Visakha CRZ Violations: భీమిలీ సముద్ర తీరంలో విజయసాయి రెడ్డి కుమార్తె ఆక్రమణల తొలగింపు
Visakha CRZ Violations: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె భీమిలి సముద్ర తీరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గ్రేటర్ విశాఖ మునిసిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఉదయాన్నే జేసీబీలతో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు తొలగించారు.
Visakha CRZ Violations: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి సముద్ర తీరంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా ఝుళిపించింది. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనల్ని ఉల్లంఘించి తీరంలో కాంక్రీట్ గోడలు నిర్మించడంపై ఫిర్యాదులు అందడంతో జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరంలో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహా రెడ్డి పేరిట సముద్రం ఒడ్డున నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం కూల్చివేశారు. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అక్రమ కట్టడాలను తొలగించారు.
విజయ సాయి రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టారు. ఈ వ్యవహారంపై జనసేన కార్పోరేటర్ పీతలమూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కూడా దాఖలు చేశారు. విచారణ సమయంలో తమకు కూల్చివేతల నుంచి రక్షణ కల్పించాలంటూ విజయ సాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది.
తీరప్రాంతంలో నిర్మించిన కట్టడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని జీవీఎంసీ హైకోర్టు స్పష్టం చేయడంతో 15 రోజుల్లో చర్యలు తీసుకొని తమకు తెలియజేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం జెసిబిల సాయంతో అక్రమ కాంక్రీట్ గోడలను కూల్చివేశారు. ఈ నివేదికను సోమవారం జీవీఎంసీ ఏపీ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖ నుంచి భీమిలి వరకు సాగర తీరంలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున కట్టడాలు వెలిశాయి.
ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి వ్యవహరించిన సమయంలో సాయిరెడ్డి సూచనలతో వీటన్నింటిని జీవీఎంసీ అధికారులు నోటీస్ ఇచ్చి తొలగించారు. ఆ తరువాత అంతకు ముందు కంటే రెట్టింపు సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి.
భీమిలి సాగర తీరానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని సి ఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొత్తగా పలు కట్టడాలు 2023, 24 సంవత్సరాలలో వెలిశాయి.హైకోర్టు ఉత్తర్వులతో విజయ సాయి రెడ్డి కుమార్తె కట్టడాన్ని కూల్చివేసిన నేపథ్యంలో మిగిలిన కట్టడాల విషయంలో జీవీఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.