AP Weather Updates: బంగాళఖాతంలో అల్పపీడనం, అరేబియాలో తేజ్ తుఫాన్-simultaneous cyclones in bay of bengal and arabian sea ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Simultaneous Cyclones In Bay Of Bengal And Arabian Sea

AP Weather Updates: బంగాళఖాతంలో అల్పపీడనం, అరేబియాలో తేజ్ తుఫాన్

Sarath chandra.B HT Telugu
Oct 23, 2023 09:42 AM IST

AP Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.

 బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్
బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ (https://unsplash.com)

AP Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండంగా మారిన తర్వాత దాని దిశ గమనాన్ని బట్టి ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. ఈ క్రమంలో ఉత్తరంగా దిశ మార్చుకుని ఒడిశాలోని పారాదీప్‌కు 520 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది.

ఇది మరింత బలపడి ఆదివారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలపడి సోమవారం ఉదయం వరకు ఉత్తరంగా పయనించి తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌ వైపు వెళ్లనుంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్ననికి తుఫాన్‌గా మారనుంది. దీనికి ‘హమూన్‌’ నామకరణం చేయనున్నారు.

తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో ఏపీలోనూ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

మరోవైపు అరేబియా మహాసముద్రంలో తేజ్‌ తుఫాన్‌ ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఇలాంటివి ఏర్పడటం అరుదుగా జరుగుతందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. గతంలో 2018లో ఒకసారి జరిగిందని గుర్తు చేస్తున్నారు. బంగాళాఖాతంలో హమూన్‌ తుఫాన్‌ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తేజ్‌ తుపాన్‌ ఆదివారం తీవ్ర తుఫానుగా మారి యెమెన్‌-ఒమన్‌ తీరాల వైపు పయనిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.

ఈ తుఫాన్‌ వాయువ్య దిశగా కదిలి, యెమెన్‌, ఒమన్‌ మధ్య తీరం దాటుతుందని ఐఎండి అంచనా వేసింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరానికి ఇరువైపులా ఒకేసారి రెండు తుఫానులు సంభవించడం చాలా అరుదని వాతావరణ నిపుణులు తెలిపారు. చివరి సారిగా 2018లో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.

హమూన్‌ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ తీరం దిశగా కదులుతున్నది. మరి కొన్ని గంటల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని, కేరళ, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హ‍మూన్‌ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌‌పై పెద్దగా ఉండదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి నుంచి ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గాలులు వీస్తాయని, శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మోస్తరుగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాయుగుండంపై గంపెడాశతో ఎదురుచూసిన కోస్తా రైతాంగానికి తీవ్ర నిరాశే మిగిలింది. మూడు వారాల నుంచి వర్షాలు లేక ఎండిపోతున్న ఖరీఫ్‌ పంటలను వాయుగుండం రూపంలో వర్షాలు కురిసి ఆదుకుంటుందని భావించారు.

WhatsApp channel