Ysrcp Sitting Mla: నా మద్దతు కావాలంటే కప్పం కట్టాల్సిందే.. ఇంచార్జికి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే
Ysrcp Sitting Mla: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీలో భారీ ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చీటీ చినిగిపోయిన ఓ ఎమ్మెల్యే.. కొత్త అభ్యర్థికి తన మద్దతు కావాలంటే భారీగా కప్పం కట్టాలని డిమాండ్ చేస్తున్నాడట.
saYsrcp Sitting Mla: అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే ఏపీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల టిక్కెట్లు గల్లంతయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 58మంది ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగింది. కొందరిని ఇతర నియోజక వర్గాలకు మారిస్తే మరికొందరిని ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా మారుస్తున్నారు. మరోవైపు 20మందికి పైగా అసలు ఎక్కడ పోటీ చేసే అవకాశం కూడా లేదని తేల్చేస్తున్నారు. ఇలా సీట్లు రాని వారంతా వైసీపీ అధ్యక్షుడు తీరు మీద రగిలి పోతున్నారు.
టిక్కెట్లు రాని వారిని పార్టీ కన్వీనర్లు, ప్రాంతీయ సమన్వయకర్తలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల ఇవి బెడిసి కొడుతున్నాయి. తమను నట్టేటా ముంచారని మండిపడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు దీపం ఉండగానే చక్కదిద్దు కోవాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో రకరకాల కారణాలతో సీట్లు కేటాయించని ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. మరికొందరికి ఎమ్మెల్సీ పదవులు కూడా ఆఫర్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం ఓ ముదురు ఎమ్మెల్యే అతిగా ఆలోచించినట్టు చెబుతున్నారు.
వైసీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే తన నియోజక వర్గంలో అనతి కాలంలోనే బాగా పాపులర్ అయ్యారు. ఆయన చేసిన మంచి పనులు, ఘనకార్యాల జాబితా ఎప్పుడో ముఖ్యమంత్రికి చేరడంతో ఎన్నికల్లో పోటీ చేసినా గెలవడని డిసైడ్ అయిపోయారు. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గెలిచి రికార్డు సృష్టించడంతో ఈసారి టిక్కెట్ ఇచ్చినా వేస్ట్ అని ఆ పార్టీ పెద్దలు భావించారు.
సామాజిక లెక్కల్లో సదరు ఎమ్మెల్యే హర్ట్ అయితే ఇబ్బందికరమని భావించి నొచ్చుకోకుండా నచ్చ చెప్పే ప్రయత్నాలు చివరి వరకు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సజ్జల, ఇతర ముఖ్యనేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నియోజక వర్గంలో మరొకరిని అభ్యర్ధిగా ఎంపిక చేయడంతో మనస్తాపానికి గురైన సదరు నాయకుడు సహాయ నిరాకరణ చేయడంతో ఏమి చేయాలో పాలుపోని కొత్త అభ్యర్థి పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయినట్లు తెలుస్తోంది.
చివరకు ఎమ్మెల్యేతో సయోధ్య కుదుర్చుకునేందుకు చేసిన ప్రయత్నాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే డిమాండ్ విని సమన్వయకర్తకు సొమ్మసిల్లి పోయినట్టు అనుచరులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో తన మద్దతు కావాలంటే తనకు కప్పం కట్టాలని అప్పుడే పార్టీ తరపున పోటీ చేస్తానని తేల్చి చెప్పేయడంతో ఏమి చేయాలో తెలీక తల పట్టుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటే కనీసం రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కూడా ఏమి తక్కువ తినలేదు కాబట్టి ఆ మాత్రం కప్పం తనకు కట్టాలని ఎమ్మెల్యే వాదిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైతే తనకు నామినేటెడ్ పదవి, ఎమ్మెల్సీ వంటివి కూడా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే తన లెక్క సెటిల్ చేయాలని డిమాండ్ చేయడంతో పోటీ చేసే అభ్యర్థి కళ్లు తేలేసినట్టు చెబుతున్నారు.