CM Jagan : ఆరోగ్య శ్రీలో వైద్యం చేయించుకున్న వారికి ఏడాదిపాటు ఉచితంగా మందులు- సీఎం జగన్-vijayawada cm jagan review on jagananna arogya suraksha medical camps regular from january 1st ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : ఆరోగ్య శ్రీలో వైద్యం చేయించుకున్న వారికి ఏడాదిపాటు ఉచితంగా మందులు- సీఎం జగన్

CM Jagan : ఆరోగ్య శ్రీలో వైద్యం చేయించుకున్న వారికి ఏడాదిపాటు ఉచితంగా మందులు- సీఎం జగన్

Bandaru Satyaprasad HT Telugu
Nov 06, 2023 03:26 PM IST

CM Jagan : రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నామని సీఎం జగన్ అన్నారు. 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోందన్నారు. ప్రతి జిల్లాలో అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుందన్నారు.

సీఎం జగన్
సీఎం జగన్

CM Jagan : జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైందన్న సీఎం జగన్... వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చిందన్నారు. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98 శాతం, వార్డు సచివాలయాల్లో 77 శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందన్నారు. వైద్య శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూత నివ్వడం చాలా ముఖ్యం అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావన్న సీఎం జగన్... శిబిరాలు నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందన్నారు. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తి స్థాయిలో చేయూత నివ్వడం అత్యంత ముఖ్యమైనదన్నారు. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నయం అయ్యేంత వరకూ చేదోడుగా నిలుస్తామన్నారు.

అందరికీ వైద్య పరీక్షలు

ప్రతి ఇంటికీ వెళ్లి.. జల్లెడపడుతూ, అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని సీఎం జగన్.. ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇస్తున్నామన్నారు. అర్బన్‌ ఏరియాల్లో 91 శాతం, రూరల్‌ ఏరియాల్లో 94 శాతం స్క్రీనింగ్‌ పూర్తయ్యిందన్నారు. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్‌ పూర్తి చేశామని, 6.4 కోట్ల ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించామన్నారు.

'జగనన్న సురక్ష క్యాంపుల్లో నవంబర్‌ 5 కల్లా 85 వేల మంది పేషెంట్లను తదుపరి చికిత్సల కోసం నెట్‌వర్క్‌ ఆస్పత్రి లేదా టీచింగ్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేశారు. వీరికి చేయూత నివ్వడం ఒక కార్యక్రమం. మొబైల్‌ యాప్‌ ద్వారా ట్రాక్‌చేసి, వారిని ఆయా ఆస్పత్రులకు మ్యాప్‌ చేయాలి. ఆ తర్వాత విలేజ్‌ క్లినిక్‌కు, ఫ్యామిలీడాక్టర్‌కు, గ్రామ సచివాలయంలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో అనుసంధానం చేయించాలి. వారి ద్వారా వీరికి నయం అయ్యేంతవరకూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. 13,850 కేసులను ఇప్పటి వరకూ చేయూత నిచ్చి వారిని తదుపరి చికిత్సల కోసం ఆస్పత్రులకు పంపించారు. మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. వారికి కావాల్సిన మందులు ఇచ్చి.. నయం అయ్యేంత వరకూ చేయూత నివ్వాలి'- సీఎం జగన్

జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు

జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తారని సీఎం జగన్ తెలిపారు. ప్రతి నెలా మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఆరోగ్య శ్రీ కింద నమోదు కాని రోగాలు ఏమైనా ఉన్నా.. ప్రత్యేక కేసుల కింద పరిగణించి ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు అందిస్తామన్నారు. ఈ పేషెంట్లను గుర్తించి, వారికి చికిత్సలు అందించే బాధ్యతను తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు చేయించుకున్న పేషెంట్లపై దృష్టిపెట్టడం మరొక విషయం అన్న సీఎం జగన్...చికిత్సలు చేయించుకున్న తర్వాత వీరికి అందిన వైద్యంపై పూర్తి వివరాలు కనుక్కోవాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నారన్నారు.

ఎక్కడ ఖాళీలున్నా వెంటనే భర్తీ

8.7 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారని సీఎం జగన్ తెలిపారు. 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు తెలిపారన్నారు. వీరికి వెంటనే కంటి అద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే 73 వేల మందికి పైగా కంటి సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. డిసెంబర్‌ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నామని సీఎం జగన్ అన్నారు. 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోందన్నారు. ప్రతి జిల్లాలో అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుందన్నారు. రిక్రూట్‌మెంట్‌ పాలసీమీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. ఎక్కడైనా స్పెషలిస్టులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే 53 వేలమందిని ఆరోగ్య రంగంలో ఖాళీలను భర్తీ చేశామన్నారు. ఎక్కడ ఖాళీలు ఉన్నా, వెంటనే భర్తీ చేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు.

Whats_app_banner