Son Killed Parents: ఆస్తి పంచుతామన్నందుకు తల్లిదండ్రుల్ని చంపేశారు.. అన్నమయ్య జిల్లాలో ఘోరం..
Son Killed Parents: అన్న కొడుకులకు కూడా ఆస్తిలో భాగం ఇస్తామన్నందుకు తల్లిదండ్రులను చిన్న హతమార్చిన ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది.
Son Killed Parents: అన్నమయ్య జిల్లాల్లో ఘోరం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే హత్య చేసిన ఉదంతం బయటపడింది. తల్లిదండ్రులను కన్న కొడుకు, కోడలే కడతేర్చారు. పెద్ద కుమారుడి ఇద్దరు పిల్లలకు ఆస్తిలో సగం భాగం ఇస్తామన్న పాపానికి ఈ దారుణానికి ఒడిగట్టారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి, వారికి మంచి భవిష్యత్ ఇవ్వాలని పరితమించే, దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడిన తల్లిదండ్రులకు చివరకు విషాదమే మిగిలింది.
ఈ హృదయ విషాదకర ఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం, గుర్రప్పగారి పల్లె పంచాయతీ కొత్తవడ్డేపల్లిలో చోటు చేసుకుంది. ముష్ఠిచెక్క నూరి పసరును తల్లిదండ్రులకు కొడుకు రమణయ్య, కోడలు కళావతి బలవంతంగా తాగించారు. విషపూరిత పసరు తాగడంతో వృద్ధ తల్లిదండ్రులు ఉప్పుతోళ్ల నాగసుబ్బన్న (75), నాగమ్మ (70) మృతి చెందారు. ఆస్తి కోసమే జరిగిన ఈ ఘటన మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉంది.
ఏం జరిగిందంటే…
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం, గుర్రప్పగారి పల్లె పంచాయతీ కొత్తవడ్డేపల్లికు చెందిన ఉప్పుతోళ్ల చిన నాగ సుబ్బన్న (75), ఉప్పుతోళ్ల నాగమ్మ (70) దంపతులకు ఇద్దరు సంతానం. ఇద్దరూ మగ బిడ్డలే. వీరిలో పెద్ద కుమారుడు, ఆయన భార్య చనిపోయారు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. వృద్ధ దంపతులు తమకున్న పది ఎకరాల భూమిలో సగం భాగం అంటే ఐదు ఎకరాలు పెద్ద కుమారుడి ఇద్దరు పిల్లలకు రాసి ఇస్తామని అన్నారు. అందుకు చిన్న కుమారుడు ఉప్పుతోళ్ల రమణయ్య, కోడలు కళావతి ఒప్పుకోలేదు.
ఆస్తి మొత్తం తమకే కావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వృద్ధ దంపతులిద్దరూ చిన్న కుమారుడి వద్దే ఉంటున్నారు. తల్లిదండ్రులతో కొడుకు, కోడలు నిరంతరం గొడవలు పడేవారు. ఆస్తి కోసం తరచూ వీరి మధ్య గొడవులు జరిగేవి. తమ ఆస్తిలో పెద్ద కుమారుడి పిల్లలకు సగం ఇస్తామని ఆ వృద్ధ దంపతులు తేల్చి చెప్పారు. దీంతో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న చిన్న కుమారుడు రమణయ్య, కళావతి వారిని ఎలాగైనా మట్టుపెట్టాలని భావించారు.
అందులో భాగంగానే గురువారం ఉదయం ముష్టి చెక్క బెల్లం నూరి దాని పసరు తల్లిదండ్రులిద్దరికి బలవంతంగా చిన్న కుమారుడు రమణయ్య, కోడలు కళావతి తాగించారు. అది తాగిన చిన్ననాగ సుబ్బన్న, నాగమ్మ దంపతులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీంతో 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. 108 వాహనం రావడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతు తొలిత నాగమ్మ మృతి చెందగా, కొద్ది సేపటికే చిన్న నాగ సుబ్బన్న మృతి చెందారు. తమ మృతికి కారణం తన చిన్న కుమారుడు, చిన్న కోడలే కారణమని పోలీసులకు ఆ వృద్ధ దంపతులు తెలిపారు. బంధువులు, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. ఆ వృద్ధ దంపతుల మృతికి కారణమైన చిన్న కుమారుడు రమణయ్యను, చిన్న కోడలు కళావతిని శిక్షించాలని బంధువులు కోరారు. సీఐ తులసిరామ్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)