Gannavaram : గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
Gannavaram : కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరికి గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదలను మిన్నంటాయి.
కృష్ణా జిల్లా గన్నవరం శివారులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై- కలకత్తా జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున 2.35 గంటలకు చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో కూరగంటి మార్క్ (25), పోలేపోగు మేరీ (38) అక్కడికక్కడే మృతి చెందగా.. పల్లెపోగు ప్రేమమ్మ (41) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పల్లెపోగు ఆదాం, పల్లెపోగు మురారీకి తీవ్ర గాయాలు అయ్యాయి.
బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం కోటపాడుకు చెందిన పల్లెపోగు ప్రేమమ్మ.. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమె చికిత్స నిమిత్తం ఈనెల 24న భర్త పల్లెపోగు ఆదాం, వరుసకు కొడుకు అయిన పల్లెపోగు మురారీ, ఆదాం అల్లుడు ఆరికట్లవారిపాలేనికి చెందిన కూరగంటి మార్క్, ఆదాం సోదరి కొండమంజులూరుకు చెందిన పోలేపోగు మేరీ కారులో విశాఖపట్నం వెళ్లారు. వైజాగ్‌లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో చూసించుకుని.. బుధవారం రాత్రి తిరిగి ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున 2.35 గంటలకు మార్గమధ్యలోని గన్నవరం చేరుకున్నారు.
గన్నవరంలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలోకి చేరుకొనేసరికి.. కారు నడుపుతున్న పల్లెపోగు ఆదాం నిద్రమత్తులోకి వెళ్లారు. జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని అతి వేగంగా ఢీకొట్టాడు. దీంతో కారు లారీ కిందకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగంటి మార్క్ (25), పోలేపోగు మేరీ (38) అక్కడికక్కడే మృతి చెందారు. పల్లెపోగు ప్రేమమ్మ (41), పల్లెపోగు ఆదాం, పల్లెపోగు మురారీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన ప్రేమమ్మ, ఆదాం, మురారిని అతి కష్టం మీద బయటకు తీశారు. ముగ్గురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పల్లెపోగు ప్రేమమ్మ మరణించారు. పల్లెపోగు ఆదాం, పల్లెపోగు మురారీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కూరగంటి మార్క్, పోలేపోగు మేరీ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివప్రాద్ తెలిపారు. ఈ ప్రమాదంతో కూరగంటి మార్క్ స్వగ్రామమైన ఆరికట్లవారిపాలెంలోనూ, పోలేపోగు మేరీ స్వగ్రామమైన కొండమంజులూరులోనూ, పల్లెపోగు ప్రేమమ్మ స్వగ్రామమైన కోటపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయవాడ, గన్నవరం ఆసుపత్రులకు కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. కూరగంటి మార్క్‌కు భార్య, ఒక బాబు ఉన్నారు. పోలేపోగు మేరీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)