Vijayawada : విజయవాడలో ఆయుర్వేద కాలేజీ వైద్య విద్యార్థులు నిరసన, సస్పెండ్ చేస్తానని ప్రిన్సిపల్ బెదిరింపులు!-vijayawada govt ayurveda college medical students protest on kolkata incident principal threatens to suspend ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada : విజయవాడలో ఆయుర్వేద కాలేజీ వైద్య విద్యార్థులు నిరసన, సస్పెండ్ చేస్తానని ప్రిన్సిపల్ బెదిరింపులు!

Vijayawada : విజయవాడలో ఆయుర్వేద కాలేజీ వైద్య విద్యార్థులు నిరసన, సస్పెండ్ చేస్తానని ప్రిన్సిపల్ బెదిరింపులు!

Bandaru Satyaprasad HT Telugu
Aug 17, 2024 02:35 PM IST

Vijayawada : కోల్ కతాలో వైద్యురాలి హత్యాచారం ఘటనకు నిరసనగా విజయవాడ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేత కాలేజీ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులపై ఆ కాలేజీ ప్రిన్సిపల్ సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా ఎందుకు నిరసనకు వచ్చారని, సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

విజయవాడలో ఆయుర్వేద కాలేజీ వైద్య విద్యార్థులు నిరసన, సస్పెండ్ చేస్తానని ప్రిన్సిపల్ బెదిరింపులు!
విజయవాడలో ఆయుర్వేద కాలేజీ వైద్య విద్యార్థులు నిరసన, సస్పెండ్ చేస్తానని ప్రిన్సిపల్ బెదిరింపులు!

Vijayawada : కోల్ కతాలో వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేస్తున్నారు. శనివారం దేశ వ్యాప్తంగా ఓపీ సేవలు నిలిచిపోయాయి. వైద్యులపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు వైద్యులు 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిపివేశారు. అత్యవసర, క్యాజువాలిటీ వైద్య సేవలు మాత్రమే అందిస్తున్నారు. ఏపీలో కూడా వైద్యులు ఓపీ సేవలు నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో వైద్య విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. విశాఖలో వైద్య విద్యార్థుల నిరసనకు హోంమంత్రి వంగలపూడి అనిత మద్దతు తెలిపారు.

వైద్య విద్యార్థుల నిరసనపై ప్రిన్సిపల్ సీరియస్

విజయవాడ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వద్ద వైద్య విద్యార్థుల ఆందోళన చేపట్టారు. కోల్ కతా వైద్యరాలిపై అత్యాచార ఘటనపై వైద్య విద్యార్థుల నిరసన తెలిపారు. మహాత్మాగాంధీ రోడ్డులో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులపై ప్రిన్సిపల్ సాయి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా నిరసనకు దిగిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారు. ధర్నాను చిత్రీకరిస్తున్న మీడియాపై ప్రిన్సిపల్ సీరియస్ అయ్యారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు, ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని నిరసన చేయాలన్నారు. తన అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తే సస్పెండ్ వంటి తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రిన్సిపల్ వైఖరిపై విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైద్యురాలికి అన్యాయం జరిగిందని నిరసన తెలిపితే తప్పేముందని ప్రశ్నించారు.

బాధిత కుటుంబానికి మంత్రి లోకేశ్ సంఘీభావం

కోల్ కతా వైద్యురాలి ఘటనపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. యువ వైద్యురాలు పడిన బాధను తలచుకుంటే తనకు మాటలు రావడంలేదన్నారు. ఈ క్రూరత్వాన్ని ఎంతగా ఖండించిన తక్కువే అవుతుందన్నారు. బాధిత కుటుంబానికి వేగంగా, నిర్ణయాత్మకంగా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి, ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్న వారందరికీ తాను సంఘీభావం తెలుపుతున్నానన్నారు. ప్రతి మహిళ భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు మనం ఐక్యంగా పనిచేయాలన్నారు.

వైద్య సేవలపై ఎఫెక్ట్, రోగులు ఇబ్బందులు

కోల్ కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఏపీ వ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేశారు. ఓపీలు లేవని తెలియక ఇతర జిల్లాల నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం నుంచి ఓపీ సేవల కోసం రోగుల పడిగాపులు కాస్తున్నారు. అయితే ఒకరు చనిపోయారని వేలాది మందిని చంపేస్తారా? వైద్యులు, వైద్య విద్యార్థులు తమ బాధలను అర్థం చేసుకోవాలని రోగులు కోరుతున్నారు. ఘటన జరిగిన చోట నిందితులను ఉరితీయాలని, ఇక్కడ రోగుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది వైద్యులు నిరసన తెలిపి, మరికొంత మంది వైద్య సేవలు అందించాలని వేడుకుంటున్నారు. వైద్యుల తమ పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణమే వైద్య సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

సంబంధిత కథనం