Anakapalle Incident : అనకాపల్లి ఘటనపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం
Anakapalle Incident :అనకాపల్లి జిల్లా కైలాస అనాథాశ్రమం ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Anakapalle Incident : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం నారా చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో నలుగురు చిన్నారులు చనిపోయారు. పలువురు చికిత్స పొందుతున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఘటన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని మంత్రి లోకేశ్ కు సూచించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
అసలేం జరిగింది?
అనకాపల్లి జిల్లాలోని కైలాసపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనాథాశ్రమంలో విద్యార్థులకు పంచి పెట్టిన సమోసాలు తిని నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అనకాపల్లి అనాథశ్రమంలో నలుగురు చిన్నారుల మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం డివిజన్ పరిధిలోని కైలాసపట్నంలో ఉన్న అనాథాశ్రమంలో 80 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా సమీపంలోని గిరిజన గ్రామాలకు చెందిన ఆదివాసీలు. శనివారం సాయంత్రం అల్పాహారంగా విద్యార్థులకు సమోసాలను ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. శనివారం పాఠశాల ముగిసిన తర్వాత పలువురు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఆదివారం అస్వస్థతకు గురైన విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఒకటో తరగతి చదువుతున్న జాషువా, మూడో తరగతి చదువుతున్న భవానీ, శ్రద్ధ, నిత్యలు ప్రాణాలు కోల్పోయారు.
సంబంధిత కథనం