Attack On Tahasildar: తహసీల్దార్‌ను చెంపపై కొట్టిన వైసీపీ నాయకుడు
Attack On Tahasildar: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేనని చెప్పడంతో ఆగ్రహించిన వైసీపీ నాయకుడు, ఎమ్మార్వో కార్యాలయంలోనే తహసీల్దార్ చెంప పగులగొట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
Attack On Tahasildar: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలి భర్త దుంపా చెంచిరెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం కలకలం రేపింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ మండలాధ్యక్షుడు, స్థానిక జడ్పీటీసీ సభ్యురాలి భర్త దుంపా చెంచిరెడ్డి మంగళవారం దాడికి పాల్పడ్డారు.
లక్ష్మీనారాయణరెడ్డి కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై సంతనూతలపాడు తహసీల్దార్‌గా వచ్చారు. విధుల్లో చేరినప్పటి నుంచి కార్యాలయంలో వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నెల రోజుల క్రితం వైసీపీ నాయకుడు చెంచిరెడ్డి ఆయన పై దౌర్జన్యానికి పాల్పడటంతో ఆయన రెండు వారాలపాటు సెలవుపై వెళ్లి.. వారం క్రితమే మళ్లీ విధుల్లో చేరారు.
వివిధ పనుల కోసం ఒత్తిళ్లు పెరగడంతో ఆగస్టు 18న వ్యక్తిగత కారణాల పేరిట తహసీల్దారు సెలవుపై వెళ్లారు. సెప్టెంబర్ 11న తిరిగి విధుల్లో చేరారు. ఆ సమయంలోనే ఇరువురి మధ్యా వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన చెంచిరెడ్డి..తమ పనులు ఎందుకు చేయడం లేదంటూ తహసీల్దారుతో వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని తహసీల్దారు చెప్పడంతో చెంచిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. తహసీల్దారు గొంతు పట్టుకుని, చెంపపై కొట్టారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఎమ్మార్వో కార్యాలయంలో అనధికారిక పెత్తనం…
సంతనూతలపాడు కార్యాలయంలోని ఉద్యోగులంతా చెంచిరెడ్డి చెప్పిందే వేద వాక్కుగా పనిచేస్తుంటే.. తహసీల్దార్ మాత్రం రూల్స్ ప్రకారమే పనిచేస్తానని చెబుతూ వస్తున్నా రు. కార్యాలయంలో జరిగే ప్రతి విషయాన్ని ఒక ఆర్‌ఐ చెంచిరెడ్డికి చెరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆర్‌ఐకి కొంతకాలం నుంచి వివిధ కారణాలతో జీతం రావడం లేదు. సంబంధిత ఫైల్‌పై వెంటనే సంతకం పెట్టాలని తహసీల్దార్‌పై చెంచిరెడ్డి ఒత్తిడి చేస్తున్నారు. అన్ని అంశాలూ పరిశీలించాకే సంతకం చేస్తానని తహసీల్దార్ తేల్చిచెప్పారు. ఆ విషయంతో పాటు ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడేందుకు చెంచిరెడ్డి మంగళవారం మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చారు.
అక్కడ పనిచేసే సిబ్బంది మొత్తాన్నీ బయటకు వెళ్లాలని చెప్పి తహసీల్దార్ గదికి వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు. తాను చెప్పినట్లు చేయాల్సిందేనని, లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని, మళ్లీ రానక్కర్లేదని బెదిరించారు. తహసీల్దార్ కూడా అదేస్థాయిలో బదులిచ్చినట్లు తెలిసింది. పేర్నమిట్ల సమీపంలో కొండ, వాగు పొరంబోకు భూమి పది ఎకరాలు ఉందని, దాన్ని వెంటనే ఆన్‌లైన్ చేయాలని వైసీపీ నాయకుడు చెంచిరెడ్డి తహసీల్దార్‌పై దౌర్జన్యం చేసినట్లు తెలిసింది.
చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్ చేయలేనని, రూల్స్ ప్రకారం ఉంటే చేస్తానని తహసీల్దార్ చెప్పడంతో కోపోద్రిక్తుడైన చెంచిరెడ్డి తాను చెప్పినట్టు చేయాల్సిందేనని మీదకు వెళ్లినట్లు తెలిసింది. అధికారి గొంతు పట్టుకుని చెంపపై కొట్టినట్టు చెబుతున్నారు. దీంతో బయటకు వచ్చేసిన తహసీల్దార్ ఒంగోలు వెళ్లి ఆర్డీవోను కలిసి జరిగిన విషయం చెప్పారు. ఆ తర్వాత జేసీ కె.శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేశారు.
తహసీల్దార్‌పై దాడి విషయం జిల్లావ్యాప్తంగా తెలియడంతో తహసీల్దార్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. మంగళవారం రాత్రి కలెక్టర్ దినేశ్ కుమార్‌ను కలిసి తహసీల్దార్ దాడి విషయం వివరించారు. దాడికి దిగిన వైసీపీ నేత సాయంత్రానికి కలెక్టరేట్‌కు చేరి రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు సంతనూతలపాడు పోలీసు స్టేషన్‌లో వైసీపీ నేత దుంపా చెంచిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. తహసీల్దార్ తన ఫిర్యాదులో చెంచిరెడ్డి తన రూంలోకి దౌర్జన్యంగా రావడంతో పాటు గొంతు పట్టుకుని దాడి చేశారని, ఇకపై కార్యాలయానికి రావొద్దంటూ బెదిరించారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో రాజీ కుదిర్చేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.