Mother And Daughter: చిత్తూరు జిల్లాలో విషాదం, చిన్నారిని నీటిలోకి లాక్కెళ్లిన ఆవు, కాపాడబోయి తల్లి కూడా మృతి
Mother And Daughter: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పశువులు మేపేందుకు వెళ్లిన చిన్నారిని ఆవు బెదిరి ఈడ్చుకు పోయింది. అది చూసి నీటి కుంటలో పడిన కుమార్తెను కాపాడేందుకు బాలిక తల్లి ప్రయత్నించింది. ఈత రాకపోవడంతో తల్లి కుమార్తె ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చౌడేపల్లిలో జరిగింది.
Mother And Daughter: చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కళ్లెదుట నీటిలో పడిన కుమార్తెను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా దుర్మరణం పాలైంది. కుమార్తెను కాపాడేందుకు నీటిలో దూకిన తల్లికి ఈత రాకపోవడంతో కుంటలో మునిగి మృతి చెందారు.
చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం కాటిపేరి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన కుమార్ రెడ్డి, మౌనిక దంపతుల కుమార్తె అనిశారెడ్డి గ్రామంలో ఆవును మేపేందుకు తీసుకువెళ్లింది. ఈ క్రమంలో ఆవుకు కట్టిన తాడు పట్టుకుని చిన్నారి వెళుతోంది. చిన్నారి వెనుకే తల్లి మౌనిక కూడా పొలానికి బయల్దేరింది.
ఈ క్రమంలో గడ్డిని మేస్తున్న ఆవు బెదిరి ఒక్కసారి పరుగులంకించుకుంది. కొంతదూరంలో ఉన్న నీటి కుంటలో బాలిక పడిపోయింది. ఆ వెనుక వస్తున్న మౌనిక కుమార్తెను కాపాడుకోడానికి కుంటలో దూకింది. మౌనికకు ఈత రాకపోవడంతో కుమార్తెతో సహా నీటిలో మునిగిపోయారు.
మౌనిక మదనపల్లె ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆవును మేపడానికి వెళ్లి భార్య, కుమార్తె ఇంటికి రాకపోవడంతో వెదుక్కుంటూ వచ్చిన భర్తకు నీటి కుంటలో భార్య, కుమార్తె విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మౌనిక భర్త కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.