Tirumala : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - ఇవాళే అంకురార్పణ
Tirumala Navaratri Brahmotsavam 2023 :తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతుండగా… ఇవాళ అంకురార్పణం జరుగనుంది.
Navaratri Brahmotsavam Ankurarpanam: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం ఇవాళ (అక్టోబరు 14) అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహనసేవ రాత్రి 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇవాళ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. బ్రహ్మోత్సవాల తొలిరోజు అక్టోబరు 15న ఉదయం 9 నుండి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు.
గరుడ వాహన సేవ సమయం మార్పు…
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 19న జరుగనున్న గరుడవాహనసేవ దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో రాత్రి 7 గంటలకు బదులుగా సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అదేవిధంగా, ఎక్కువ మంది సామాన్య భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడసేవను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ముందురోజు నుండే గ్యాలరీల్లో నిరీక్షిస్తుంటారు. వారి సౌలభ్యం మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాతే రాత్రి వాహనసేవ నిర్వహిస్తారు. కాగా, అక్టోబరు 19న సాయంత్రం 6.15 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. ఆ తరువాత సాయంత్రం 6.30 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుంది. గతంలో రాత్రి 9 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుండగా, ఆ సమయాన్ని రాత్రి 7 గంటలకు మార్చారు. ప్రస్తుతం ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు గరుడసేవ సమయాన్ని అరగంట ముందుకు మార్చడం జరిగింది.
ఆర్జిత సేవలు రద్దు…
బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతిస్తారు. అక్టోబరు 14న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబరు 14 నుండి 23వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేసింది.
లగేజి కౌంటర్లు ఏర్పాటు…
బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు లగేజి, సెల్‌ఫోన్లు భద్రపరచుకునేందుకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ ఎదురుగా అదనంగా లగేజి కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో జిఎన్‌సి, టిబిసి, పిఏసి-4 వద్ద లగేజి కౌంటర్లు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం, వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పిఏసి-4 లగేజి కౌంటరును తాత్కాలికంగా మూసి వేశారు. వీరి సౌకర్యార్థం వరాహస్వామి విశ్రాంతి గృహాలకు ఎదురుగా, కల్యాణవేదిక వెనుకవైపు గల శ్రీవారి సేవాసదన్ ఎదురుగా విశాలమైన ప్రాంతంలో అదనంగా 3 లగేజి కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం నుండి వెలుపలికి వచ్చే భక్తులు, వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు సమీపంలో ఉన్న శ్రీవారి సేవా సదన్ ఎదురుగా గల కౌంటర్లలో లగేజి, సెల్‌ఫోన్లు పొందే అవకాశముంది. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరడమైనది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 19న గరుడ సేవ నాడు తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్లలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది.