TS BJP Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో ఎదురులేని సంజయుడు….!
TS BJP Bandi Sanjay బీజేపీ అధినాయకత్వం దగ్గర తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మంచి మార్కులు కొట్టేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలి రోజు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ స్వయంగా కితాబిచ్చారు. సంజయ్‌ను చూస్తే వెంకయ్య నాయుడు గుర్తొస్తున్నారని, అద్భుతంగా మాట్లాడతారని, పార్టీని అభివృద్ది చేయడానికి శ్రమిస్తున్నారని ప్రశంసించారు. బండి సంజయ్‌ను మాట్లాడటానికి కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడటానికి ప్రోత్సహించారు. బీజేపీ అగ్రనాయకత్వం వద్ద బండి సంజయ్‌కు దక్కుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఎన్నికల సారధిగా సంజయ్‌నే కొనసాగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
TS BJP Bandi Sanjay బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలిరోజు బండి సంజయ్‌పై ప్రశంసల జల్లు కురిసింది. ప్రజా సంగ్రామ యాత్ర నుంచి ఇతర నేతలు నేర్చుకోవాలంటూ ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. బండి సంజయ్ తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారో వివరించాలని ప్రధాని సూచించారు. హిందీలో మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటే తెలుగులో చెప్పాలని ప్రధాని సూచించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించడంతో పాటు సంజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రాయ యాత్రతో పాటు ఛార్మినార్ భాగ్య లక్ష్మీ ఆలయంతో వివిధ ప్రాంతాల్లో బండి సంజయ్ చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో సమావేశాల్లో బీజేపీ నాయకులు, అభినందనలతో ముంచెత్తారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి సంజయ్ శ్రమిస్తున్న తీరును ప్రధాని ప్రస్తావించారు. బండి సంజయ్ హిందీలో చెప్పలేకపోవడంతో తరుణ్ చుగ్‌ను సభకు వివరించాలని ప్రధాని సూచించారు. బండి సంజయ్ యాత్ర తీరును ఇతర రాష్ట్రాల నేతలు అధ్యయనం చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి యువమోర్చా నాయకుల్ని పంపించడం ద్వారా వారికి శిక్షణగా ఉపయోగపడుతుందని సూచించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, వివేక్, ఇంద్రసేనా రెడ్డి, విజయశాంతి, డికె.అరుణ, జితేందర్ రెడ్డి, ఇతర రాష్ట్రాలకు బాధ్యులుగా ఉన్న మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ సారథ్య బాధ్యతల నిర్వహణ బండి సంజయ్‌కే అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో బండి సంజయ్‌కు ఎదురులేదని తేలిపోయింది.
తెలంగాణలో కేసీఆర్ మార్కు రాజకీయాలతో మిగిలిన ప్రతిపక్షాలన్నీ డీలా పడిన బీజేపీ మాత్రం చురుగ్గా వ్యవహరిస్తోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రాయ యాత్రను విడతల వారీగా నిర్వహిస్తుడటం, ఇప్పటి వరకు యాత్ర జరిగిన ప్రదేశాలు అన్నిట్లో సక్సెస్ కావడంతో బీజేపీ హుషారు మీద ఉంది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో బోణీ కొట్టాలని ఎప్పట్నుంచో బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ రాష్ట్ర పగ్గాలు మరొకరికి అప్పగించి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహానికి అడ్డుకట్ట వేయకపోవచ్చని భావిస్తున్నారు. బండి సంజయ్‌కు ముందు బాధ్యతలు నిర్వహించిన వారితో పోలిస్తే మునుపటికి, ఇప్పటికీ స్పష్టమైన తేడా కనిపిస్తుండటంతో మరికొంత కాలం సంజయ్‌ను అధ్యక్షుడిగా కొనసాగిస్తారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని స్వయంగా బండి సంజయ్‌ను పొగడ్తలతో ముంచెత్తడంతో బండి సంజయ్ మరోసారి పాపులర్ అయ్యారు. నిన్న మొన్నటి వరకు కరీంనగర్ కు పరిమితమైన వ్యక్తి ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీలో చర్చనీయాంశం అయ్యారు. మున్సిపల్ కార్పొరేటర్ తర్వాత లోక్ సభ సభ్యుడుగా తొలిసారి గెలిచారు. తెలంగాణ అంతటా ఆయన గురించే చర్చ జరుగుతోంది. బీజేపీలో సీనియర్లైన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి నాయకులందరినీ వెనక్కి నెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సంజయ్ మార్క్ సక్సెస్ ఫలించడంతో ఆయనకు కలిసొచ్చింది. ఆ తర్వాత ప్రజా సంగ్రామ యాత్రలు సానుకూల ఫలితాన్నిచ్చాయి.
1994లో 23 ఏళ్ల వయసులో బండి సంజయ్ కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా పోటీ చేసి విజయం సాధించిన బండి సంజయ్ 25ఏళ్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2000 సంవత్సరంలో మరోసారి బ్యాంకు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 2005లో బీజేపీ నుంచి తొలిసారిగా కౌన్సిలర్‌గా గెలిచారు. 2010లో 48వ డివిజన్ నుంచి మరోసారి కార్పొరేటర్‌గా భారీ మెజారిటీతో గెలిచారు. 2014, 2018లలో కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్పై గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజారిటీ సాధించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో ప్రస్తుతం తెలంగాణలో బండి సంజయ్‌కు ఎదురు లేదనే సంగతి స్పష్టమైంది.
టాపిక్