Tirumala Ghat Road Accident : తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం, టెంపో బోల్తా పడి 13 మందికి గాయాలు-tirumala ghat road accident tempo overturned karnataka devotees injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Ghat Road Accident : తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం, టెంపో బోల్తా పడి 13 మందికి గాయాలు

Tirumala Ghat Road Accident : తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం, టెంపో బోల్తా పడి 13 మందికి గాయాలు

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2023 05:50 PM IST

Tirumala Ghat Road Accident : తిరుమల ఘాట్ రోడ్డులో టెంపో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 13 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి బర్డ్ ఆసుపత్రికి తరలించారు.

తిరుమల ఘాట్ రోడ్డులో టెంపో బోల్తా
తిరుమల ఘాట్ రోడ్డులో టెంపో బోల్తా

Tirumala Ghat Road Accident : తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న టెంపో వాహనం మొదటి ఘట్‌ రోడ్డు నుంచి కిందకు దిగుతుండగా ఆరో మలుపు వద్ద వాహనం బోల్తా పడింది. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆరో మలుపు వద్ద టెంపో రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొంది. ఈ ఘటనలో 13 మంది భక్తులు గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న ఘాట్‌ రోడ్డు భద్రతా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని అంబులెన్స్‌లో రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెంపో ప్రమాదంపై ఆరా తీసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి... గాయపడిన భక్తులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. జేఈవో వీరబ్రహ్మం బాధితులను రుయా నుంచి బర్డ్ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఘాట్ రోడ్డులో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ వరుస ప్రమాదాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవో ధర్మారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.

ఎలక్ట్రిక్ బస్సు బోల్తా

తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవల బస్సు ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్ ను ఢీకొట్టి బస్సు పక్కకు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని అదే మార్గంలో వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది బస్సు ప్రమాదాన్ని గమనించి వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను ధ్వంసం చేసి బస్సులోని భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, సహా ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వైవీ సుబ్బారెడ్డి.

మరో ప్రమాదం

ఇటీవల తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు 24వ మలుపు వద్ద తుఫాన్ వాహనం అదుపు తప్పి రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలోని మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన భక్తులు తెలంగాణకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Whats_app_banner