Ayyappa devotees : అయ్యప్ప భక్తులకు విమానయాన శాఖ శుభవార్త.. ఇకనుంచి ఆ ఇబ్బంది ఉండదు
Ayyappa devotees : విమానయాన శాఖ అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇరుముడి విషయంలో ఏ ఇబ్బంది లేకుండా విమానాల్లో ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. జనవరి 20 వరకు నిబంధనలను సడలించింది. భద్రతా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఇటు కడప నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ఇరుముడితో విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం.. పౌర విమానయాన శాఖ నిబంధనలు సడలించడం జరిగింది. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్‌లోనే ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటినుంచి జనవరి 20 (మకర జ్యోతి) దర్శనం వరకు ఈ సదుపాయాన్ని కల్పించింది.
ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది శబరిమల వెళ్తారని, సెక్యూరిటీ క్లియరెన్స్ వల్ల ఇరుముడిని విమాన క్యాబిన్‌లో అనుమతించేవారు కాదని వివరించారు. తన దృష్టికి కొంత మంది భక్తులు ఈ విషయాన్ని తీసుకొచ్చారని.. తమ మంత్రిత్వ శాఖలో చర్చించి నిబంధనలను సడలించామని చెప్పారు. ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకొని.. భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు.
అయ్యప్ప భక్తులకు ఇరుముడి అత్యంత పవిత్రమైనది. భక్తులు అయ్యప్ప మాల వేసిన ప్రాంతం నుంచి ఇరుముడిని కిందకు దించకుండా శబరిమల తీసుకెళ్తారు. రైళ్లో, బస్సుల్లో ప్రయాణించేవారికి ఇబ్బంది వచ్చేది కాదు. ఇరుముడిని ఎక్కడా కిందకు దించరు. కానీ.. విమానాల్లో ప్రయాణించే భక్తులు మాత్రం సెక్యూరిటీ క్లియరెన్స్ వద్ద కిందకు దించాల్సి వచ్చేంది. విమాన క్యాబిన్‌లోకి అనుమతించేవారు కాదు. దీంతో అయ్యప్ప భక్తులు ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలో.. తాజాగా నిబందనలు సడలించారు. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కడప టు హైదరాబాద్..
కడప- హైదరాబాద్, హైదరాబాద్- కడప రోజువారీ విమాన సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ విమానం.. హైదరాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు కడప చేసుకుంటుంది. తిరిగి అక్కడ నుంచి 3.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
గతంలో కడప- హైదరాబాద్, హైదరాబాద్- కడప మధ్య మూడు రోజులకు ఒకసారి మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండేవి. ఆ తరువాత కాలంలో అది కూడా నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించారు. రోజువారీ విమాన సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చారు. కడప విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ విమాన సర్వీసు ప్రారంభోత్సం జరుగుతుంది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)