TTD Proposals: నడక మార్గాలపై టీటీడీ కసరత్తు ప్రారంభం, కేంద్రం అనుమతిస్తేనే ముందడు..-ttd is making several proposals to protect the tirumala stairway from wild animals ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Proposals: నడక మార్గాలపై టీటీడీ కసరత్తు ప్రారంభం, కేంద్రం అనుమతిస్తేనే ముందడు..

TTD Proposals: నడక మార్గాలపై టీటీడీ కసరత్తు ప్రారంభం, కేంద్రం అనుమతిస్తేనే ముందడు..

HT Telugu Desk HT Telugu
Sep 08, 2023 01:23 PM IST

TTD Proposals: తిరుమల నడక మార్గాల్లో భక్తులకు వన్య ప్రాణుల నుంచి రక్షణ కల్పించే చర్యలపై టీటీడీ కసరత్తు ప్రారంభించింది. భక్తులకు రక్షణ కల్పించే చర్యలపై సర్వే నిర్వహణకు అనుమతించాలని కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

తిరుమలలో బోనులో చిక్కిన చిరుత
తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

TTD Proposals: తిరుమల నడక మార్గంలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులపై వన్యప్రాణులు దాడి చేయకుండా చేపట్టాల్సిన చర్యలపై సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని టీటీడీ అనుమతిని కోరింది.

ప్రస్తుతం తిరుమల శ్రీవారిని చేరుకోడానికి రెండు నడక మార్గాలు ఉన్నాయి.వీటిలో ఒకటి 7.2 కిలోమీటర్ల దూరంతో 3550 మెట్లతో ఉన్న అలిపిరి మెట్ల మార్గం ఒకటి రెండోది 2.1కిలోమీటర్ల దూరంతో 2650 మెట్లతో ఉణ్న శ్రీవారి మెట్టు మార్గం.. రెండు నడక దారుల్లో ఇనుప కంచె వేయాలని ఇటీవల కాలంలో డిమాండ్ వస్తోంది.

ఆగష్టు 11న నెల్లూరు జిల్లాకు చెందిన లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన తర్వాత అటవీ శాఖ మెట్ల మార్గానికి సమీపంలో నాలుగు చిరుతల్ని బోనుల్లో బంధించింది. మరికొన్ని చిరుతలు మెట్ల మార్గానికి సమీపంలో సంచరిస్తున్నట్లు గుర్తించి వాటిని కూడా బంధించేందుకు ప్రయత్నిస్తోంది

మరోవైపు వన్యప్రాణుల నుంచి శాశ్వతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రత్యామ్నయాలను టీటీడీ పరిశీలిస్తోంది. శేషాచలం కొండల్లో విస్తరించిన తిరుమల రక్షిత అభయారణ్యంలో 8వేల ఎకరాలు మాత్రమే టీటీడీ పరిధి ఉంది. జంతువుల ఫ్రీ పాసింగ్ ఏరియాలో కంచె నిర్మాణం చేపట్టాలనే చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై సర్వే నిర్వహించడానికి కేంద్ర అటవీ శాఖకు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు టీటీడీ ప్రతిపాదనలు పంపింది. చీఫ్ వైల్డ్‌ లైఫ్ వార్డెన్, ప్రిన్సిపల్ చీఫ్‌ కన్జర్వేటర్ ఆఫ్ వైల్డ్‌ లైఫ్‌లకు కూడా ఈ ప్రతిపాదనలు చేసింది. తిరుమల కొండల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సిందే.

వన్యప్రాణుల నుంచి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయాలి దానికి ఎంత భూమి కావాలి, ఆ భూమి టీటీడీ పరిధిలో ఉందా, అడవిలో ఉందో తెలుసుకోడానికి సర్వే చేయడానికి కేంద్ర అటవీ శాఖనే టీటీడీ అనుమతి కోరింది.వన్యప్రాణుల స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలకు అటవీ శాఖ అనుమతించదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతకు కంచె అనుమతించే అవకాశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అనుమతి కోరుతోంది. ప్రాథమికంగా అలిపిరి నుంచి తిరుమల వెళ్లడానికి పరిమితులతో కూడిన అనుమతులు మాత్రమే అనుమతించినట్లు చెప్పారు. సర్వే చేపట్టడానికి టీటీడీ వైల్డ్‌ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది.

ఇప్పిటకే శేషాచలం అటవీ ప్రాంతాన్ని రక్షిత అటవీ ప్రాంతంగా కేంద్రంగా గుర్తించింది. వన్యప్రాణి చట్టాలకు అనుగుణంగా ఏమైనా పనులు చేపట్టాల్సి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రాథమికంగా టీటీడీ మూడు రకాల ప్రత్యామ్నయాలను నిపుణులతో పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న మెట్ల మార్గాలకు కంచెలు నిర్మించడంతో పాటు ఇతర ప్రత్యామ్నయాలను పరిశీలిస్తోంది.

రక్షిత అటవీ ప్రాంతంలో కంచెలు నిర్మిస్తే జంతువుల రాకపోకలకు అటంకం కలుగుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మెట్ల మార్గంలో కంచెలతో పాటు జంతువులు అటుఇటు వెళ్లేలా కందకాల నిర్మాణం చేపట్టే ప్రతిపాదన కూడా టీటీడీ యోచిస్తోంది. దీంతో పాటు వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండ దిగువ నుంచి సొరంగం తరహా నిర్మాణాలను కూడ పరిశీలిస్తోంది.

మూడో ప్రత్యామ్నయంగా భక్తుల నడవడానికి, జంతువుల సంచరించడానికి ఇబ్బంది లేకుండా “స్కై వాక్” తరహాలో ఫుట్‌ బ్రిడ్జిలను కొండ పైకి నిర్మిస్తారు. వీటి నిర్మాణంతో దిగువున జంతువులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. వీటిలో సురక్షితమైన ప్రతిపాదనతో ముందుకు వెళ్లడానికి ప్రాథమికంగా సర్వే నిర్వహించాల్సి ఉంది.

సర్వే నిర్వహణకు కేంద్రం అనుమతిస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అటవీ శాఖ స్పష్టం చేస్తోంది. టీటీడీ లేఖలకు కేంద్ర ప్రభుత్వం స్పందన ఆధారంగా కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. తిరుమలలో లాక్‌డౌన్‌ సమయంలో చిరుతల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. భక్తుల కదలికలు లేకపోవడంతో వన్యప్రాణులు వృద్ధి చెందాయని చెబుతున్నారు.

Whats_app_banner