Opinion: ‘ఎవరనుకున్నారు...ఇట్లయితదని..?’
‘‘లోగడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైనా, ఇప్పుడు కూటమి ప్రభుత్వమైనా, ‘మాకు ఎదురు లేదు’ అనే అహంతో ప్రజాభీష్టానికి భిన్నంగా పరిపాలన సాగిస్తే... ఆ ఎదురేమిటో ప్రజలే చూపిస్తారు..’’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పొలిటికల్ అనలిస్ట్ ఐవీ మురళీ కృష్ణ శర్మ విశ్లేషణ.
దివంగత నేత రాజీవ్ గాంధీ నేతృత్వంలో 1984లో జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 400 సీట్లు వచ్చినప్పుడు... ‘‘నాలుగొందల సీట్లు వచ్చాయని, ఆయన గాలి పీల్చద్దంటే పీల్చకుండా ఉండాలా?’’ అని ప్రజాకవి కాళోజీ అనేక సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రశ్నను సంధించేవారు. ప్రజాకవి కాళోజీ అన్న ఈ మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయి. వ్యవస్థలను నాశనం చేసి, ప్రజల ఆకాంక్షల్ని లెక్కచేయకుండా ఏకపక్ష పాలన చేసినందుకే జగన్ని వద్దనుకుని ప్రజలు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి 164 సీట్లు కట్టబెట్టారు.
రాష్ట్రంలో కూటమికి రికార్డు స్థాయిలో 164 సీట్లు వచ్చినంత మాత్రానా వారు అరాచకం చేయడానికి, దౌర్జన్యం చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యర్థులపై ప్రతీకార దాడులు, కక్షసాధింపు చర్యలు చేపట్టడానికే అధికారాన్ని కట్టబెట్టినట్టా..? వారు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజామోదం ఉన్నట్టా..? కూటమి పరిపాలన ఇదే విధంగా కొనసాగితే మళ్లీ రాష్ట్ర ప్రజలు ‘రావాలి జగన్ కావాలి జగన్’ అనే పరిస్థితి రావడానికి వీరే కారణం అవుతారు.
కూటమి గెలిచిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో ‘నిజం గెలిచింది... ప్రజాస్వామ్యం నిలిచింది’ అని ప్లకార్డులు పట్టుకుని కూటమి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రతి పౌరుడూ నిజం గెలివాలి, ప్రజాస్వామ్యం నిలబడాలనే కోరుకుంటాడనేది వీరికి తెలియకపోదు. దీనిపై ప్రత్యేకించి వీరు ప్రదర్శన చేయాల్సిన అవసరమే లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే.
అయితే ప్రజలకు మేలు చేస్తామని ప్రమాణం చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికార పార్టీకి చెందిన నాయకులు ‘ఇది మా రాజ్యం... మేమేం చేసినా నడుస్తుంది’ అనుకుంటూ అధికారం శాశ్వతమనే దురంహకారంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రతిపక్షాలను చెరబడుతూ ప్రజా సంపద దోపిడీతో, సహజ వనరులను ధ్వంసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో 2019, 2024 ఎన్నికలు నిరూపించాయి. ఈ గుణపాఠాన్ని 2019లో టీడీపీ, 2024లో వైఎస్సార్సీపీ అర్థం చేసుకోలేక తీవ్రంగా నష్టపోయిన పరిణామం మన కళ్లముందే జరిగింది.
పాలన మొదలైందిలా
2019లో ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పరిపాలన మొదలుపెడితే, కూటమి ప్రభుత్వం ‘రెడ్ బుక్’ ఆదర్శంగా పాలనను ప్రారంభించింది. వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేయడం, వైసీపీ కార్యాలయాల్ని కూల్చేయడం. వైసీపీకి అనుకూలంగా పని చేసిన అధికారుల నుంచి బొకేలు తీసుకోకుండా అవమానపర్చడం చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఎల్లో మీడియాను బ్యాన్ చేస్తే, వీళ్లు బ్లూ మీడియాను బ్యాన్ చేశారు.
ఈ ప్రతీకార రాజకీయాల కోసమేనా ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంది? ఎవరి కళ్లలో ఆనందాన్ని చూడడానికి ఈ చర్యలను చేపడుతున్నారు..? ప్రజలు వీటిని కోరుకుంటున్నారా..? లేకపోతే కూటమి ప్రభుత్వం అహంతో వీటిని చేస్తుందా..? ‘నిజం గెలవడం, ప్రజాస్వామ్యం నిలవడం’ అంటే ఇదేనా..? ఈ సంఘటనలు చూస్తున్న ఏపీ ప్రజల మనసులలో వైఎస్సార్సీపీ, కూటమి దొందూ దొందే అనే భావన మొదలైంది.
యువగళం పాదయాత్ర సందర్భంగా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పీపుల్స్ పల్స్ బృందం నారా లోకేశ్‌తో ముచ్చటించినప్పుడు ‘2014 నుంచి 2019 వరకు ‘ఎకో ఛాంబర్’లో ఉన్నాం. అందుకే, ఘోరంగా ఓడిపోయాం’ అని ఒప్పుకున్నారు. ఆ మాటలు విన్న తర్వాత ఆయనలో గణనీయమైన మార్పు వచ్చినట్టుందని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయనే భావించాం. కానీ జూన్ 4న ఫలితాలు వెలువడినప్పటి నుంచి లోకేశ్ మాటతీరును గమనిస్తే మళ్లీ ‘ఎకో ఛాంబర్’లోకి వెళ్లిపోయినట్టు కనపడుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ‘ఎకో ఛాంబర్’లోకి వెళ్లిపోతే రానున్న ఐదేళ్ల కాలంలో పాలన ఎలా ఉంటుందో..?
రెడ్ బుక్ కక్ష్యలు పెంచేందుకేనా?
లోకేశ్ పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సభల్లో తెచ్చిన రెడ్ బుక్ ప్రస్తావన... వాళ్ల పార్టీ కార్యకర్తల్ని, నాయకులను ఉత్సాహపర్చడానికి, ధైర్యం ఇవ్వడానికే అనుకున్నారు రాజకీయాలు తెలిసిన వారు. కానీ, ఇది ప్రతీకార దాడుల కోసం తీసుకొచ్చిన ‘హిడెన్ ఎజెండా’ను అమలుచేస్తున్నట్టు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఘటనలను బట్టి స్పష్టమవుతోంది.
‘రెడ్ బుక్’ అనగానే పార్లమెంట్లో ‘ఇండియా’ కూటమి సభ్యులు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఎరుపు రంగులో ఉన్న ‘రాజ్యాంగం’ పుస్తక ప్రతులను ప్రదర్శించిన విషయం గుర్తుకొస్తుంది. అయితే ఇక్కడ ఇందుకు భిన్నంగా కక్షలకు, ప్రతీకారాలకు గుర్తుగా ‘రెడ్ బుక్’ను వినియోగించడం దురదృష్టకరం.
కొందరికి మతిమరుపు ఎక్కువ. వాళ్లు ఇంగిత జ్ఞానాన్ని ఇంట్లోనే వదిలేసి వస్తారని విజయనగరం సామెత ఒకటుంది. కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారో... ఇప్పుడు మర్చిపోయి అవే కక్షసాధింపు చర్యల్ని రిపీట్ చేస్తున్నారు. 2019లో జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంటే, లోగడ వైఎస్సార్సీపీ వాళ్లు చేసినట్టుగానే టీడీపీ-జనసేన వాళ్లు ఇప్పుడు చేస్తున్నారు. ‘రెడ్ బుక్’ పేరుతో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, అధికారులపై కారాలు-మిరియాలు నూరటం వంటి కక్ష సాధింపు చర్యలకు దిగడానికే అయితే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని, కూటమి అధికారంలోకి రావాలని జనం ఎందుకు కోరుకుంటారు? ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు నర్రా రాఘవరెడ్డి చెప్పినట్టు ‘గొర్రెలు తినేవాడు పోయిండంటే, బర్రెలు తినేవాడు వచ్చిండు’ అని ప్రజలు అనుకోకముందే కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల్ని అదుపులోకి తెచ్చి ప్రజాస్వామ్య పాలనకు శ్రీకారం చుట్టాలి.
చరిత్ర చెబుతున్నదిదే
దాడులు, కక్షసాధింపు చర్యల్ని ప్రజలు క్షమించరని చరిత్ర చెబుతోంది. పాలకుల దాడులను, ప్రతీకార చర్యలను ప్రజలు పంటికింద అణుచుకొని, దురహంకారంతో వ్యవహరించిన వాళ్లకు ఐదేళ్ల తర్వాత ఓటుతో బుద్ధి చెప్తారు. ఇప్పుడు స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడి మీద వైఎస్సార్సీపీ దాదాపు 25 కేసులు పెట్టింది. 70 ఏళ్ల వయసులో ఆయనపై ఒక అత్యాచారం కేసు కూడా మోపింది. మరో టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌పై సుమారు 100 కేసులు పెట్టింది. చంద్రబాబు, లోకేశ్‌తో పాటు అనేకమంది తెలుగుదేశం నాయకులపై, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు జనసైనికులపై కూడా పలు కేసులు పెట్టింది. ఈ కేసులతో వైఎస్సార్సీపీ ఏం సాధించింది? ఎన్నికల్లో ఘోర ఓటమితో పాటు అప్రతిష్టను మూటగట్టుకుంది తప్ప!!
వైఎస్.రాజశేఖరరెడ్డి కేవలం 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు ఎలాంటి పేరున్నా ముఖ్యమంత్రి అయ్యాక చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇదే మాదిరి ఎన్టీ రామారావు కూడా చరిత్రలో నిలిచిపోయారు. చంద్రబాబు నాయుడు పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యారే తప్ప జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన ప్రత్యేక పనులేమీ లేవు. కేవలం హైటెక్ సిటీ నిర్మాణం, ప్రయివేటీకరణకు, సంస్కరణలకు ప్రాధాన్యతిచ్చారు. రాష్ట్రంలో ఏ నాయకుడికీ రాని అవకాశాలు చంద్రబాబుకు వచ్చాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని ప్రతిసారి క్షమించి, మళ్లీ అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అయినా దానిని సద్వినియోగం చేసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఐదు దశాబ్దాల తన రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆదర్శవంతమైన పాలన ఇవ్వడానికి ప్రాధాన్యతివ్వాలే తప్ప కక్షలకు, ప్రతీకారాలకు పాల్పడకూడదు అన్నది సగటు పౌరుడు ఆశించే చిన్న విషయం!
ఉమ్మడి మేనిఫెస్టో అమలు ప్రథమ కర్తవ్యం
ప్రతిపక్షంలో ఉన్న పార్టీల ఆయుష్షు పెరుగుతూ పోతే, అధికారపక్షంలో ఉన్న పార్టీల ఆయుష్షూ తగ్గుతూ వస్తుంది. 5 సంవత్సరాల అధికారం అంటే 1825 రోజులు. ఇప్పటికే 25 రోజులు కరిగిపోయాయి. కాలాన్ని విలువైన సమయంగా భావించి వృథా చేయకుండా పరిపాలనపై దృష్టి పెట్టాలి. ప్రస్తుతం కూటమి ముందున్న ప్రధాన లక్ష్యం ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను (5 పేజీల్లోని అంశాలను) అమలు చేయడంతో పాటు సూపర్ సిక్స్ సహా అనేక హామీలను నేరవేర్చడం కూటమి ప్రథమ కర్తవ్యం.
2019 నుండి 2024 వరకు వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వ్యవస్థలు గాడి తప్పాయి. ఈ తరుణంలో గాడితప్పిన వ్యవస్థలన్నింటినీ తిరిగి పట్టాల మీదకు ఎక్కించాలంటే ప్రతి క్షణం ఎంతో అమూల్యమైంది. ఈ విలువైన సమయాన్ని వృధా చేస్తూ కక్ష సాధింపు చర్యలకే శక్తిని వెచ్చిస్తే కూటమిని ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది.
సామాజిక న్యాయం - నేతి బీరకాయ
సామాజిక న్యాయానికి ప్రాధాన్యతివ్వడంతో పాటు రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు తొలగిస్తారనే ఆశతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి పట్టం కట్టారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యిలా ఉంది. సామాజిక న్యాయం పాటించే విషయంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు పూర్తిగా ఫలమవుతున్నాయి. తెలుగుదేశం కమ్మ, జనసేన కాపు సామాజికవర్గాల కోసం పని చేసే పార్టీలుగా ముద్ర వేసుకుంటున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు వెన్నెముకగా ఉన్నారు. కానీ, వారికి కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత దక్కలేదు.
జనసేన తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురూ అగ్రవర్ణాల వారే ఉన్నారు. కాపులకు దశాబ్దాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైరం ఉన్నా వారు అన్నీ మర్చిపోయి జనసేనకు మూకుమ్మడిగా మద్దతిచ్చారు. ఫలితంగా జనసేన వంద శాతం స్ట్రయిక్ రేటుతో పోటీచేసిన 21 సీట్లు గెలిచింది, అంతే తప్ప కేవలం కాపులు, అగ్రవర్ణాల వాళ్లు ఓట్లు వేయడం వల్ల మాత్రమే కాదు. జనసేన నాయకత్వ తాజా వైఖరితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పార్టీలో చోటు లేదేమోననే భావన ఇప్పుడు నెలకొంది.
పంజాను బట్టి పులిని పోల్చుకోవాలి. 11 సీట్లు మాత్రమే గెలిచిందని వైసీపీ వాళ్లను కూటమి పార్టీలు తక్కువ అంచనా వేస్తున్నాయి. కానీ ఆ పార్టీకి సామాజిక బలం ఉంది. తక్కువ సీట్లు వచ్చినా సుమారు 40 శాతం ఓట్లు దక్కించుకుంది. గతంలో వైసీపీకి ఏకపక్షంగా మద్దతిచ్చిన సామాజికవర్గాలు 2024లో ఆ పార్టీకి కొంత మేర దూరం కావొచ్చు. వైఎస్సార్సీపీకి రెడ్లు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల మద్దతు మెండుగానే ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వారొక అడుగు వెనక్కి వేసినా, వేయాల్సి వచ్చినా.... యుద్ధనీతిలో ఇదీ ఒక భాగంగానే చూడాలి తప్ప, తక్కువ అంచనా వేస్తే కూటమి తమ గొయ్యిని తాము తవ్వుకుంటున్నట్టే!
వైసీపీ చేసిన తప్పులే వీరూ…
గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల, ఎంపీల కుటుంబ సభ్యుల పెత్తనం ఆరు నెలల తర్వాత మొదలైంది. నిన్నటి ఆ పార్టీ ఓటమికి ఇలా కుటుంబ సభ్యుల విచ్చలవిడితనం కూడా ఒక కారణమే. ఇదే తప్పును ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలూ చేస్తున్నారు. ఏ అధికారం? ఏం హోదా...? ఉందని నాగబాబును కలిసి నాయకులు, అధికారులూ బొకేలిస్తున్నారు? ఫలితాలు వచ్చిన రోజు నుంచే టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరి కొడుకులు, సోదరులు, అల్లుళ్లు, బావమరుదుల పెత్తనం రాష్ట్రంలో పెరిగిపోయింది. వాళ్లు కార్యకర్తల్ని, కష్టకాలంలో పార్టీకి తోడున్న నాయకుల్ని హీనంగా చూస్తున్నారని క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోంది. ఇదిలాగే కొనసాగితే, ఐదేళ్ల తర్వాత దాని ఎదురుదెబ్బ అనూహ్యంగా ఉండడం ఖాయం.
ఈవీఎంల మీద నెపం నెట్టేసి, వైఎస్సార్సీపీ తమ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోలేదు. కనీసం టీడీపీ, జనసేన నాయకులైనా వైఎస్సార్సీపీ ఎందుకు ఓడిపోయిందో అధ్యయనం చేయాలి. పాల్గనేవారు విసుక్కునేలా, గంటల తరబడి టెలీ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించే టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటి గమనించాలి. ఎంతసేపూ కేవలం తాను మాత్రమే మాట్లాడి వదిలేయకుండా, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తే ప్రజలు అధికారం ఇచ్చింది పగలు, కక్షలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదనే విషయం తెలిసివస్తుంది. పక్షం రోజుల కూటమి పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో.... చంద్రబాబు మోజుపడే ఐవీఆర్ఎస్ సర్వేనో లేక మరో సర్వే ఏదైనా చేయిస్తే ఇట్టే తెలిసివస్తుంది.
హుందాతనం అవసరం
అధికారంలోకి వచ్చినవారు కేవలం ధర్మకర్తలు మాత్రమే. ఈ పదవి శాశ్వతం అనుకోవద్దు. పెద్ద పెద్ద నియంతల్ని సైతం ప్రజలు దించేసిన రాజకీయ అనుభవం దేశ రాజకీయ చరిత్ర పుటల్లో ఉంది. పక్క రాష్ట్రం ఒడిశాలో నవీన్ పట్నాయక్ పాటిస్తున్న విలువల్ని చూసి తెలుగు రాష్ట్రాల నాయకులు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. విలువలతోనే మంచి పేరు వస్తుందని ఆయన నిరూపించారు. 24 ఏళ్లు ఒడిశా సీఎంగా పని చేసి, తన పదవి ప్రజాసేవకే గానీ, విలాసాలకు కాదని ఆయన చాటి చెప్పారు. ప్రతిపక్షంలో సైతం హుందాతనం చాటారు. మాజీ ముఖ్యమంత్రులు టంగుటూరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, త్రిపుర సీఎంగా చేసిన మాణిక్ సర్కార్ వంటి నాయకులు సాధారణ జీవితం గడిపి అసాధారణ సేవ చేసి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు. కానీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు కక్షసాధింపుల కోసం, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసం తీవ్రంగా పని చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అవకాశం రాగానే, ప్రజలు తమకు గుణపాఠం చెప్తారని మాత్రం వీళ్లు అర్థం చేసుకోవటం లేదు.
కూటమి తాజా ప్రభుత్వం, కేవలం అమరావతిలోనే అభివృద్ధి చేస్తే ప్రాంతీయ అసమానతలు వస్తాయి. కేంద్రీకృత పరిపాలనకు స్వస్తి చెప్పి వికేంద్రీకరణ చేయకపోతే, 2029 నాటికి రాష్ట్రంలో మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వైఖరి ఇలాగే సాగితే... ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్లు మళ్లీ, మరింత ఉదృతంగా తెరపైకి రావచ్చు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతిబిడ్డ పుట్టగానే ‘కేర్’మనకుండా ‘కెరీర్’ అంటున్నారు. మంచి కెరీర్ కావాలని, ఉపాధి అవకావాలు లభించాలని యువతరం కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్ష ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు లభించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలని, నదుల అనసంధానం జరగాలని కోరుకుంటున్నారు.
రాజ్యాధికార ఆకాంక్ష
సకల జనులు సామాజిక న్యాయం కోరుకుంటున్నారు. ముఖ్యంగా జనాభాలో 60 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమకు పాలనలో, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నిర్వీర్యమైన అన్ని వ్యవస్థలను గాడిన పెట్టాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు సహాయకారిగానే కాదు జవాబుదారిగా ఉండాలని కోరుకుంటున్నారు.
ప్రజల ఆకాంక్షలకు నూతన కూటమి ప్రభుత్వం తిలోదకాలిచ్చి కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకార దాడులకు పాల్పడడాన్ని చూస్తుంటే.... ప్రజాకవి కాళోజీ చెప్పిన మరో మాట కూడా ఈ సందర్భంగా గుర్తుకొస్తోంది. ‘ఎవరనుకున్నారు..ఇట్లయితదని...?’ లోగడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైనా, ఇప్పుడు కూటమి ప్రభుత్వమైనా, ‘మాకు ఎదురు లేదు’ అనే అహంతో ప్రజాభీష్టానికి భిన్నంగా పరిపాలన సాగిస్తే... ఆ ఎదురేమిటో ప్రజలే చూపిస్తారు. ‘‘అగ్ని...మనిషి చనిపోయాకే బూడిద చేస్తుంది..! అహం.. బతికుండగానే దహించేస్తుంది..!!’’ అనే సూక్తి ఉభయ పక్షాలకు వర్తిస్తుంది.
-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)