Chandrababu Health : జైలులో చంద్రబాబు రూముకు ఏసీ సౌకర్యం ఏర్పాటు చేయండి, ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. వైద్యుల నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
Chandrababu Health : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బ్యారక్ లో చల్లదనం ఉండేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు డీహైడ్రేషన్, స్కిల్ అలర్జీ సమస్య తలెత్తినట్లు వైద్యులు కోర్టుకు నివేదిక అందించారు. దీంతో పాటు చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఆయన ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై స్పందించిన ఏసీబీ కోర్టు వైద్యుల సూచనలకు అనుగుణంగా చంద్రబాబు బ్యారక్‌లో చల్లదనం ఉండేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. జైలులో చంద్రబాబు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించింది.
వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో
చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్లశాఖ కోస్టల్ ఏరియా డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్, ప్రభుత్వ వైద్యుల బృందం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. వైద్యుల బృందం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే చంద్రబాబు శరీరంపై దద్దుర్లు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు 67 కేజీల బరువు ఉన్నారన్నారు. వైద్యుల నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని పోలీసులు తెలిపారు. అయితే చంద్రబాబు బ్యారక్ లో చల్లని వాతావరణం ఉండేలా చూడాలని వైద్యులు సూచించారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలోనే వైద్యం అందిస్తున్నామన్నారు. వైద్యుల నివేదికను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు. చంద్రబాబుకు 24 గంటలు వైద్యం అందిస్తామని, వ్యక్తిగత వైద్యులతో ప్రభుత్వ వైద్యుల బృందం మాట్లాడారన్నారు. జైలులో ఇంటి వద్ద వాతావరణానికి భిన్నంగా ఉంటుందని డీఐజీ రవికిరణ్ తెలిపారు.
చంద్రబాబు స్కిన్ అలర్జీ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారని, ఆయనకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల జైలులో డీహైడ్రేషన్ గురైన చంద్రబాబు... తాజాగా స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన కీలక నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబుకు చేతులు, మెడ, ఛాతీ, గడ్డం, వీపు భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలర్జీ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆదేశాలతో వైద్యులు జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన వైద్యుల బృందం చంద్రబాబును పరీక్షించి జైలు అధికారులకు నివేదిక అందించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.