Driver Jamuna Movie Review: కోలీవుడ్‌లో అభినయానికి ఆస్కారమున్న పాత్రలతో కథానాయికగా ప్రతిభను చాటుకుంటోంది ఐశ్వర్యరాజేష్ (Aishwarya Rajesh). ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధాన సినిమాల్లోనే ఎక్కువగా నటించిన ఐశ్వర్యరాజేష్ తన పంథాకు భిన్నంగా తొలిసారి థ్రిల్లర్ కథాంశంతో చేసిన తాజా సినిమా డ్రైవర్ జమున. రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు కిన్‌స్లిన్ దర్శకత్వం వహించాడు. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా అదే పేరుతో ఆహా ఓటీటీ (Aha OTT) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
జమున (ఐశ్వర్యరాజేష్) తండ్రి సుందరం ఓ క్యాబ్ డ్రైవర్. అతడు హత్యకు గురికావడం, తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబ బాధ్యతలు జమునపై పడతాయి. తండ్రి క్యాబ్ జమున నడపుతుంటుంది. ఓ రోజు ఆమె క్యాబ్‌ను ముగ్గురు వ్యక్తులు బుక్ చేస్తారు. వారితో పాటు ఓ అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వారితో కలిసి ప్రయాణం చేస్తుంటాడు. ఈ జర్నీలో తన కారులో ప్రయాణిస్తోన్న ఆ ముగ్గురు కరుడుగట్టిన కిరాయి హంతకులు అనే నిజం జమునకు తెలుస్తుంది.
ప్రజల్లో మంచి పేరు ఉన్న మాజీ ఎమ్ఎల్ఏ మద్దెల వెంకట్రావును చంపేందుకు వారు ప్లాన్ చేస్తారు. వారిని పోలీసులకు పట్టించాలని అనుకున్న జమున ప్లాన్ బెడిసికొడుతుంది. వారి చేతిలో ఆమె బంధీగా మారిపోతుంది. తాము చెప్పినట్లు వినాలంటూ జమునను బెదిరిస్తారు.
తమ ప్లాన్ ఫర్‌ఫెక్ట్‌గా పూర్తయిన తర్వాత జమునను చంపాలని ఆ కిల్లర్స్ అనుకుంటారు. ఆ హంతక ముఠా వల్ల జమున ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నది? వారి బారి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడిందా? మద్దెల వెంకట్రావును చంపాలని ఆ కిల్లర్స్ ఎందుకు అనుకున్నారు? జమున తండ్రి మరణానికి మద్దెల వెంకట్రావుకు సంబంధం ఉందా? అన్నదే (Driver Jamuna Movie Review)ఈ సినిమా కథ.
సర్వైవల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన రివేంజ్ డ్రామాగా డ్రైవర్ జమున సినిమా రూపొందింది. ఈ సినిమా కథ మొత్తం క్యాబ్ జర్నీ నేపథ్యంలో సాగుతుంది. తన క్యాబ్‌లో ప్రయాణిస్తోన్న హంతకముఠాతో ఓ యువతి సాగించిన పోరాటం చుట్టూ దర్శకుడు కథను అల్లుకున్నారు.
డ్రైవర్ జమున సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌తో గతంలో తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. కథానేపథ్యం ఒకటే అయినా లేడీ ఓరియెంటెడ్ జోనర్‌లో సినిమాను తెరకెక్కించడంతో ఫ్రెష్‌ఫీల్ కలుగుతుంది.
కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడానికి జమున క్యాబ్ డ్రైవర్‌గా మారాలని నిర్ణయించుకునే సీన్‌తోనే సినిమా మొదలవుతుంది. కిరాయి హంతకముఠా జమున క్యాబ్ బుక్ చేయడం, పోలీసులు వెతుకుతోన్న కిల్లర్స్ వారే అని జమున గుర్తించే సన్నివేశాలతో తర్వాత ఏం జరుగబోతుందనే ఆసక్తిని రేకెత్తించారు దర్శకుడు.
ఆ కిల్లర్స్ బారి నుంచి జమున తప్పించుకునే ప్రతి ప్రయత్నం మిస్ అవుతూ చివరి వరకు ఉత్కంఠగా సినిమా(Driver Jamuna Movie Review )సాగుతుంది. క్లైమాక్స్‌లో దర్శకుడు తన నేర్పును ప్రదర్శించారు. జమున వేసిన ప్లాన్‌లోనే ఆ హంతకులు చిక్కుకున్నట్లుగా వచ్చే మలుపు ఇంట్రెస్టింగ్‌ను కలిగిస్తుంది. తన తండ్రి మరణానికి పగ తీర్చుకున్నట్లుగా చూపించి సినిమాను ముగించారు.
ఆ ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్‌ను నమ్ముకొని దర్శకుడు కిన్‌స్లిన్ డ్రైవర్ జమున సినిమాను తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ మినహా సినిమా మొత్తం రొటీన్‌గా సాగుతుంది. కిరాయి హంతుకుల బారి నుంచి జమున తప్పించుకోవడానికి ప్రయత్నించే సీన్స్‌లో థ్రిల్ మిస్సయింది.
కిల్లర్స్ సిటీ అంతా తిరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదనే లాజిక్ మిస్ కాకుడదనే కొన్ని క్యారెక్టర్స్ సినిమాలో ఇరికిరించారు. డైలాగ్స్ చెప్పడం తప్పితే ఆ పోలీస్ క్యారెక్టర్ వల్ల సినిమాకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ కిల్లర్స్ బ్యాచ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనుకోకుండా ఇరుక్కోవడం నుంచి కామెడీ, సింపథీ రెండు వర్కవుట్ కాలేదు.
జమునగా ఐశ్వర్యరాజేష్ నటన ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. కిల్లర్స్ నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడే యువతి పాత్రలో మెచ్యూర్డ్ యాక్టింగ్‌ను కనబరిచింది. ప్రజలకు మంచి చేస్తున్నట్లు నటించే రాజకీయనాయకుడిగా ఆడుకాలం నరేన్ కనిపించాడు. సీరియల్ కిల్లర్స్ ముఠా యాక్టింగ్ పర్వాలేదనిపిస్తుంది.
లేడీ ఓరియెంటెడ్ కథాంశంతోతెరకెక్కిన రొటీన్ రివేంజ్ థ్రిల్లర్ సినిమాగా డ్రైవర్ జమునను నిలిచింది. కొత్తదనం థ్రిల్ రెండు ఈ సినిమాలో లోపించాయి. ఐశ్వర్యరాజేష్ యాక్టింగ్ కోసం మాత్రం ఈ సినిమా చూడొచ్చు.