Chandra Babu In Gannavaram : లగ్నం పెట్టి, పోలీసుల్లేకుండా గన్నవరం రావాలని వైసీపీకి చంద్రబాబు సవాల్-tdp president chandra babu naidu visits party office in gannavaram and challenges opponents to fix time to fight ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp President Chandra Babu Naidu Visits Party Office In Gannavaram And Challenges Opponents To Fix Time To Fight

Chandra Babu In Gannavaram : లగ్నం పెట్టి, పోలీసుల్లేకుండా గన్నవరం రావాలని వైసీపీకి చంద్రబాబు సవాల్

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 11:48 AM IST

ChandraBabu Challenge ప్రశాంతమైన కృష్ణాజిల్లాలో వైసీపీనాయకులు అరాచకాలు చేస్తున్నారని, గన్నవరంలో రౌడీలు, సైకోలు స్వైర విహారం చేశారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలామంది రౌడీలను చూశానని, ఎలాంటి రౌడీలైనా కాల గర్భంలో కలిసిపోక తప్పదన్నారు.

గన్నవరంలో కాలిపోయిన కారును పరిశీలిస్తున్న చంద్రబాబు
గన్నవరంలో కాలిపోయిన కారును పరిశీలిస్తున్న చంద్రబాబు

ChandraBabu Challenge పోలీసుల అండతో దాడులు చేయడం కాదని, ప్రత్యర్థులకు దమ్ముంటే లగ్నం పెట్టి ఎన్ని వేల మందితో వస్తారో రావాలని, తేల్చుకోడానికి తాము సిద్ధమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సవాలు చేశారు. దమ్ముంటే సైకో కూడా రావాలని, పోలీసుల్ని పక్కన పెట్టి ముందుకు వస్తే అక్కడే తేల్చుకుందామన్నారు. గన్నవరంలో పోలీసులు దొంగల్లా వ్యవహరిస్తున్నారని, అడ్వకేట్‌ ఆన్‌ డ్యూటీలో వస్తే కేసులు పెట్టడానికి వీల్లేదని గుజరాత్‌ కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. లాయర్ల మీద కేసులు పెట్టారని, గన్నవరంలో ఎయిర్‌పోర్ట్ పక్కన, జాతీయ రహదారిపై రౌడీలు స్వైర విహారం చేస్తుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు

ChandraBabu Challenge వైసీపీ దాడిలో ధ్వంసమైన గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అంతకు ముందు రిమాండ్ లో ఉన్న టీడీపీ నాయకుడు దొంతు చిన్నా కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శించారు. చిన్నా కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మరోవైపు చంద్రబాబు గన్నవరం పర్యటన దృష్ట్యా భారీగా పోలీసుల మోహరించారు. గన్నవరంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

పోలీసులకు చంద్రబాబు వార్నింగ్….

అధికార పార్టీ ఆదేశాలను అమలు చేస్తూ పోలీసులు పిచ్చి చేష్టలు చేస్తున్నారని, కొందరు వింత చేష్టలు చేస్తున్నారని, పనికిమాలిన వేషాలు వేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల్ని రెచ్చగొట్టి ఎవరు తప్పుడు పనులు చేయించినా, చివరకు శిక్షలు పడేది పోలీసులకేనన్నారు. తమది బెదిరిస్తే పారిపోయే పార్టీ కాదని, కార్యకర్తల కోసం చివరి వరకు పోరాడతామని చెప్పారు.

ముఖ్యమంత్రి కార్యలయానికి కూతవేటు దూరంలో వైసీపీ కార్యకర్తలు విధ్వంసం చేశారని, పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన దొంతు చిన్నా ఇంటిపై రౌడీలు దాడి చేయడానికి గన్నవరం పాకిస్తాన్‌లో ఉందా అని ప్రశ్నించారు. దాడి జరిగిన రోజే తాను బాధితుల్ని చూడటానికి వెళుతుంటే వెయ్యి మందితో పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే అసలు దాడులే జరిగేవి కాదన్నారు.

గన్నవరంలో మాట్లాడుతున్న చంద్రబాబు
గన్నవరంలో మాట్లాడుతున్న చంద్రబాబు

ChandraBabu Challenge గన్నవరం సిఐ బీసీ వర్గానికి చెందినవాడైతే అట్రాసిటీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రాగానే ఈ ఘటనలపై ఎంక్వైరీ వేసి మక్కెలిరగ తంతానని వార్నింగ్ ఇచ్చారు. 14ఏళ్లు సిఎంగా పనిచేసిన తాను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా ఎప్పుడు అడ్డుకోలేదన్నారు.

పార్టీ కార్యాలయంపై దాడులపై కేసులు పెట్టినా ఇప్పటి వరకు దర్యాప్తు ప్రారంభించలేదని చంద్రబాబు ఆరోపించారు. బాధితులు టీడీపీ వాళ్లైతే వాళ్ల మీదే కేసులు పెట్టారని, పోలీసుల తీరు చూసి అంతా సిగ్గుతో తలదించు కుంటున్నారన్నారు. పోలీసులు చేసిన సిగ్గుమాలిన పనిని వారి ఇళ్లలో కుటుంబ సభ్యులు సమర్థిస్తే తాను కూడా సమర్థిస్తానని చెప్పారు. రాష్ట్రంలో సైకో పాలనపోయే వరకు పోరాడుతూనే ఉంటానన్నారు.

ఈ రోజు టీడీపీ కార్యాలయం మీదే దాడి అని వదిలేస్తే రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పోతుందని హెచ్చరించారు. ప్రభుత్వం మీద పోరాడటానికి ప్రజలే ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలో ఉన్న సైకో పాలనను తరిమి కట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన గన్నవరం కూడా పులివెందుల అవుతుందని, బాబాయిని చంపినట్టే అందరిని చంపేస్తారని హెచ్చరించారు.

గెలిపించుకున్న వారినే కొట్టించిన ఎమ్మెల్యేను అంతా గుర్తు పెట్టుకోవాలని, వడ్డీతో సహా తిరిగి చెల్లిద్దామన్నారు. మళ్లీ మంచిరోజులు వస్తాయని కార్యకర్తలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. గన్నవరంలో టీడీపీ శ్రేణుల్ని కాపాడుకుంటానని చెప్పారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. విమర్శలకు సమాధానాలు చెప్పాలని, చేతకాని వాళ్లే ఇలా దౌర్జన్యాలు చేస్తారని, పోలీసుల్ని అడ్డు పెట్టుకుని దాడులు చేస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీ ముందుండి పోరాటం చేస్తుందని, రాష్ట్రాన్ని కాపాడుకోడానికి అంతా కలిసి రావాలన్నారు.

గన్నవరంలో జరిగిన దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని, టెర్రరిస్ట్‌లు కూడా అలా చేయరని, గన్నవరం ప్రజలందరిని భయభ్రాంతులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఉన్న కోనేరు సందీప్‌ వాహనాన్ని ఐదు లీటర్లు పెట్రోల్ పోసి దగ్ధం చేశారని చెప్పారు. దాడులుప్రణాళిక ప్రకారం చేశారని, ఐదు కార్లు, స్కూటర్లు పాడుచేశారని, కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, ఫర్నీచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారని చంద్రబాబు చెప్పారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్