Tirumala Brahmotsavam 2023 : తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
Tirumala Brahmotsavam 2023 Updates : శ్రీ వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ మోహినీ అవతారంలో దర్శనమిచ్చాడు.
Tirumala Brahmotsavam 2023 Updates: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతారం - మాయా మోహ నాశనం
ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు యానాదయ్య, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
గరుడ వాహనం…
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు.పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేబుతున్నాడు.