Gannavarm Politics : వైసీపీకి తప్పని తలనొప్పులు… గన్నవరం గరంగరం…-gannavarm politics ysrcp leaders dutta and yarlagadda videos became viral inkrishna district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gannavarm Politics : వైసీపీకి తప్పని తలనొప్పులు… గన్నవరం గరంగరం…

Gannavarm Politics : వైసీపీకి తప్పని తలనొప్పులు… గన్నవరం గరంగరం…

HT Telugu Desk HT Telugu
Feb 02, 2023 09:52 AM IST

Gannavarm Politics కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు జట్టు కట్టడం కలకలం రేపుతోంది. 2019లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి దగ్గరయ్యారు. అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోకపోయినా ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనున్నారు. ఈ పరిణామాలు ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని అసంతృప్తికి గురి చేస్తున్నాయి.

కృష్ణాజిల్లాలో వైరల్‌గా మారిన వీడియో క్లిప్
కృష్ణాజిల్లాలో వైరల్‌గా మారిన వీడియో క్లిప్

Gannavarm Politics గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు మాట్లాడిన వీడియోలు వైరల్‌గా మారాయి.గన్నవరంలో వైసీపీ తరపున 2014లో దుట్టా, 2019లో యార్లగడ్డ పోటీ చేశారు. ఇద్దరిపై వల్లభనేని వంశీ గెలిచారు. టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించిన వల్లభనేని వంశీ పార్టీ అధికారంలోకి రాగానే జగన్‌కు దగ్గరైపోయారు. వైసీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చొరవతో వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పేసి వైసీపీకి దగ్గరయ్యారు. ఓ దశలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడానికి కూడా వంశీ వెనుకాడలేదు. ఇది సొంత సామాజిక వర్గంలో వంశీపై పెద్ద ఎత్తున వ్యతిరేకతకు దారి తీయడంతో చివరకు క్షమాపణ చెప్పారు.

మరోవైపు వల్లభనేని వంశీ రాకను మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు ఒక్కటై తిరుగుతున్నారు. 2019లో దుట్టా స్థానంలో యార్లగడ్డకు జగన్ పార్టీ టిక్కెట్ కేటాయించడంతో ఆయన సరిగా సహకరించలేదు. దీంతో వల్లభనేని వంశీ 838 ఓట్ల తేడాతో గెలిచారు. ఎన్నికలకు ముందు ఇద్దరు కలిసి పనిచేసి ఉంటే వంశీ గెలుపుకు అడ్డుకట్ట వేయగలిగే వారు. మరోవైపు రెండు సార్లు గన్నవరం లో ఓటమి పాలైన ఇద్దరు నాయకుల్ని చెక్ పెట్టడానికి వల్లభనేని వంశీ పావులు కదపడంతో విధిలేక ఇద్దరు కలవాల్సి వచ్చింది.

వంశీ వ్యవహార శైలిపై ఇద్దరు నాయకులు విడివిడిగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన గన్నవరం వైసిపి నాయకులు దుట్టా రామచంద్రరావు , యార్లగడ్డ వెంకట్రావు సంభాషణల్లో ఎమ్మెల్యేలను దూషించడంతో కల‌క‌లం రేగింది. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా వాటిని రహస్యంగా రికార్డ్ చేసి లీక్ చేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఒకరినొకరు తీవ్రంగా వ్యతిరేకించుకున్న యార్ల‌గ‌డ్డ‌, దుట్టాలు ఒక్కటై కనిపిస్తున్నారు. వంశీపై చాలా రోజులుగా విమర్శలు గుప్పిస్తున్నా అవి వెలుగులోకి రాలేదు. వల్లభనేని వంశీ, కొడాలి నానికి ఆస్తులు ఎలా వచ్చాయ‌ని యార్లగడ్డ ప్ర‌శ్నించారు. ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారని, నిల‌దీశారు. ఎప్పుడూ సినిమాల గురించి కొడాలి నాని చెబుతాడ‌ని, ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంద‌ని, చివ‌ర్లో విల‌న్ కి చెంప దెబ్బ‌లు త‌ప్ప‌వ‌ని వ్యాఖ్యానించారు.

కొడాలినాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు వారి నియోజకవర్గానికి ఏమైనా ఉపయోగపడ్డారా అని యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు ప్ర‌శ్నించారు. వల్లభనేని వంశీ ఆగడాలను ప్ర‌శ్నించబట్టే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చింద‌ని, ఎమ్మెల్యేలకి వ‌చ్చిన క్రేజ్ వ‌చ్చింద‌ని దుట్టా వ్యాఖ్యానించారు. మీడియాను మేనేజ్ చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించడానికి యార్లగడ్డ నిరాకరించారు. దుట్టా రామచంద్రరావు మాత్రం వ్యక్తిగత సంభాషణల్లో మాట్లాడుకున్న విషయాలని చెప్పారు. ఓ వైపు వైసీపీ అధిష్టానం వల్లభనేని వంశీకి గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో అతనికి వ్యతిరేకంగా ఇద్దరు సొంత పార్టీ నేతలు జట్టు కట్టడంపై పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Whats_app_banner