Gold loan Rules: బంగారు ఆభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ సంగతి మర్చిపోకండి.. లేకుంటే జేబులకు చిల్లు-taking loan on gold jewellery dont forget this otherwise your pockets will be empty ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gold Loan Rules: బంగారు ఆభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ సంగతి మర్చిపోకండి.. లేకుంటే జేబులకు చిల్లు

Gold loan Rules: బంగారు ఆభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ సంగతి మర్చిపోకండి.. లేకుంటే జేబులకు చిల్లు

Sarath chandra.B HT Telugu
May 29, 2024 11:19 AM IST

Gold loan Rules: భవిష్యత్తుపై భరోసా కోసం బంగారు ఆభరణాలపై పెట్టుబడులు పెడుతున్నారా, ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.

బంగారం రుణాలకు కొత్త వడ్డీరేట్లు
బంగారం రుణాలకు కొత్త వడ్డీరేట్లు

Gold loan Rules: బంగారానికి, భారతీయులకు విడదీయరాని బంధం ఉంటుంది. ప్రతి కుటుంబం ఎంతో కొంత బంగారం మీద పెట్టుబడిగా పెడితే భవిష్యత్ అవసరాలకు పనికొస్తుందని భావిస్తుంటారు. బంగారం వినియోగం, కొనుగోళ్లలో భారతీయుల తర్వాతే ఎవరైనా.. ఏ అవసరానికైనా బంగారం ఉపయోగ పడుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు తమ పెట్టుబడుల్ని బంగారం రూపంలో మార్చుకోడానికి ప్రయత్నిస్తుంటారు. బ్యాంకులు సైతం బంగారం నిల్వల్ని పెంచుకోడానికి యథా శక్తి ప్రయత్నిస్తుంటాయి.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బంగారం తనఖా ద్వారా బ్యాంకులకు వచ్చే ఆదాయం కూడా భారీగా ఉంటుంది. సగటున ప్రతి లక్ష రుపాయల రుణానికి కనీసం రూ.10-11వేల రుపాయల వడ్డీ లభిస్తుంది. బ్యాంకులు ఇచ్చే వ్యక్తిగత రుణాలతో పోలిస్తే బ్యాంకులకు ఈ రూపంలో వచ్చే వడ్డీ చాలా ఎక్కువ. ఫిక్సిడ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కనిష్టంగా ఆరున్నర శాతానికి మించదు. అదే బంగారం తాకట్టు రుణాల ద్వారా వసూలు చేసే వడ్డీ మాత్రం కనీసం 9శాతం ఉంటుంది.

బంగారం వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం బ్యాంకులకు లాభాలు కురిపిస్తుడటంతో గత కొన్నేళ్లుగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం పెద్ద ఎత్తున గోల్డ్ లోన్ వ్యాపారంలో అడుగుపెట్టాయి. చిన్నాపెద్ద పట్టణాలనే తేడా లేకుండా దేశమంతటా గోల్డ్ లోన్ కంపెనీలు వెలిశాయి. ప్రైవేట్ కంపెనీలకు బంగారు రుణాలు కాసులు కురిపిస్తుండటంతో ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులు సైతం గోల్డ్ లోన్ వ్యాపారాలను విస్తరించాయి.

ఇకపై రిటైల్ రుణాలే…

ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో బంగారం రుణాలు కాస్త తక్కువ వడ్డీకి లభించేవి. రుణ చెల్లింపులో కూడా వెసులుబాటు లభించేది. దీంతో చిరు వ్యాపారులు, వ్యక్తిగత అవసరాలు ఉన్న వారు బంగారం రుణాల కోసం ప్రభుత్వ బ్యాంకుల్ని ఆశ్రయించే వారు. గత మార్చి వరకు బంగారు రుణాలను చాలా వరకు అగ్రికల్చర్‌ రుణాలుగా మంజూరు చేసేవారు. దీంతో వడ్డీ భారం కాస్త తగ్గడంతో పాటు రుణ చెల్లింపు వ్యవధి ఏడాది వరకు ఉండేది.

ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి సంఖ్య పెరిగిపోవడం, బ్యాంకుల్లో బంగారం నిల్వలు నిరర్థక ఆస్తులుగా మారుతుండటంతో అగ్రికల్చర్ విభాగంలో బంగారం తాకట్టు రుణాలు మంజూరు చేయొద్దని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి శాఖలకు ఆదేశాలు జారీ చేశాయి. బంగారం ద్వారా వచ్చే ఆదాయం కూడా నిబంధనల మార్పుకు కారణంగా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అగ్రికల్చర్ రుణాలను మంజూరు చేయడంపై కూడా ఆర్‌బిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

దీంతో బ్యాంకు యాజమాన్యాల ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచి బంగారం తాకట్టు రుణాలను రిటైల్ రుణాలుగా మాత్రమే జారీ చేస్తున్నారు. తిరిగి చెల్లింపు వ్యవధిని ఆరు నెలలకు పరిమితం చేశారు. దీంతో పాటు ప్రతి నెల వడ్డీ చెల్లించకపోతే అసలుకు వడ్డీని జత చేసి వడ్డీ లెక్కించాలనే నిబంధన అమలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో బంగారం రుణాల కోసం బ్యాంకులకు వెళుతున్న వారు ఖంగుతింటున్నారు.

ప్రజలపైనే భారం…

బంగారం రుణాలను ఆరు నెలలకు పరిమితం చేయడంతో వాటిని రెన్యువల్ చేయాలంటే తిరిగి అప్రైజర్ ఛార్జీలు, బ్యాంకు కస్టమర్ ఛార్జీలను వినియోగదారులే భరించాల్సి వస్తోంది. ఒక్కో లావాదేవీకు అప్రైజర్‌ ఛార్జీ, బ్యాంకు ఛార్జీ రూపంలో సగటున రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. రుణం తీసుకునే సమయంలో ఓసారి, సకాలంలో దానిని చెల్లించకపోతే రెన్యువల్ సమయంలో ఆర్నెల్లకోసారి బ్యాంకులు ఈ ఛార్జీలను వడ్డించనున్నాయి.

ఇక కొన్ని బ్యాంకుల్లో రుణం కోసం వెళ్లే వారిని అప్రైజర్లు మభ్యపెట్టే ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆభరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే వాటిని చిన్నచిన్న రుణాలుగా తనఖా పెడితే విడివిడిగా రుణం నుంచి విడిపించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలాంటి చర్యలతో వినియోగదారులపై అదనపు భారం పడుతుంది.

ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో బంగారంపై ఇచ్చే రుణాలకు దాదాపు 9.5శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. గోల్డ్‌ లోన్‌ తీసుకునే ముందే వడ్డీ వివరాలను ఖరారు చేసుకోవడం, రుణచెల్లింపు పరిమితి, కస్టమర్ ఛార్జీలు, కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనలపై స్పష్టత తీసుకోవడం మరువకండి. బంగారాన్ని తాకట్టు పెట్టే సమయంలో బరువు విషయంలో కూడా ఖచ్చితమైన ధృవీకరణ పొందండి.

ఇటీవలి కాలంలో బ్యాంకుల్లో బంగారానికి రెక్కలొస్తున్న ఉదంతాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైతే తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. దానిని రాబట్టుకోడానికి చాలా తతంగం ఉంటుంది కాబట్టి బ్యాంకు రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం