TTD Ghee Issue: కల్తీ నెయ్యి వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు,స్వాగతించిన వైవీ, భూమన
TTD Ghee Issue: తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలుస్తుందనే ఆరోపణలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర విచారణ జరపాలని ఆదేశించింది.
TTD Ghee Issue: టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో స్వతంత్ర విచారణకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు సరిపోదని, కేంద్రం తరపున అధికారిని నియమించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పిటిషనర్లతో పాటు టీటీడీ, కేంద్ర ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో విచారణ చేపట్టాలని ఆదేశించింది.
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న లడ్డూ ప్రసాదాల వ్యవహారంలో రాజకీయాలు చేయొద్దని జస్టిస్ విశ్వనాథన్, గవాయ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. తిరుమల వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు, విమర‌్శలు చేయడానికి అనుమతించమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఏమాత్రం అమోదయోగ్యం కాదని జస్టిస్ గవాయ్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు.
దర్యాప్తు చేసిన తర్వాత దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని ధర్మాసనం ప్రకటించింది. సొలిసిటర్ జనరల్ సైతం స్వతంత్ర దర్యాప్తు చేపడితేనే ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఐదుగురు సభ్యులతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది.
భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఐదుగురు సభ్యులతో విచారణ చేపడుతున్నట్టు ప్రకటించింది. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ సంస్థ నుంచి మరొకరిని ఈ బృందంలో సభ్యులుగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. లడ్డూ ప్రసాదాలపై రాజకీయాలు చేయగడం తగదని ఆదేశించింది.విచారణకు ఎలాంటి గడువును ప్రకటించలేదు.
తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువులు కొవ్వు కలుస్తోందని, వైసీపీ హయంలోనే ఇలా జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించడం దుమారం రేపింది. ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు పలు సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించడంతో సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది.
స్వాగతించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన
లడ్డూ ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందనే ఆరోపణలపై సీబీఐ డైెరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు స్వాగతించారు. వైసీపీపై నిందలు మోపుతూ దుష్ప్రచారం చేశారని దీనిపై విచారణలో నిజాలు బయటకు వస్తాయన్నారు. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలతో పాలకమండలికి సంబంధం ఉండదని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు నిర్ణయం తాము తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. జూన్‌లో టీడీపీ వచ్చిన తర్వాత నెయ్యి సరఫరా జరిగిందని, దీనికి బాధ్యులెవరో విచారణలో తేలుతుందన్నారు.