Tirumala Laddu : శ్రీవారి లడ్డూల జారీలో మార్పులు - TTD తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి-ttd additional eo given clarity on laddu prasadam distribution ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Laddu : శ్రీవారి లడ్డూల జారీలో మార్పులు - Ttd తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

Tirumala Laddu : శ్రీవారి లడ్డూల జారీలో మార్పులు - TTD తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 30, 2024 04:02 PM IST

తిరుమలలో లడ్డూ ప్రసాదం పంపిణీపై విధించిన ఆంక్షలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. దళారుల బెడదను లేకుండా చేయడమే లక్ష్యంగా కొన్ని మార్పులు చేసినట్లు పేర్కొంది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఓ ప్రకటనలో కోరింది. కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించింది.

తిరుమల లడ్డూ(ఫైల్ ఫొటో)
తిరుమల లడ్డూ(ఫైల్ ఫొటో) (image source TTD)

తిరుమల శ్రీవారి లడ్డూల పంపిణీలో తీసుకొచ్చిన మార్పులపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా మార్పులు తీసుకొచ్చినట్లు ప్రకటించింది.  శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు  చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.

తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన… దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్ తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్‌లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు.

ఆధార్ నమోదు చేసుకోవాలి…

సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదనపు ఈవో స్పష్టం చేశారు. ఇందులో భాగంగా  ఆగస్టు 29 ఉదయం నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చిందని చెప్పారు. దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని రెండు లడ్డూలు పొందవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారని వివరించారు. 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చని తెలిపారు.

“దర్శనం టోకెన్లు లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలోవలే అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు. టోకెన్స్ లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూ తో పాటు 4-6లడ్డూలను తీసుకోవచ్చు.  గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి, భక్తులకు అధిక ధరల విక్రయించినట్లు టీటీడీ గుర్తించింది.  దీనిని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్ పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది” అని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఈ విషయంలో భక్తులు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

Whats_app_banner