Vijayawada Durga Temple : విజయవాడ దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావు, తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు
Vijayawada Durga Temple : విజయవాడ దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావు నియమితులయ్యారు. తక్షణమే ఆయన బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Vijayawada Durga Temple : విజయవాడ దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తోన్న కేఎస్ రామారావును దుర్గ గుడి ఈవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తక్షణమే ఆయన ఈవోగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. దుర్గగుడి ఈవో భ్రమరాంబను అక్టోబర్ 1న ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం. శ్రీనివాస్‌ను ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన విధుల్లో చేరకపోవడంతో.... కేఎస్ రామారావును ఈవోగా నియమించింది ప్రభుత్వం.
ఈవో బదిలీపై చర్చ
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో జరగాల్సి ఉండగా.. దుర్గగుడి ఈవో బదిలీ చర్చనీయాంశం అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఈవో భ్రమరాంబను బదిలీ చేయడం కలకలం రేపింది. ఈవో భ్రమరాంబ బదిలీకి కొద్ది నెలలుగా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్ర ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. ఇటీవల విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈవోను మార్చాలని ఆలయ ఛైర్మన్ నేరుగా సీఎం జగన్ కు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పరిధిలో వారు ఉండాలని హెచ్చరించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించిన తర్వాత కూడా వెల్లంపల్లి, కర్నాటిలు తమ ప్రయత్నాలు కొనసాగించారు. రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాల్లో ఒకటైన ఇంద్రకీలాద్రిని తమ గప్పెట్లో ఉంచుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకీలాద్రి జోలికి రాకూడదన్నట్లు వ్యవహరించడంతో ఆ శాఖ మంత్రికి ఆగ్రహం తెప్పించింది. గత ఏడాది జరిగిన దసరా ఉత్సవాల్లో మంత్రి సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు. దీంతో కొట్టు, వెల్లంపల్లికి మధ్య విభేదాలు తలెత్తాయి. తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలపై ఇతరుల పెత్తనాన్ని మంత్రి కొట్టు అంగీకరించలేదు.
15 నుంచి దసరా ఉత్సవాలు
ఈ నెల 15 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలుకానున్నాయి. ఈ సమయంలో ఆలయ ఈవో భ్రమరాంబను ప్రభుత్వం బదిలీచేయడం చర్చనీయాంశం అయింది. దేవాదాయశాఖకు చెందిన భ్రమరాంబను బదిలీచేసి, ఆ స్థానంలో రెవెన్యూశాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీనివాస్‌ను ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. అయితే శ్రీనివాస్ ఈవోగా బాధ్యతలు చేపట్టకపోవడంతో... శ్రీకాళహస్తి ఆలయం ఆర్డీవోగా పనిచేస్తున్న కేఎస్.రామారావును దుర్గగుడి ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.