Kolkata doctor rape case: ‘దోషులను ఉరి తీయాల్సిందే.. కానీ’ .. కోల్ కతా డాక్టర్ హత్యాచారంపై సీఎం మమత స్పందన
దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, దోషులను ఉరి తీయాలని తాము ఇప్పటికీ చెబుతున్నామని సీఎం మమతా బెనర్జీ అన్నారు. నిరసనల పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, దోషులను ఉరితీస్తేనే అలాంటి ఆలోచనలు ఉన్న ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని మమతా బెనర్జీ అన్నారు.
రాజకీయ పార్టీల హస్తం
కాగా, కోల్ కతా లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన విధ్వంసం వెనుక లెఫ్ట్, బీజేపీ తదితర ప్రతిపక్ష రాజకీయ పార్టీల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా వద్ద ఉన్న సమాచారం మేరకు విద్యార్థులను నిందించను. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, దోషులను ఉరి తీయాలని ఇప్పటికీ చెబుతున్నాం’’ అన్నారు.
ఉరిశిక్ష వేయాలి
తనతో పాటు బెంగాల్ ప్రజలంతా బాధిత డాక్టర్ కుటుంబానికి అండగా ఉందని సీఎం మమత అన్నారు. ‘‘ఇది చాలా పెద్ద నేరం, దీనికి ఏకైక శిక్ష నిందితుడిని ఉరి తీయడమే. దోషిని ఉరితీస్తే, అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు దాని నుండి పాఠం నేర్చుకుంటారు. కాని ఏ నిర్దోషిని శిక్షించకూడదు’’ అని సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యానించారు.
హాస్పటల్ లో విధ్వంసం
కోల్ కతా లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన విధ్వంసంపై పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అర్ధరాత్రి సమయంలో సుమారు 40 మంది దుండగులు ఆందోళనకారుల మాదిరిగా ఆసుపత్రిలోకి ప్రవేశించి అత్యవసర విభాగం, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణాన్ని ధ్వంసం చేయడంతో పాటు సీసీ కెమెరాలను పగలకొట్టారు. ఆగస్టు 9 నుంచి జూనియర్ డాక్టర్లు ప్రదర్శన చేస్తున్న వేదికను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విపక్ష బీజేపీ స్పందించింది. నిరసన తెలుపుతున్న వైద్యులను రక్షించడంలో, విధ్వంసాన్ని నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించింది. పరిస్థితిని నియంత్రించలేకపోతే సైన్యాన్ని పిలవాలని మమత బెనర్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
'రీక్లెయిమ్ ది నైట్' నిరసన
కోల్ కతా లోని ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ దారుణంగా హత్యాచారానికి గురికావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, బుధవారం రాత్రి పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా యువత 'రీక్లెయిమ్ ది నైట్' నిరసన చేపట్టారు. ఈ సందర్భంగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోకి దుండగులు ప్రవేశించి విధ్వంసం చేశారు. ఈ విధ్వంసంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. భద్రతా చర్యలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రిలో నర్సులు ఆందోళనకు దిగారు.