Vande Bharath Train : ఆ మార్గంలోనే వందేభారత్‌ రైలు...-vande bharath train will run between vijayawada and secunderabad soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Vande Bharath Train Will Run Between Vijayawada And Secunderabad Soon

Vande Bharath Train : ఆ మార్గంలోనే వందేభారత్‌ రైలు...

HT Telugu Desk HT Telugu
Nov 13, 2022 06:48 AM IST

Vande Bharath Train ఆంధ్రప్రదేశ్‌‌కు వందే భారత్ రైలును కేటాయిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విశాఖ పర్యటనలో ప్రకటించారు. ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ రైలును నడిపేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించిన రైల్వేఅధికారులు సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య వందేభారత్‌ రైలును నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రానికి వందే భారత్ రైలును కానుకగా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (ఫైల్ ఫొటో)
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (ఫైల్ ఫొటో) (PTI)

Vande Bharath Train హైదరాబాద్‌-విజయవాడ మధ‌్య ఎన్ని రైళ్లు నడిచినా వాటికి డిమాండ్ ఉంటుంది. డిమాండ్‌కు తగ్గట్లుగా ఖాళీలు లేకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నయాలు వెదుక్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో హై స్పీడ్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా హై స్పీడ్ రైలును అందబాటులోకి తీసుకురావాలని రైల్వే వర్గాలు యోచిస్తున్నాయి.

విజయవాడ-సికింద్రబాద్‌ మధ్య వందే భారత్ రైలును నడిపేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిన ఇటీవల బెంగుళూరులో వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా మరో రైలును విజయవాడ-సికింద్రబాద్ మధ్య నడపాలని యోచిస్తున్నారు. ఉత్తరాదిలో పరుగులు తీస్తున్న వందేభారత్‌ రైళ్లు ఇటీవల చెన్నై-మైసూర్‌ మార్గంలో దక్షిణాదిలోకి ప్రవేశించాయి. కొత్త ఏడాది కానుకగా దక్షిణమధ్య రైల్వేలో పరిధిలో వందేభారత్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దక్షిణమధ్య రైల్వే పరిధిలో వందేభారత్‌ను పట్టాలెక్కించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి దూరప్రాంతాలకు ఈ రైలును నడపాలని తొలుత భావించారు. ప్రయాణికుల రద్దీ భారీగా ఉండే సికింద్రాబాద్‌-విశాఖ, సికింద్రాబాద్‌-తిరుపతి, కాచిగూడ-బెంగళూరు, హైదరాబాద్‌-ముంబై మార్గాలను అధికారులు పరిశీలించారు. వందేభారత్‌ రైల్లో బెర్తులు లేకపోవడం, కేవలం కూర్చొని ప్రయాణించేలా వీలుగా సీట్లు ఉండటం వల్ల 13-15 గంటలపాటు ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేయడం సాధ్యం కాదని అంచనాకు వచ్చారు. ప్రస్తుతంసికింద్రబాద్-విజయవాడ రూట్‌లో వందేభారత్‌ను నడపాలని అధికారులు భావిస్తున్నారు.

హైడెన్సిటీ నెట్‌వర్క్‌ రూట్‌లో...

ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం ఉద్యోగుల రాకపోకల కోసం ఇంటర్‌సిటీ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇరు రాష్ట్రాల్లోని ఉద్యోగులు రాకపోకలు సాగించేలా ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఐదు ఇంటర్‌సిటీ రైళ్లతోపాటు, విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవి సుమారు 20 రైళ్లు ఉన్నాయి. ఇంటర్‌సిటీ రైళ్లలో కొన్ని బీబీనగర్, నడికుడి మీదుగా విజయవాడ నుంచి గుంటూరు వరకు నడుస్తుండగా, న్ని విజయవాడకే పరిమితమయ్యాయి. రోజూ 25 వేల మందికి పైగా ప్రయాణికులు సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఈ రెండు నగరాల మధ్య రైళ్లలో ప్రయాణికుల డిమాండ్‌ బాగానే ఉంది.

తక్కువ సమయంలోనే రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించేందుకు వందేభారత్‌ను ప్రవేశపెడితే ఆదరణ ఉంటుందని అంచనా వేశారు. సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట్‌ మీదుగా విజయవాడ మార్గాన్ని హైడెన్సిటీ నెట్‌వర్క్‌ పరిధిలోకి తెచ్చారు. 130 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో రైళ్లుప్రయాణించేందుకు వీలుగా ట్రాక్‌ సామర్థ్యాన్ని పెంచారు. ప్రస్తుతం హైడెన్సిటీ నెట్‌వర్క్‌ రూట్లలోనే వందేభారత్‌ రైళ్లు నడుస్తున్న దృష్ట్యా సికింద్రాబాద్‌-విజయవాడ రూట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు సుమారు 6 గంటల సమయం పడుతోంది. బీబీనగర్‌-నడికుడి రూట్‌లో మరింత ఎక్కువ సమయం పడుతోంది. రైళ్ల రద్దీ, లైన్లపై పెరిగిన ఒత్తిడి వల్ల కూడా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గంటకు 80 కి.మీ. కూడా వెళ్లడం లేదు. ట్రాక్‌ సామర్థ్యాన్ని పెంచిన,సికింద్రాబాద్‌-కాజీపేట్‌-విజయవాడ మార్గంలో వందేభారత్‌ను నడపడం వల్ల 4 గంటల్లోనే విజయవాడకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ మధ్య నిత్యం రాకపోకలు సాగించే వేలాది మందికి ఊరట లభించనుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోనుంది. ప్రయాణ సమయాలు అనువుగా ఉంటే డైలీ సర్వీస్‌ చేసుకునే వెసులుబాటు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

IPL_Entry_Point

టాపిక్