 వేల కోట్లు, కార్పొరేషన్ పేరిట చేసిన అప్పులతో కలిపి మొత్తంగా రూ.71 వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. దిల్లీ వీధుల్లో ఏపీ సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు అప్పుల కోసం తిరుగుతున్నారని సెటైర్లు వేశారు. ఐఏఎస్ ల జీతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన నిధిని ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఐఏఎస్ ల జీతాలు పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు.
ఐఏఎస్ లకు జీతాలు
ఏపీలోని ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల వేతనం ఇప్పటి వరకు అందలేదని తెలుస్తోంది. 5వ తేదీ దాటినా అధికారులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని సమాచారం. జీతాలు అందకపోవడంపై ఐఏఎస్‌లు అధికారులు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గడిచిన కొన్ని నెలల్లో ఐఏఎస్‌లకు ప్రభుత్వం 20వ తేదీ వరకూ వేతనాలు చెల్లించిన పరిస్థితి ఉందని కొందరు అధికారులు పేర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిన వేతనాలు నిలిపి వేయడంపై ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఐఏఎస్ అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులతో పాటు చాలా విభాగాల ఉద్యోగులు, టీచర్లకు సెప్టెంబర్ వేతనాలు ఇంకా అందలేదని తెలుస్తోంది.
మూడు నెలలుగా జీతాల్లేవ్!
సమగ్ర శిక్ష అభియాన్ లోని ఉద్యోగులకు జులై, ఆగస్టు, సెప్టెంబర్ కు సంబంధించిన జీతాలు అందలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోగా, కేంద్రం నిధులను వాడేసుకుంటోందని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2 వేల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలా జీతాలకు రూ.65 కోట్లు వరకు అవసరమవుతాయన్నారు. జులై నుంచి 25 శాతం జీతాలు పెంచుతామని సమగ్ర శిక్ష అభియాన్ ప్రకటించింది. అయితే అసలు పాత జీతాలే ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ లో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయగా, రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.