Delhi liquor Scam : లిక్కర్‌ స్కాంతో ఏపీకి లింకులున్నాయంటూ టీడీపీ ఆరోపణ….-tdp demands for cbi probe in delhi liquor scam links with ap leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Demands For Cbi Probe In Delhi Liquor Scam Links With Ap Leaders

Delhi liquor Scam : లిక్కర్‌ స్కాంతో ఏపీకి లింకులున్నాయంటూ టీడీపీ ఆరోపణ….

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 07:28 AM IST

దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధాలున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం టెండర్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సిబిఐ దర్యాప్తు నుంచి బయట పడటానికే సిఎం ఢిల్లీ వెళ్లారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఏపీలో సిబిఐ దర్యాప్తుకు టీడీపీ పట్టుబడుతోంది.
ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఏపీలో సిబిఐ దర్యాప్తుకు టీడీపీ పట్టుబడుతోంది. (twitter)

ఢిల్లీ మద్యం సిండికేట్ల వ్యవహారంలో సిబిఐ దర్యాప్తుతో ఏపీకి ఉన్న లింకులు కూడా బయటపడ్డాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఢిల్లీలో liquor Scam దర్యాప్తు ప్రారంభిస్తే దాని మూలాలు తాడేపల్లిలో బయటపడుతున్నాయని చెబుతున్నారు. సిఎం జగన్ కుటుంబ సభ్యులతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఇందులో పాత్ర ఉందని టీడీపి ఆరోపిస్తోంది. తన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోడానికే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ మద్యం సిండికేట్ల వ్యవహారంలో సిబిఐ దర్యాప్తును ఏపీకి కూడా విస్తరించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదాన్ డిస్టిలరీస్, జగతి పబ్లికేషన్స్‌, జగన్మోహన్‌ రెడ్డిల పాత్రపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ దర్యాప్తును ఏపీలో జరిగే కల్తీ మద్యం వ్యాపారంపై కూడా చేయాలంటున్నారు.

విజయసాయిరెడ్డి బంధువే…..

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్‌ చంద్రారెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డికి అల్లుడు అవుతారు. సాయిరెడ్డి కుమార్తె భర్త రోహిత్ రెడ్డికి శరత్‌ చంద్రారెడ్డి అన్నయ్య. ట్రైడెంట్ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అరబిందో గ్రూప్‌కు చెందిన 17కంపెనీలకు రోహిత్ డైరెక్టర్‌గా ఉంటే, 12 కంపెనీలలో శరత్ డైరెక్టర్‌గా ఉన్నారు. తన బంధువులతో విజయసాయిరెడ్డి మద్యం వ్యాపారంచేయిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీలో రెండేళ్ల క్రితం ఏర్పాటైన అదాన్ డిస్టిలరీస్‌ రోహిత్ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని, అదాన్‌ కంపెనీ ద్వారా రెండేళ్లలో రూ.5వేల కోట్ల లావాదేవీలు జరిగితే వాటిలో రూ.2వేల కోట్లను ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌లో ఈఎండీగా చెల్లించారని టీడీపీ ఆరోపిస్తోంది.

జగతిలో పెట్టుబడులు…..

జగన్ ఆస్తుల కేసుల్లో ట్రైడెంట్ సంస్థ కూడా ఉందని, జగతి పబ్లికేషన్స్‌లో ట్రైడెంట్ సంస్థ కోట్ల రుపాయలు పెట్టుబడులు పెట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ట్రైడెంట్‌పై సిబిఐ ఛార్జిషీటు కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. వీటి ఆధారంగా అరబిందో గ్రూపుతో జగన్ సతీమణి భారతీ రెడ్డికి కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు జరిపితే తాను ఇబ్బంది పడతాననే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారని టీడీపీ ఆరోపిస్తోంది. బోలారం శివకుమార్‌, కాశీచయనులశ్రీనివాస్, ముప్పిడి అవినాష్ రెడ్డి అనే పేర్లతో అదాన్ డిస్టిలరీస్ సంస్థను ఎంపీ సాయిరెడ్డి నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురు ఎవరో బయటి ప్రపంచానికి తెలియదని వారిని విచారిస్తే అన్ని బయటకొస్తాయని టీడీపీ ఆరోపిస్తోంది.

దావోస్‌లో ఫోటోలు….

స్వప్రయోజనాలు, ఆర్ధిక లావాదేవీలు ప్రధానంగా సిఎం దావోస్ పర్యటన జరిగిందని టీడీపీ ఆరోపించింది.శరత్‌ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలతో ముఖ్యమంత్రి సన్నిహితంగా మెలిగారని ఆరోపించారు. తమ సొంత వ్యాపారాలను విస్తరించుకోడానికే ముఖ్యమంత్రి దావోస్ పర్యటన జరిపారని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కాదని విమర్శిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్