AP Government : ఆ ముగ్గురిపై మూడేళ్ల కిందట చర్యలు - ఎన్నికల ప్రకటన వేళ 'సస్పెన్షన్' ఎత్తివేత!-the ap government has lifted the suspension of three finance department employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Government : ఆ ముగ్గురిపై మూడేళ్ల కిందట చర్యలు - ఎన్నికల ప్రకటన వేళ 'సస్పెన్షన్' ఎత్తివేత!

AP Government : ఆ ముగ్గురిపై మూడేళ్ల కిందట చర్యలు - ఎన్నికల ప్రకటన వేళ 'సస్పెన్షన్' ఎత్తివేత!

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 17, 2024 09:42 AM IST

AP Govt Employees Suspension Lifted : ఎన్నికల కోడ్ వచ్చిన రోజే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల కిందట ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ విధించింది. ఇన్ని రోజులపాటు సస్పెన్షన్ అలాగే ఉండగా… ఎన్నికల ప్రకటన వచ్చిన రోజే సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఆదేశాలను ఇచ్చింది.

సస్పెన్షన్ ఎత్తివేత
సస్పెన్షన్ ఎత్తివేత

AP Government News : ఆర్థికశాఖలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. 2021లో వారిపై సస్పెన్షన్ విధించింది. రాష్ట్ర ఖజానాకు సంబంధించిన కీలక లెక్కల వివరాలు బయటికి వెళ్లటం వంటి పలు కారణాల కోణంలో వీరిపై జగన్ సర్కార్ వేటు వేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. 2021లో సస్పెన్షన్ విధించగా… అప్పట్నుంచి వారిని విధుల్లోకి తీసుకోలేదు. వీరి సస్పెన్షన్ వ్యవహారాన్ని నాన్చుతూ వచ్చింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) ప్రకటన వచ్చిన రోజే… వీరి దస్త్రాన్ని కదిలించింది. వారిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ(Suspension Lifted) నిర్ణయం తీసుకుంది. విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

2021లో చర్యలు….

రాష్ట్ర ఆర్థిక శాఖలో వెంకటేశ్వర్లు నాగులపాటి(ఫైనాన్స్ సెక్షన్ సహాయ కార్యదర్శి), కసిరెడ్డి వరప్రసాద్(సెక్షన్ ఆఫీసర్), మరో విభాగంలో సెక్షన్ ఆఫీర్గా శ్రీనివాసులు పని చేస్తున్నారు. వీరిపై ఏపీ ప్రభుత్వం...2021 ఆగస్టు మాసంలో చర్యలు తీసుకుంది. సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక సమచారం బయటికి వెళ్తోందని, సంబంధిత శాఖలో పనిచేసేవారు మీడియాకు సమాచారం లీకు చేస్తున్నారనే అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు చర్చ జరిగింది.ఆ సమయంలో ఈ ముగురిపైనే కాకుండా.... కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న మరో ఐదుగురిని కూడా తొలగించింది. వీరిపై వేటుకు గల కారణాలను ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. సస్పెన్షన్ కు గురైన ముగ్గురు అధికారులు అనుమతి లేకుండా అమరావతి దాటి వెళ్లకూడదని కూడా ఆదేశాల్లో పేర్కొంది సర్కార్. ఆర్థి వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారం బయటికి వెళ్లటాన్ని ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. విజిలెన్స్ తో అంతర్గత విచారణకు కూడా ఆదేశించింది. ఈ విచారణలో ముగ్గురి అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. ఈ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఎన్నికల ప్రకటన వేళ ఉత్తర్వులు…

మూడేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్న ముగ్గురి అధికారుల అంశంపై సర్కార్ దృష్టిసారించలేదు. సగటు కాల పరిమితి తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయటం వంటి అంశాలను కూడా పరిశీలించలేదు. ముగ్గురిలో ఒకరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం.... ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ వీరి సస్పెన్షన్ వ్యవహారం తేలలేదు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మార్చి 16వ తేదీన ఈ ముగ్గురి అధికారుల సస్పెన్షన్ ను ఎత్తివేసింది ఏపీ ఆర్థిక శాఖ. తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. మూడేళ్లుగా సస్పెన్షన్ వ్యవహారంపై దృష్టి పెట్టని ఆర్థికశాఖ.... ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు ఉత్తర్వులు ఇవ్వటం గమనార్హం..!

Whats_app_banner