Ponnavolu on Tirumala Laddu : రూ.320 నెయ్యిలో రూ.1400 ఖరీదైన పంది కొవ్వు ఎలా కలుపుతారు?- పొన్నవోలు-tirumala laddu row ysrcp leader ponnavolu petition in supreme court questioned beef fat costly than ghee ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ponnavolu On Tirumala Laddu : రూ.320 నెయ్యిలో రూ.1400 ఖరీదైన పంది కొవ్వు ఎలా కలుపుతారు?- పొన్నవోలు

Ponnavolu on Tirumala Laddu : రూ.320 నెయ్యిలో రూ.1400 ఖరీదైన పంది కొవ్వు ఎలా కలుపుతారు?- పొన్నవోలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 23, 2024 04:48 PM IST

Ponnavolu on Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వైసీపీ నేత, న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. పంది కొవ్వు కేజీ రూ.450 నుంచి రూ.1400 వరకు ఉంటుందని, రూ.320 నెయ్యిలో ఖరీదైన పంది కొవ్వు కలుపుతారా? అని ప్రశ్నించారు.

రూ.320 నెయ్యిలో రూ.1400 ఖరీదైన పంది కొవ్వు ఎలా కలుపుతారు?- పొన్నవోలు
రూ.320 నెయ్యిలో రూ.1400 ఖరీదైన పంది కొవ్వు ఎలా కలుపుతారు?- పొన్నవోలు

Ponnavolu on Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కల్తీ నెయ్యి ఆరోపణలపై నిజాలు నిగ్గుతేల్చాలని టీటీజీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వైసీపీ నేత, న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు ఈ అంశంపై ముడిపడి ఉన్నాయన్నారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పంది కొవ్వు కేజీ రూ.450 నుంచి రూ.1400 వరకు ఉంటుందన్నారు. ఇంత ఖరీదైన పంది కొవ్వును రూ.320కి సరఫరా చేసే నెయ్యిలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఇత్తడిలో ఎవరైనా బంగారం కలుపుతారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్ తో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

లడ్డూ వ్యవహారంపై ముందు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అనుకున్నామని, అయితే ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు సంబంధించినదని అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని పొన్నవోలు చెప్పారు. అసలు ఈ ప్రచారంలో నిజం ఉంటే అది బయటకు రావాలన్నారు. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై నిజాలు బయటకు రావాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు.

లడ్డూ కల్తీకి పాల్పడిన దోషులను రక్షించాలని తాము చెప్పడం లేదన్నారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన 10 ట్యాంకర్లలో 14 రకాల పరీక్షలు చేయగా 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని గుర్తించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారన్నారు. కల్తీ జరిగిందని గుర్తించిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపించినట్లు ఆయనే చెప్పారన్నారు.

సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు

తిరుమల లడ్డూ ఇష్యూ తాజాగా దేశ అత్యున్నత న్యాయ‌స్థానానికి చేరింది. ఆల‌యాల నిర్వహ‌ణ‌, స్వతంత్ర విచార‌ణ‌కు రిటైర్డ్ జ‌డ్జిని నియ‌మించాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టులో మూడు పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఐకానిక్ ఆల‌యంలో ప్రసాదంగా అందించే ల‌డ్డూల‌ను త‌యారు చేసేందుకు.. నెయ్యికి బ‌దులుగా జంతువుల కొవ్వును ఉప‌యోగించార‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి.

సుద‌ర్శన్ న్యూస్ టీవీ ఎడిట‌ర్ సురేష్ ఖండేరావ్ చ‌వాంకే త‌ర‌పు న్యాయ‌వాదులు స‌త్యం సింగ్ రాజ్‌పుత్‌, రాజీవ్ రంజ‌న్‌, ఏఓఆర్ నిఖిల్ బెనివాల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. చ‌వాంకే దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో సుప్రీం కోర్టు రిటైర్డ్ జ‌డ్జి, రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి నేతృత్వంలోని క‌మిటీతో విచార‌ణ జ‌రిపించాల‌ని విజ్ఞప్తి చేశారు. ప్రసాదంలో మాంసాహార పదార్థాల‌ను ఉప‌యోగించడం రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 25, 26 ప్రకారం భ‌క్తుల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఉల్లంఘించింద‌ని వ్యాఖ్యానించారు. మ‌త‌ప‌ర‌మైన విష‌యాల్లో త‌మ సొంత వ్యవ‌హారాలను నిర్వహించ‌కూడ‌ద‌ని స్పష్టంచేశారు.

హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాద‌వ్ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజ‌న వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమ‌ణ్యస్వామి సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా ల‌డ్డూ వ్యవ‌హారంలో జోక్యం చేసుకోవాల‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్రచూడ్‌కు.. న్యాయ‌వాది స‌త్యసింగ్ లేఖ రాశారు.

సంబంధిత కథనం