Krishna SP On Pattabhi : పట్టాభి వల్లే గన్నవరంలో గొడవలన్న కృష్ణాజిల్లా ఎస్పీ
Krishna SP టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వల్లే గన్నవరంలో ఘర్షణలు, దాడులు జరిగాయని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ప్రకటించారు. పోలీసులు పట్టాభిని కొట్టారని అవాస్తవాలు ప్రచారం చేశారని, గన్నవరంలో గొడవలు జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రత్యర్థుల నుంచి కాపాడారని తెలిపారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Krishna SP On Pattabhi టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యల వల్ల గన్నవరం ఉద్రిక్తతలు తలెత్తాయని కృష్ణా జిల్లా ఎస్పీ స్ఫష్టం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని ఎస్పీ తెలిపారు. గొడవలు జరుగుతుండగా ఘటనాస్థలానికి వచ్చిన టీడీపీ నాయకుల్ని పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారని, రెండు వర్గాలను అదుపు చేయడానికి ప్రయత్నించారని చెప్పారు.
ఆ సమయంలో ప్రత్యర్థుల నుంచి పట్టాభిని పోలీసులు కాపాడారని తెలిపారు. పోలీసులు అదుపులో ఉన్న సమయంలో పట్టాభిని పోలీసులు కొట్టారు అనే ఆరోపణ అవాస్తవమన్నారు. తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నింద వేయడం తగదన్నారు. పట్టాభి అవాస్తవాలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించాలని చూశారన్నారు.
విజయవాడలో రెండుమార్లు డాక్టర్ల బృందం పరీక్షించినా ఎటువంటి గాయం లేకపోవడంతో పట్టాభి వ్యూహం విఫలమైందని చెప్పారు. గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకరావు గాయపడిన సంఘటనపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. దీనికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఇన్‌స్పెక్టర్ కనకరావు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా కొందరు నాయకులు ఆయన బిసీ అనే వివాదాన్ని లేపడం అర్ధ రహితమన్నారు. కనకరావు కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని చెప్పారు.
అవాస్తవాలను ప్రచార చేయడం ఆపి, కోర్టు ఆదేశాలను గౌరవించాలన్నారు. కోర్టు ద్వారా పట్టాభితో పాటు ఇతర నిందితులను రిమాండుకు పంపడం, దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందనడానికి నిదర్శనమని చెప్పారు. పోలీస్ శాఖపై లేనిపోని అభాండాలు వేయడం ద్వారా పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తియ్యలేరన్నారు.
ఎలాంటి దురుద్దేశాలు లేకపోతే పట్టాభి మూడు వాహనాల నిండా మనుషులతో గన్నవరం ఎందుకు వచ్చాడని జిల్లా ఎస్పీ ప్రశ్నించారు. వచ్చి రావడంతోనే జనాలను పోగేసి పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగాడని వివరించారు. పట్టాభి ప్రవర్తనలో గొడవలు సృష్టించాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
తెలుగు దేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి విషయంలో ఎవరు ఫిర్యాదు ఇవ్వలేదని అయినా పోలీసులు సుమోటోగా కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితులను వీడియో ఫుటేజీ ద్వారా గుర్తించి, ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన ముద్దాయిలను గుర్తించి, అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి….
మరోవైపు గన్నవరం గొడవల్లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి సెంట్రల్ జైలుకు తరలించారు. గన్నవరంలో శాంతిభద్రతలకు విగాతం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన పట్టాభిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులపై పట్టాభి చేసిన ఆరోపణలను న్యాయస్థానం తోసిపుచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభిని తరలించారు.