Singer Mangli: సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం.. న్యూ ఢిల్లీలో అవార్డ్ అందుకున్న గాయనీ
Singer Mangli Got Ustad Bismillah Khan Award: టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం లభించింది. తన గొంతుతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సింగర్ మంగ్లీకి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్ వరించింది. న్యూ ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని మంగ్లీ అందుకున్నారు.
Singer Mangli Got Ustad Bismillah Khan Award: తెలుగు వారికి మంగ్లీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సింగర్‌గా బాగా పాపులర్ అయింది. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. ముందుగా ప్రైవేట్ సాంగ్స్‌తో తన కెరీర్ మొదలుపెట్టిన సింగర్ మంగ్లీ టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంది.
ఫోక్, డివోషనల్, ఐటమ్ సాంగ్స్
ప్రత్యేకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాముల పాటకు బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్, ఐటమ్ సాంగ్స్‌కి ఆమె పెట్టింది పేరుగా మారింది.
వాడు నడిపే బండి
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్‌లో తన మార్క్ చూపిస్తుంది మంగ్లీ. సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్‌తో స్టార్ సింగర్ అయింది. ఇక మంగ్లీకి సొంతగా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రకరకాల పాటలను పాడుతూ క్రేజ్ సొంతం చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా మంగ్లీ టాలీవుడ్‌లో సత్తా చాటుతుంది. జార్జి రెడ్డి మూవీలోని వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది.
పాటలకు మంచి రెస్పాన్స్
ఆ తర్వాతే అల వైకుంఠపురంలో రాములో రాములా పాట పాడే ఛాన్స్ వచ్చింది. అనంతరం లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియాతో పాటు సింగర్ మంగ్లీ పాడిన అనేక పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమెతో పాడించిన పాటలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి. దాంతో సినీ దర్శకులు ఆమెతో పాట పాడించాలని ఫిక్స్ అవుతున్నారు.
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్
సంగీత ప్రపంచంలో సింగర్ మంగ్లీ అందుకున్న విజయాలకు గానూ ఇటీవలే సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఎంపికైంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అతిరథ మహారధుల సమక్షంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్‌ను సింగర్ మంగ్లీ అందుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న సత్యవతి చౌహాన్ అలియాస్ మంగ్లీ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది.
కర్ణాటక సంగీతం నేర్చుకుని
ఇదిలా ఉంటే, మంగ్లీగా పేరు తెచ్చుకున్న సత్యవతి చౌహాన్ ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె తండాకు చెందింది. పేద బంజారా కుటుంబంలో జన్మించిన మంగ్లీ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సంస్థ ద్వారా చదువుకుని, పాటలు పాడటం నేర్చుకుంది. ఆ సంస్థ ఆర్థిక సాయంతోనే తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది సింగర్ మంగ్లీ.
తీన్మార్ వార్తలతో
అనంతరం ఎస్వీ విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్స్ చేసింది. కట్ చేస్తే తీన్మార్ వార్తల్లో మంగ్లీగా తనదైన తీరులో ఆకట్టుకుంది. అనంతరం తెలంగాణలో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సింగర్ మంగ్లీ జానపద గేయాలతో చాలా పాపులర్ అయింది.