AP Rain ALERT : ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్... రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన!
ఏపీకి ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు, ఎల్లుండి పలుచోట్ల వానలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని తాజా వెదర్ బులెటిన్ పేర్కొంది.
శుక్రవారం ఏర్పడిన ఎగువ వాయు తుపాన్... పశ్చిమ మధ్య మరియు అనకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మీదుగా విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏపీ తీరంలో 1. 5 కిమీ నుంచి 4.5 కి.మీ మధ్య సముద్ర మట్టానికి ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉందని తాజా బులెటిన్ లో పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఈ 3 రోజులు ఇలా ఉంటుంది...
- ఐఎండీ అంచనా ప్రకారం.. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయి. ఎలాంటి హెచ్చరికలు లేవు.
- ఇక రాయలసీమ జిల్లాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడుతాయి.
ఇవాళ(శనివారం) పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
ఇక శ్రీకాకుళం,విజయనగరం,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,పల్నాడు, నెల్లూరు,అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వివరించింది.
తెలంగాణలోనూ వర్షాలు:
ఇక తెలంగాణలో (అక్టోబర్ 05) చూస్తే నిజామాబాజ్, సిరిసిల్ల, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(అక్టోబర్ 6) రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇవాళ హైదరాబాద్ సిటీలో చూస్తే ఆకాశం మేఘావృతమై ఉంటుందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.