Edible Oil Prices: ఏపీలో రిఫైండ్ ఆయిల్‌ రూ.124, పామాయిల్ రూ.110కే విక్రయం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అమలు…-refined oil is sold at rs 124 palm oil at rs 110 for ration card holders in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Edible Oil Prices: ఏపీలో రిఫైండ్ ఆయిల్‌ రూ.124, పామాయిల్ రూ.110కే విక్రయం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అమలు…

Edible Oil Prices: ఏపీలో రిఫైండ్ ఆయిల్‌ రూ.124, పామాయిల్ రూ.110కే విక్రయం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అమలు…

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 10, 2024 08:36 PM IST

Edible Oil Prices: ఏపీలో వంట నూనెల ధరల నియంత్రణకు సర్కారు చర్యలు చేపట్టింది. రిఫైండ్ ఆయిల్‌, పామాయిల్ ధరలపై గరిష్ట ధరల్ని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ధరలతో విక్రయించాలని వ్యాపారులను మంత్రి నాదెండ్ల ఆదేశించారు.

ఏపీలో వంట నూనెల ధరలపై ప్రభుత్వ నియంత్రణ
ఏపీలో వంట నూనెల ధరలపై ప్రభుత్వ నియంత్రణ (HT_PRINT)

Edible Oil Prices: ఆంధ్రప్రదేశ్‌లో వంట నూనెల ధరలకు పౌరసరఫరాల శాఖ కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకమైన ధరల్ని అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల వ్యాపారులకు సూచించారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో వ్యాపారులతో వంటనూనెల ధరలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. హోల్‌సేల్‌ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లతో ధరల నియంత్రణపై సమీక్షించారు.

శ్రీకాకుళంలో ఉన్న ధరలనే చిత్తూరులో కూడా ఉండాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల ఆదేశించారు. ప్రజల కోసం- కలిసి పని చేద్దామని మంత్రి సూచించారు. రాష్ట్రంలో వంట నూనె ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిదేనని వ్యాపారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

వంటనూనె అమ్మకములో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని నిర్ణయించారు. సివిల్స్ సప్లయిస్ కమిషనర్ కార్యాలయంలో వంట నూనెల సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ మరియు వర్తకులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి రేషన్‌ కార్డుపై రిఫైండ్‌ ఆయిల్‌ను గరిష్టంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి రేషన్‌ కార్డుపై నెలకు సరిపడా వంట నూనెను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలోని కోటి 49లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డు సదుపాయం ఉండటంతో వారికి సబ్సిడీ ధరలపై వంట నూనె అందనుంది. మరోవైపు రేషన్‌ కార్డులు లేని కుటుంబాల విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు వంట నూనెల ధరల నియంత్రణ, కృత్రిమ కొరత, నిల్వలను దాచి పెట్టడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వ్యాపారులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులు వంట నూనెల ధరల విధానాల వల్ల ఎదురవుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సబ్సిడీ ధరలకు రేషన్ కార్డులపై విక్రయం అమలులో ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.

Whats_app_banner