Vizag Metro: విశాఖ మెట్రో రుణానికి ఎలాంటి ప్రతిపాదనల్లేవు.. పార్లమెంటులో కేంద్రం
Vizag Metro: విశాఖపట్నం మెట్రో నిర్మాణం కోసం ఏపీ నుంచి ఎలాంటి తాజా ప్రతిపాదనలు కేంద్రానికి రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పార్లమెంటులో ప్రకటించింది.
Vizag Metro: విశాఖపట్నం మెట్రో నిర్మాణానికి నిధులు కేటాయించడానికి కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు నిరాకరించిన తర్వాత.. ఇతర ఆర్ధిక సంస్థల నుంచి మెట్రో ప్రాజెక్టు రుణం కోరుతూ ఏపీ ప్రభుత్వం కోరలేదని కేంద్రం స్పష్టం చేసింది. కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ తర్వాత మరో సంస్థ ద్వారా రుణం ఇప్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలూ పంపలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ పార్లమెంటులో ప్రకటించారు.
సోమవారం రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. పట్టణ రవాణా వ్యవస్థకు సంబంధించిన ప్రణాళిక, నిర్వహణ, నిధుల సమీకరణ, పర్యవేక్షణ, అమలు బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు కొరియన్ సంస్థ నిరాకరించిన తర్వాత ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం ప్రకటించింది.
మరోవైపు కర్నూలు విమానాశ్రయం నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైలకు విమానాలు నడపడానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ సమర్పించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకేసింగ్ ప్రకటించారు. ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఈ ఎయిర్‌పోర్టును రూ.241 కోట్లతో అభివృద్ధి చేసినట్లు కేంద్రమంత్రి చెప్పారు.