Chittoor Accident : చిత్తూరు జిల్లాలో విషాదం.. మృత్యువు రూపంలో వచ్చిన రోడ్డు రోలర్.. ఇద్దరు యువకులు మృతి
Chittoor Accident : చిత్తూరు జిల్లాలో విషాదం జరిగింది. ఇద్దరు యువకులను రోడ్డు రోలర్ బలి తీసుకుంది. రోడ్డుపై నిద్రిస్తున్న నైట్ వాచ్‌మెన్‌లపైకి దూసుకెళ్లింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామంలో విషాదం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. పేదరికంలో ఉన్న కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు.. తమ ఊరికి సమీపంలోని రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీలో రాత్రి వాచ్‌మెన్‌గా పనికి చేరారు. పగటిపూట వారిలో ఒకరు వ్యవసాయ పనులు, ఇంకొకరు స్కూటర్ మెకానిక్ పని చేస్తున్నారు. తమ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారు. పని ప్రదేశంలో వారిని రోడ్ రోలర్ రూపంలో మృత్యువు కబళించించింది.
బైరెడ్డిపల్లి మండంలో తీర్థం గ్రామం వద్ద ఓ కంపెనీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన అష్రఫ్ (24), సాదిక్ (26) ఆ పనుల వద్ద నెట్ వాచ్‌మెన్లుగా ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. గురువారం రాత్రి ఎప్పటిలాగే విధులకు వెళ్లారు. అర్ధరాత్రి రెండు గంటల వరకూ అక్కడి పరికరాలు, యంత్రాలు, పనులకు కాపలా ఉన్నారు. ఆ తరువాత వారికి నిద్ర రావడంతో.. సమీపలోని మట్టిదిబ్బ ప్రదేశంలో కునుకు తీశారు.
లైట్ వెలుతురులో రోడ్డు పనులు చేస్తున్న రోడ్డు రోలర్ అటుగా వచ్చింది. నిద్రిస్తున్న యువకులను గుర్తించని రోలర్.. వారిపైకి దుసుకెళ్లింది. దీంతో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని గుండెలవిసేలా విలపించారు. యువకుల మృతితో గ్రామం శోకసంద్రమైంది. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అయ్యారు. స్థానిక సీఐ మురళీ మోహన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో రెండు లారీలు ఢీ..
ప్రకాశం జిల్లాలో రెండు లారీలు ఢీకొన్నాయి. లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయి తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున శింగరాయకొండలో జరిగింది. శింగరాయకొండ జాతీయ రహదారి పరిధిలోని లారీ యూనియన్ ఆఫీస్ ఎదురుగా.. కలకత్తా నుంచి బెంళూరుకు వెళ్తున్న కూరగాయల లారీ మరో లారీని ఢీకొట్టింది.
దీంతో కూరగాయల లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయారు. ఆ డ్రైవర్ కలకత్తాకు చెందిన దావూద్‌గా పోలీసులు గుర్తించారు. హైవే పోలీసులతో పాటు జాతీయ రహదారి సిబ్బంది కలిసి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు. డ్రైవర్ దావూద్ కాలు నలిగిపోయింది. హైవే అంబులెన్స్‌లో ఒంగోల్ రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)