Note For Vote Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట, ఓటుకు నోటు కేసు పిటిషన్లు డిస్మిస్- ఆర్కేకి మందలింపు
Note For Vote Case : సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రాజకీయ కక్షలకు కోర్టును వేదిక చేసుకోవద్దని ఆర్కేని మందలించింది.
Note For Vote Case : సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించింది. నోటుకు నోటు కేసులో వైసీపీ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అంతేకాకుండా పిటిషనర్ ఆర్‌కేని సుప్రీంకోర్టు ధర్మాసనం మందలించింది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో ఉన్నారు.
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, తెలంగాణలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు భారీ ఎత్తున నగదు ఇచ్చారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రేవంత్ రెడ్డి, స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇవ్వడం రెడ్ హ్యాండెడ్‌గా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది.
అలాగే అదే సమయంలోనే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డులు కూడా బయటకు వచ్చాయి. మొత్తం ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహరం మొత్తం చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. దీంతో అప్పటి వరకు ఉమ్మడి రాజధానిలో భాగంగా ఏపీ కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌లో నిర్వహించిన చంద్రబాబు నాయుడు, తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అమరావతి తన కార్యకలాపాలు మార్చారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు.
ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐ అప్పగించాలని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్‌కే) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్‌కే దాఖలు చేసిన ఈ రెండు పిటిషన్లపై విచారణ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి బుధవారం ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం రెండు పిటిషన్లను డిస్మిస్ చేసింది.
ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని, సాక్షి, బాధితుడు కాని వైసీపీ నేత ఆర్‌కే, ఈ కేసు ఛార్జ్‌షీట్ దాఖలు అయినప్పటికీ, మళ్లీ ప్రెష్‌గా విచారణ జరపాలని లోయర్ కోర్టు (ఏసీబీ కోర్టు)లో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏసీబీ కోర్టు ఆర్‌కేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై చంద్రబాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అక్కడ విచారణ జరిగి ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆర్‌కే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ఆర్‌కే పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది.
పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫోన్ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని, ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామని, అదే గైర్హాజరు అయితే రూ.2 కోట్లు ఇస్తామని చెప్పారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు తరపున రేవంత్ రెడ్డి బేరసారాలు జరిపారని, ఈ కేసులో ఏ1 రేవంత్ రెడ్డి, ఏ2 ఉదయ సింహ అని, స్టీఫెన్ సన్ ఇంటికి రేవంత్ రెడ్డి డబ్బులతో వెళ్లారని, బ్రీఫ్డ్ మీ కాల్‌లో చంద్రబాబు రూ.5 కోట్లు ఆశ చూపారని తెలిపారు. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, ఏఓఆర్ శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.
ఆర్‌కే దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు, ఆర్‌కేని మందలించింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదికగా చేసుకోవద్దని హెచ్చరించింది. ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి, కోర్టుతో ఆటలాడుకోవద్దని తీవ్రస్థాయిలో మండిపడింది. పిటిషనర్‌కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపై ఆరా తీసిన ధర్మాసనం, కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సూచించింది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం