Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం, భర్తపై కోపంతో కుమారులకు కూల్‌డ్రిక్‌లో విషమిచ్చి భార్య ఆత్మహత్యాయత్నం
Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రిక్‌లో కలిపిన విషం ఇచ్చి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం, మలాగం పంచాయతీ కుముందవానిపేట గ్రామంలో మంగళవారం పెను విషాదం చోటు చేసుకుంది. తల్లి తన ఇద్దరు కుమారులకు శీతల పానీయాల్లో ఎలుకల మందు కలిపి తాగించి, తాను ఆత్మహత్యయత్నం చేసింది. కుముందవాని పేట గ్రామానికి చెందిన డెక్కల రాజుతో అదే గ్రామానికి చెందిన దుర్గకు పన్నెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి రుషి (9), బాలాజీ (8), అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రాజు శ్రీకాకుళంలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త దూరంగా ఉండటంతో జీవితం వీద విరక్తి చెంది అఘాయిత్యానికి పాల్పడింది దుర్గ. మంగళవారం గ్రామంలో దసరా వారాలు కావడంతో తన ఇంటికి భోజనాలలకు రావాలని దుర్గను తమ్ముడు హరి తన ఇంటికి పిలిచాడు.
దానికి ఉదయమే వస్తానని చెప్పి ఆమె ఎంతకూ రాకపోయే సరికి దుర్గ ఇంటికి హరి వెళ్లాడు. ఉదయం తొమ్మిది గంటలు దాటినప్పటికీ తలుపులు వేసి ఉండటంతో వాటిని తెరిచేందుకు హరి ప్రయత్నించాడు. అయినా రాకపోవడంతో అనుమానం వచ్చిన హరి స్థానికులను పిలిచాడు. స్థానికుల సహాయంతో హరి బలవంతంగా తెరిచాడు. ఇంట్లో ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్నారు. అక్కడే కొన ఊపిరితో ఉన్న దుర్గను గమనించి పోలీసులుకు సమాచారం ఇచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దుర్గను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
టెక్కలి రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శీతల పానీయంలో విషం కలిపి తాగించడం వల్ల చిన్నారులు చనిపోగా, అది తాగిన తల్లి దుర్గ కొన ప్రాణంతో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చిన్నారుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. భర్త సరిగా చూడకపోవడం వల్ల జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యాయత్నం చేశానని దుర్గ పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు చిన్నారు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి బంధువుల, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి రాజు గుండెలు బాదుకుని ఏడ్చారు. ఈ ఘటనపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఘటనకు గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
జగదీశ్వరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు