Vande Bharat Express: ఏలూరు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఫలించిన టీడీపీ ఎంపీ కృషి-vande bharat express halting at eluru railway station soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vande Bharat Express: ఏలూరు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఫలించిన టీడీపీ ఎంపీ కృషి

Vande Bharat Express: ఏలూరు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఫలించిన టీడీపీ ఎంపీ కృషి

Basani Shiva Kumar HT Telugu
Aug 22, 2024 11:11 AM IST

Vande Bharat Express: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కృషి ఫలించింది. ఎంపీ కృషితో.. ఏలూరు ప్రజల కోరిక నెరవేరబోతోంది. త్వరలోనే ఏలూరు రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వనున్నారు. ఏలూరులో వందేభారత్‌కు హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (Indian Railway )

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఏలూరులో హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది. టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కృషితో ఆ డిమాండ్ నెరవేరబోతోంది. అవును.. ఏలూరు రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వనున్నారు. ఒకటి రెండ్రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. దీంతో ఏలూరు ప్రజల కోరిక నెరవేరబోతోంది. తమ కోరిక నేరవేర్చినందుకు ఎంపీ పుట్టా మహేశ్.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

మాజీ ఎంపీ శ్రీధర్ కూడా..

ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఏలూరు ప్రజల కోరిక మేరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కోటగిరి శ్రీధర్ అభ్యర్థనపై రైల్వే మంత్రి స్పందించారు. అధికారులతో అధ్యయనం చేయించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత కూడా కోటగిరి శ్రీధర్ రైల్వే అధికారులను కలిసి పదే పదే ఈ విజ్ఞప్తి చేశారు.

విజయవాడ 62.. రాజమండ్రి 98..

తక్కువ డిస్టెన్స్ ఉంటే వందేభారత్‌కు హాల్టింగ్ ఇవ్వరని అప్పట్లో రైల్వే అధికారులు చెప్పారు. అయితే.. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతోంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఏలూరు ఉంటుంది. విజయవాడ నుంచి ఏలూరు 62 కిలోమీటర్లు కాగా.. ఏలూరు నుంచి రాజమండ్రి 98 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ, రాజమండ్రి మధ్య ఏలూరే పెద్ద స్టేషన్. అందుకే హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది.

మధ్యలో 5 స్టేషన్లలో హాల్టింగ్..

సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యలో 5 స్టేషన్లలో ఆగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. తర్వాతి స్టాప్ విజయవాడ. ఆ తర్వాత రాజమండ్రి, సామర్లకోటలో హాల్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏలూరులో కూడా హాల్టింగ్ ఇస్తే మొత్తలు 6 స్టేషన్లలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆగనుంది.

జిల్లా ప్రజలకు ఉపయోగం..

ఏలూరు జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాలు ఉన్నాయి. దెందులూరు, చింతలపూడి, పోలవరం ఏరియాల్లో ఎక్కువగా ఫామాయిల్ పండిస్తారు. దీని వ్యాపారానికి సంబంధించి రైతులు, వ్యాపారులు ఎక్కువగా విజయవాడ, విశాఖపట్నం వెళ్తుంటారు. వారికి వందేభారత్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక నూజివీడు ప్రాంతంలో మామిడి ఎక్కువగా పండిస్తారు. ఆ రైతులు, వ్యాపారులు కూడా విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఎక్కువగా వెళ్తారు. వారికి కూడా వందేభారత్ అనుకూలంగా ఉండనుంది.