Prakasam Barrage Water: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాల్వలకు నీటి విడుదల, ఆదుకున్న గోదావరి జలాలు
Prakasam Barrage Water: కృష్ణా డెల్టా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరీక్షణ ఫలించింది. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాల్వలకు ఏపీ మంత్రులు నీటిని విడుదల చేశారు.
Prakasam Barrage Water: ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు నీటిని మంత్రులు విడుదల చేశారు. డెల్టా సాగు, తాగు అవసరాల కోసం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు.
డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి 500 క్యూసెక్కులను విడుదల మంత్రి నిమ్మల విడుదల చేశారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. - జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖను 20 ఏళ్లు వెనక్కి లాగారని ఆరోపించారు. పట్టిసీమ వట్టిసీమన్న జగన్.. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్య మిచ్చారని, ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామన్నారు. బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాలకు నీటి విడుదల చేస్తున్నామని ప్రకటిచారు.
వైసీపీ హయంలో అత్యవసరమైన తాగునీటి రంగం సైతం నిర్లక్ష్యానికి గురైందని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి.. సద్వినియోగం చేసుకొని ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషిచేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు అన్నారు.
సమర్థవంతమైన జల వనరుల నిర్వహణ ద్వారా పెద్ద ఎత్తున సంపద సృష్టించవచ్చని.. తద్వారా సమాజంలోని అన్ని వర్గాలూ లాభపడటమే కాకుండా ఆయా ప్రాంతాలు, రాష్ట్రం సుభిక్షమవుతుందని పేర్కొన్నారు. ఉన్న ఆయకట్టును కాపాడుకుంటూ కొత్త ఆయకట్టు అభివృద్ధికి కృషిచేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని, రైతులను అభివృద్ధి పథంలో నడిపించొచ్చన్నారు.
ముఖ్యమంత్రి ఎంతో ముందుచూపుతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని.. దీంతో గోదావరి జలాలు, కృష్ణకు చేరి దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు, 30-40 లక్షల మందికి తాగునీరు అందించేందుకు వీలవుతోందన్నారు.
నిర్లక్ష్యానికి గురైన పట్టిసీమతో పాటు తాడిపూడి, పురోషోత్తపట్నం, పుష్కరల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టిసీమ నుంచి 6,500 క్యూసెక్కుల వరకు నీరు విడుదలవుతోందని.. మరో 500-600 క్యూసెక్కుల తాడిపూడి నీరు కూడా దీనికి తోడవుతోందని వివరించారు. ఈ రోజు కాలువలకు నీరు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని.. ఈ నీటిని తొలి ప్రాధాన్యంగా తాగునీటికి తర్వాత ఖరీఫ్ నారుమళ్లకు ఉపయోగించుకోవాలని సూచించారు.
తూర్పు డెల్టాలో ఎన్‌టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 7,38,000 ఎకరాలకు సాగునీరుతో పాటు 11 నియోజకవర్గాల పరిధిలో చెరువులను నింపి ప్రజల దాహార్తిని తీర్చేందుకు వీలవుతుందన్నారు. డెల్టా కాలువలు, డ్రెయిన్లలో పూడిక, గుర్రపు డెక్క, తూటికాడ వల్ల నీరు సరిగా ప్రవహించడం లేదని.. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా యుద్ధ ప్రాతిపదికన గుర్రపుడెక్క, తూడు తీసే పనులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
సాగునీటి రంగానికి తీవ్ర నష్టం: మంత్రి కొలుసు పార్థసారథి
గత ప్రభుత్వంలో నిర్వహణ లేక సాగునీటి రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని.. చిన్నపాటి వర్షాలకు పంట నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీటి కాలువలతో పాటు డ్రెయిన్లు చాలా ముఖ్యమని.. వీటిలో పూడిక తీయకపోవడం వల్ల కృష్ణా డెల్టా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు.
పెడన, అవనిగడ్డ, బందరు ప్రాంతాల రైతులు ఇబ్బందిపడ్డారన్నారు. మెట్టప్రాంతాలైన నూజివీడు, మైలవరం, తిరువూరు ప్రాంతాలకు ప్రాణాధారమైన చింతలపూడి ఎత్తిపోతలకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తే.. గత ప్రభుత్వం రూ. 50 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. దాదాపు 2,80,000 ఎకరాలకు సాగునీరు అందించగలిగే సామర్థ్యమున్న చింతలపూడిని నిర్లక్ష్యం చేయడం వల్ల పంట భూములు బీళ్లుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇంతలా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి రంగం అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. కాలువలకు నీరు విడుదల చేసే ముందు నిర్వహణ పనులు పూర్తిచేసేందుకు కృషిచేయడం జరుగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
చివరి ఎకరాకూ సాగునీరు: మంత్రి కొల్లు రవీంద్ర
పట్టిసీమ ఎత్తిపోతలను గతంలో హేళన చేస్తూ మాట్లాడారని.. నేడు ఆ పథకంతో ఎంత ప్రయోజనం జరుగుతుందో చూస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన నిర్వహణ పనులను పూర్తిచేసి చివరి ఎకరాకూ సాగునీరు అందించేందుకు కృషిచేస్తామన్నారు.