Polavaram: డ్ర‌యాఫ్రం వాల్ నిర్మాణ కాంట్రాక్ట్‌ మేఘా కంపెనీకే.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంగీకారం-polavaram diaphragm wall construction contract to mega company state and centre accepted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram: డ్ర‌యాఫ్రం వాల్ నిర్మాణ కాంట్రాక్ట్‌ మేఘా కంపెనీకే.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంగీకారం

Polavaram: డ్ర‌యాఫ్రం వాల్ నిర్మాణ కాంట్రాక్ట్‌ మేఘా కంపెనీకే.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంగీకారం

HT Telugu Desk HT Telugu
Aug 17, 2024 09:44 AM IST

Polavaram: పోల‌వ‌రం ప్రాజెక్టు కొత్త‌ డ్ర‌యాఫ్రం వాల్ నిర్మాణ కాంట్రాక్ట్‌ను మేఘా కంపెనీకే ఇవ్వ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంగీకారం తెలిపాయి. ఈ మేర‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్ర‌బాబు స‌మావేశమై చ‌ర్చించారు.

కేంద్రమంత్రితో చంద్రబాబు
కేంద్రమంత్రితో చంద్రబాబు

శుక్ర‌వారం రాత్రి కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌లిశారు. దాదాపు గంట సేపు జ‌రిగిన ఈ భేటీలో.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయడం, డిజైన్లు వంటి అంశాల‌పై చ‌ర్చించారు. కాంట్రాక్ట‌ర్ల అంశంపైనా సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ భేటీలో సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ (సీడ‌బ్ల్యూసీ), పోల‌వ‌రం ప్రాజెక్టు అథార‌టీ (పీపీఏ) అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెంట కేంద్ర మంత్రులు కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్‌, భూప‌తి రాజు శ్రీ‌నివాస‌వ‌ర్మ‌, రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు ఉన్నారు.

yearly horoscope entry point

2022లో టెండ‌ర్లు పిలిచారు..

అనంత‌రం రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 2022లో సంభ‌వించిన‌ వ‌ర‌ద‌ల‌కు డ‌యాఫ్రం వాల్ కొట్టుకుపోయింద‌ని చెప్పారు. దాని మ‌ర‌మ్మ‌త్తుల కోసం 2022లో టెండ‌ర్లు పిలిచార‌ని.. అప్పుడు రూ.390 కోట్ల‌తో 29 వేల చ‌ద‌ర‌పు మీట‌ర్ల డ‌యాఫ్రం వాల్ ప‌నుల‌ను చేయ‌డానికి మేఘా కంపెనీ ముందుకొచ్చిందన్నారు. ఇప్పుడు కొత్త డ‌యాఫ్రం వాల్ 73 వేల క్యూబిక్ మీట‌ర్ల మేర నిర్మించాల్సి ఉంద‌ని.. దీన్ని 2022 నాటి ధ‌ర‌ల‌తోనే పాత కాంట్రాక్ట‌ర్‌కే ఇస్తామ‌ని స్పష్టం చేశారు.

అందుకే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది..

2019 మే నాటికి 70-80 శాతం ప‌నులు పూర్తి అయ్యాయ‌ని.. కాఫ‌ర్ డ్యామ్ జూన్‌-జులై నాటికి 100 శాతం పూర్తి అయ్యేద‌ని నిమ్మల వివరించారు. ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో డ‌యాఫ్రం వాల్ దెబ్బ‌తిన్న‌ద‌ని చెప్పారు. ఎగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయ‌కపోవ‌డంతో.. దాని గ్యాప్‌ల్లో 2020 ఆగ‌స్టులో వ‌చ్చిన 23 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద‌నీరు సుడులు తిరుగుతూ వెళ్ల‌డంతో.. డ్ర‌యాఫ్రం వాల్ ముందున్న ఇసుక 50-60 అడుగుల లోతు కోసుకుపోయి.. డ‌యాఫ్రం వాల్ కొట్టుకుకుపోయింద‌న్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. శుక్ర‌వారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్ర‌యంలో సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రులు, ఎంపీలు పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి స్వాగ‌తం ప‌లికారు. అనంతరం చంద్ర‌బాబు రోడ్డు మార్గంలో అధికారిక నివాసం జ‌న‌ప‌థ్-1కి బ‌య‌లుదేరారు. రాత్రి 7:30 గంట‌ల‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. అనంతరం ఎంపీలతో డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేడు ప్ర‌ధాని మోడీతో భేటీ..

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు శ‌నివారం భేటీ కానున్నారు. సాయంత్రం 4:30 గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీతో చంద్ర‌బాబు స‌మావేశం అవుతారు. అనంత‌రం సాయంత్రం 6 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ అవుతారు. రాత్రి ఏడు గంట‌ల‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అలాగే మ‌రికొంత మంది కేంద్ర మంత్రుల‌ను కూడా క‌లిసే అవ‌కాశం ఉంది. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత తొలిసారి చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌నకు వెళ్లారు. బ‌డ్జెట్‌లో అమ‌రావ‌తికి రూ.15 వేల కోట్లు రుణం, పోల‌వరానికి మ‌ద్ద‌తు మిన‌హా పెద్ద‌గా ఏపికి కేటాయింపులు లేవు. దీంతో బ‌డ్జెట్ స‌వ‌రించిన అంచ‌నాల్లో మ‌రిన్ని కేటాయింపులు చేయాల‌ని కోర‌నున్నారు. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు విడుద‌ల వంటి కోరుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

( రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )

Whats_app_banner